News

17 మంది బంగ్లాదేశీయులను వెనక్కి పంపిన పోలీసులు

39views

బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తిన దగ్గరి నుంచి భారత్‌లోకి బంగ్లాదేశీయుల చొరబాటు యత్నాలు పెరిగిపోయాయి. మనదేశంలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్న బంగ్లాదేశీయులను సరిహద్దుల్లోని సైనికులు, పోలీసులు తిరిగి వారి దేశానికి పంపిస్తున్నారు.

తాజాగా ఎనిమిది మంది చిన్నారులు సహా 17 మంది బంగ్లాదేశీయులను అస్సాం రాష్ట్ర పోలీసులు సరిహద్దుల నుంచి వెనక్కి పంపించారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ ఒక ట్వీట్‌లో తెలిపారు. భారతదేశంలోకి బంగ్లాదేశీయుల చొరబాటు యత్నాలు గణనీయంగా పెరిగాయన్నారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కొంత భాగాన్ని మాత్రమే అస్సాం కాపాడుతోందని అన్నారు. పోలీసులు బంగ్లాదేశీయులను వెనక్కి పంపడాన్ని సీఎం మెచ్చుకున్నారు. కరీంగంజ్ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు నుండి చొరబడుతున్న బంగ్లాదేశీయుల ప్రయత్నాన్ని రాష్ట్ర పోలీసులు భగ్నం చేశారని శర్మ పేర్కొన్నారు.

ఈ నెలలో ఇప్పటివరకు దాదాపు 25 మంది చొరబాటుదారులను అస్సాం నుండి బంగ్లాదేశ్‌కు తిరిగి పంపించినట్లు శర్మ తెలిపారు. బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున చొరబాట్లు జరుగుతున్నాయని సీఎం తెలిపారు. బంగ్లాదేశ్ పౌరులు టెక్స్‌టైల్ పరిశ్రమలో పనిచేసేందుకు దక్షిణాది నగరాలకు చేరుకోవడానికి అస్సాంను రవాణా మార్గంగా ఉపయోగిస్తున్నారన్నారు. కాగా ఈశాన్య ప్రాంతంలోని 1,885 కి.మీ పొడవైన భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్‌ నిఘా మరింతగా పెంచింది.