ArticlesNews

భళారే.. కళారం..

373views

దసరా ఉత్సవాల్లో కళారాల సంబంరం ఒంగోలుకు ప్రత్యేకం. మైసూరు, కోల్‌కతా తర్వాత ఇక్కడే ఈ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. రక్తబీజుడిని హతమార్చిన కాళికామాత రౌద్రరూపంలో ఊరేగింపునకు బయలుదేరుతుంది. భక్తుల కోలాహలం, డప్పు వాయిద్యాలు, వివిధ రకాల వేషధారణల నడుమ నడిరేయి ఆరంభమయ్యే ఈ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. దుష్టశిక్షణ పూర్తిచేసుకుని వస్తున్న అమ్మవారికి జయజయధ్వానాలతో భక్తజనం స్వాగతం పలుకుతారు. ఏటా దుర్గాష్టమి, నవమి దినాల్లో నగరంలోని ఆరు దేవస్థానాల నుంచి అమ్మవారి కళారాలను ఊరేగిస్తారు. వందల ఏళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది.

వందేళ్లుగా…
ఒంగోలులో జరిగే కళారాల ఉత్సవానికి వందలాది సంవత్సరాల చరిత్ర ఉంది. అప్పట్లో చిన్న గూడు బండ్లు కట్టుకుని అమ్మవారి కళారాన్ని ఊరేగిస్తూ తప్పెట్లు వాయిస్తూ కాగడాలు పట్టుకుని అర్ధరాత్రి నుంచి నగరం మొత్తం తిరిగేవారు. తెల్లవారే వరకు ఈ సందడి కొనసాగేది. ఎంత రాత్రయినా సరే తమ వీధిలోకి వస్తున్న కళారాన్ని చూసి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి కర్పూర హారతులు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు అందుకునేవారు. ఇప్పటి కాలంతో పాటు ఉత్సవ తీరులోనూ ఆధునికత చోటుచేసుకుంది. అదిరిపోయే డీజే, బాణసంచా శబ్దాలతో దేవాలయాల నుంచి వీధుల్లోకి ఊరేగింపుగా వచ్చే అమ్మవారి కళారాన్ని దర్శిస్తే మళ్లీ ఏడాది వరకు ఎలాంటి దుష్టశక్తుల పీడ, ఈతి బాధలు ఉండవని భక్తుల నమ్మకం.

భక్తుల కొంగుబంగారం ఆరు కళారాలు…
ఒంగోలు నగరంలో మొత్తం ఆరు కళారాలు ఉన్నాయి. స్థానిక బాలాజీరావుపేటలో కనకదుర్గాదేవి, గంటాపాలెంలో పార్వతీదేవి, కొత్తపట్నం బస్టాండ్‌ నల్లూరి నర్సింగ్‌ హోం దగ్గర బాలాత్రిపురసుందరీదేవి, నరసింహస్వామి, ఏనుగుచెట్టు దగ్గర ఉన్న అంకమ్మపాలెం కాళికాదేవి, కేశవస్వామిపేటలోని మహిషాసురమర్ది కళారాలు ఉన్నాయి. నాలుగు కళారాలు పసుపు వర్ణంతో, అంకమ్మపాలెంలోని కాళికాదేవి ఎర్రగా, నరసింహస్వామి తెల్లగా ఉంటారు. కళారాల ఉత్సవం అద్భుత వీక్షణ దుర్గాష్టమి గురువారం రోజు ప్రారంభమైంది. అంకమ్మపాలెం కాళికాదేవి, కొత్తపట్నం బస్టాండ్‌ నల్లూరి నర్సింగ్‌ హోం దగ్గర బాలాత్రిపురసుందరీదేవి, బాలాజీరావుపేటలోని కనకదుర్గమ్మ నగర ఉత్సవానికి బయలుదేరారు. శుక్రవారం గంటాపాలెంలోని పార్వతీ అమ్మవారు, కొత్తపట్నం బస్టాండ్‌ నల్లూరి నర్సింగ్‌ హోం దగ్గర ఉన్న నరసింహస్వామి, కేశవస్వామిపేటలోని మహిషాసురమర్దిని నగర ఉత్సవానికి బయలుదేరతారు. నగరంలోని వేరువేరు మార్గాలలో పయనించి శుక్రవారం, శనివారం తెల్లవారుజామున మస్తాన్‌ దర్గాసెంటర్‌ వద్ద కళారాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు .

కళారం అంటే...
ఒకసారి రక్తబీజుడు అనే రాక్షసుడితో అమ్మవారు యుద్ధం చేయాల్సి వస్తుంది. అతని శిరస్సును ఖడ్గంతో ఖండిస్తుంది. రక్తం ధారలుగా నేల మీద కారుతుంది. ప్రతి రక్తపు చుక్క నుంచి మళ్లీ ఒక రక్తబీజుడు పుట్టుకు వస్తాడు. బ్రహ్మదేవుడు ఆ రాక్షసుడికి ఇచ్చిన వరంతో అమ్మవారితో యుద్ధం చేస్తూ పోటీగా నిలబడతాడు. అమ్మవారు తన శక్తి నుంచి నల్లని కాళీ రూపాన్ని సృష్టించి కాళికాదేవిగా పెద్ద నాలుకతో రక్తబీజుడి నుంచి కారే ప్రతి రక్తపు బొట్టును భూమి మీద పడకుండా తాగేస్తూ ఆ రాక్షసుడి శక్తిని హరించి అంతం చేస్తుంది. అప్పుడు ప్రజలంతా కాళికామాతకు జయజయ ధ్వానాలు పలికి అమ్మవారిని తమ మధ్య ఉండిపోవాలని కోరగా.. దానికి అమ్మవారు శ్రీఅలా కుదరదు.. ముల్లోకాల రక్షణ బాధ్యత నాదే కదా.. మీ కోరిక ప్రకారం ప్రజలందరికీ దుష్టశక్తుల భయం లేకుండా నా అంశంతో నిబిడీకృతమైన కళారాన్ని (నోరు తెరిచి ఉంచే శిరస్సు భాగం) ప్రసాదిస్తున్నాను.. దాని రూపాన్ని పూజించి ఆరాధించండి.. దసరా నవరాత్రుల్లో దుర్గాష్టమి, మహర్నవమి రోజుల్లో అర్ధరాత్రి కళారాన్ని నగర సంచారం చేయించండి.. నగరంలోని దుష్టశక్తులన్నీ పారిపోతాయిశ్రీ అని అభయమిస్తుంది. విష్ణుమూర్తి తత్వమైన నరసింహస్వామి కూడా కళారంగా వచ్చి మిమ్మల్ని తరింపజేస్తాడని అమ్మవారు వరమిస్తుంది. ఆ విధంగా ప్రారంభమైనదే మన కళారాల చరిత్ర.