News

మహిషాసురమర్దని అలంకారంలో దుర్గమ్మ

221views

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదోరోజు మహిషాసురమర్దని అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. పెద్ద ఎత్తు భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

లోకకంటకుడైన మహిషాసురుడిని చంపిన మహోగ్రరూపం ఇది. సకలదేవీ, దేవతల శక్తులన్నీ ఈ దేవీలో మూర్తీభవించి ఉంటాయి. మానవనేత్రంతో చూడ సాధ్యం కాని దివ్యతేజస్సుతో, అనేక ఆయుధాలతో సింహవాహినియై ఈ తల్లి భక్తులకు దర్శనభాగ్యం కలిగిస్తుంది. ఈ తల్లి అనుగ్రహం పొందితే అసాధ్యమనేది ఉండదు. మహిషాసుర సంహారం జరిగిన రోజునే ‘మహర్నవమి’గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజున చండీ సప్తశతీహోమం చేసిన వారికి శత్రుభయం ఉండదు. అన్నింటా విజయం కలుగుతుంది. ఓం ఐం హ్రీం శ్రీం సర్వసమ్మోహిన్యై స్వాహా అనే మంత్రాన్ని జపించి, పానకం, వడపప్పు, గారెలు, పులిహోర, పాయసాన్నం నివేదన చేయాలి. సువాసినీ పూజ చేసి, మంగళద్రవ్యాలు, శక్తికొద్దీ నూతన వస్త్రాలు పెట్టాలి.