News

108 దేశాలు.. 12 వేలమంది బాలికలు.. చంద్రయాన్‌-4 ఉపగ్రహం తయారీకి శిక్షణ!

325views

అంతరిక్ష పరిశోధనల్లో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే దిశగా ఏరోస్పేస్‌ అంకురసంస్థ ‘స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా’.. సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇస్రో ‘చంద్రయాన్-4’ మిషన్‌లో ప్రయోగించేలా ఉపగ్రహాన్ని తయారు చేయడమే లక్ష్యంగా.. 108 దేశాలకు చెందిన 12 వేలమంది బాలికలకు అంతరిక్ష సాంకేతికతపై శిక్షణ ఇచ్చేందుకు ‘శక్తిశాట్‌ (ShakthiSAT)’ అనే మిషన్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన అధికార పోస్టర్‌ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము త్వరలో ఆవిష్కరించనున్నట్లు తెలిపింది.

‘‘శక్తిశాట్‌ మిషన్‌ కింద 108 దేశాలకు చెందిన 12 వేల మంది హైస్కూల్ విద్యార్థినులకు (14-18 ఏళ్లు) అంతరిక్ష సాంకేతికత, పేలోడ్ అభివృద్ధి, వ్యోమనౌక వ్యవస్థల గురించి ఆన్‌లైన్ శిక్షణ ఇవ్వనున్నాం. బ్రిటన్‌, యూఏఈ, బ్రెజిల్, కెన్యా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, గ్రీస్, శ్రీలంక తదితర దేశాలు ఇందులో భాగమవుతాయి. శిక్షణ అనంతరం ప్రతి దేశం నుంచి ఒకర్ని చొప్పున 108 మందిని ఎంపిక చేస్తాం. పేలోడ్‌లు, స్పేస్‌క్రాఫ్ట్ ప్రోటోటైప్‌లను రూపొందించడంలో శిక్షణ ఇస్తాం. ఇస్రో ‘చంద్రయాన్-4’ మిషన్‌లో ఉపగ్రహాన్ని ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ముందు నమూనా ప్రజెంటేషన్ ఇవ్వనున్నాం’’ అని మిషన్‌కు నేతృత్వం వహిస్తున్న శ్రీమతి కేసన్‌ తెలిపారు.

‘శక్తిశాట్‌’ మిషన్‌ కేవలం మన దేశానికే కాకుండా మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూర్చే సామర్థ్యం కలిగి ఉందని శ్రీమతి కేసన్‌ తెలిపారు. బాలికలను ప్రోత్సహించడం ద్వారా సాధికారతను కల్పించడం, జీవితాలను మార్చేసే అవకాశాలను అందించడమే తమ ప్రాధాన్యమని తెలిపారు. స్పేస్ కిడ్జ్ ఇండియా ఇప్పటివరకు 18కిపైగా బెలూన్‌ శాటిలైట్లు, మూడు సబ్‌ఆర్బిటల్ పేలోడ్‌లు, నాలుగు ఆర్బిటల్ ఉపగ్రహాలను ప్రయోగించింది. హైస్కూల్, కళాశాల విద్యార్థుల సాయంతో ఉపగ్రహాలను ప్రయోగించిన మొట్టమొదటి సంస్థగా పేరుంది.