ArticlesNews

ఆలయాలను ప్రభుత్వం పరిధిలోనుంచి తొలగించి సామాజికం చేయాలి : విహెచ్‌పి

36views

తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదం అపవిత్రం కావడంపై మనస్తాపానికి గురైన విశ్వహిందూ పరిషత్, దేవాలయాలను ప్రభుత్వపరం కాకుండా సామాజికీకరించాలని కోరింది. విహెచ్‌పి కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేంద్ర జైన్ తిరుమల ఉదంతంపై ఉన్నతస్థాయి న్యాయ విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు. భవిష్యత్తులో ఎటువంటి కుట్రలకూ అవకాశం లేని వ్యవస్థను నిర్మించాలన్నారు.

‘‘తిరుపతి బాలాజీ దేవాలయం నుంచి లభించే మహాప్రసాదం పవిత్రతపై హిందువులకు అపారమైన విశ్వాసం ఉంది. దురదృష్టవశాత్తు, ఆ మహాప్రసాదం తయారీకి ఉపయోగించే నేతిని ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనెతో కల్తీ చేయడం గురించి విచారకరమైన, హృదయవిదారకమైన వార్తలు వస్తున్నాయి. దేశంలోని హిందూ సమాజమంతా ఆ వ్యవహారంపై ఆగ్రహంతో ఉంది, ఆ ఆగ్రహం వివిధ రూపాల్లో వ్యక్తమవుతోంది. ఆ దురదృష్టకర నేరంపై అత్యున్నత స్థాయి న్యాయ విచారణ జరిపి, దోషులకు వీలైనంత త్వరగా కఠిన శిక్షలు వేయాలి’’ అని డాక్టర్ సురేంద్రజైన్ కోరారు.

దేశ రాజధానిలో పాత్రికేయుల సమావేశంలో డాక్టర్ జైన్ మాట్లాడుతూ “తిరుపతి బాలాజీ దేవాలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డు ద్వారా నిర్వహించబడుతోంది. అక్కడ, మహాప్రసాదం తయారీలో హిందూ విశ్వాసాలకు విరుద్ధంగా చేయడమే కాకుండా, హిందువులు అత్యంత గౌరవప్రదంగా అందించే ప్రసాదాన్ని ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు దుర్వినియోగం చేసినట్లు బాధాకరమైన నివేదికలు కూడా ఉన్నాయి. హిందూధర్మంపై దాడి చేసి హిందువులను మతం మార్చే సంస్థలకు గ్రాంట్లు ఇస్తున్నట్లు చాలా సార్లు నివేదికలు వచ్చాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక నుంచి కూడా అలాంటి వార్తలు వస్తున్నాయి’’.

‘‘జైపూర్‌లోని ప్రసిద్ధ గోవిందదేవ్‌జీ ఆలయం నుండి రాజస్థాన్‌లోని గత కాంగ్రెస్ ప్రభుత్వం ఈద్గాకు రూ9.82 కోట్లు ఇచ్చినట్లు కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వాలు దేవాలయాల ఆస్తులను, ఆదాయాన్నీ దుర్వినియోగం చేస్తూనే ఉన్నాయి. వాటిని హిందూయేతర లేదా హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నాయి. మన దేశంలో రాజ్యాంగమే అత్యున్నతమని పదే పదే చెబుతారు. దురదృష్టవశాత్తు, దేవాలయాలపై తమ నియంత్రణను ఏర్పరుచుకుంటున్న వివిధ ప్రభుత్వాలు రాజ్యాంగం ముసుగులో హిందువుల మనోభావాలను అత్యంత దారుణంగా మోసం చేస్తున్నాయి. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఏర్పాటైన ప్రభుత్వాలే రాజ్యాంగ స్ఫూర్తిని ధ్వంసం చేస్తున్నాయి. తమ స్వార్థ ప్రయోజనాల కోసం దేవాలయాలను స్వాధీనం చేసుకుంటూ రాజ్యాంగంలోని 12, 25, 26 అధికరణాలను బహిరంగంగా ఉల్లంఘిస్తున్నారు. హిందూ ఆలయాలు, ఆస్తుల నిర్వహణకు ప్రభుత్వాలు దూరంగా ఉండాలని న్యాయ వ్యవస్థ అనేక సందర్భాల్లో స్పష్టం చేసింది.’’

‘‘దేశానికి స్వతంత్రం వచ్చి 77 ఏళ్లయినా హిందువులు తమ దేవాలయాలను నడిపించుకోలేరా? మైనారిటీలు తమ మత సంస్థలు నడుపుకోవచ్చు కానీ హిందువులకు ఆ రాజ్యాంగ హక్కు ఎందుకు ఇవ్వలేదు? ముస్లిం ఆక్రమణదారులు దేవాలయాలను దోచుకుని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. బ్రిటిష్ వారు తెలివిగా చట్టాల రూపంలో ఆలయాలపై నియంత్రణను, నిరంతర దోపిడీని స్థాపించారు. స్వతంత్రం వచ్చి 77 ఏళ్లు గడుస్తున్నా భారత ప్రభుత్వం ఆ వలస భావజాలాన్ని కొనసాగిస్తుండడం దౌర్భాగ్యం. తమిళనాడులో దాదాపు 400కు పైగా దేవాలయాలను ఆక్రమించి అక్కడి హిందూ వ్యతిరేక ప్రభుత్వం యథేచ్ఛగా దోచుకుంటోంది. న్యాయవ్యవస్థ ఆదేశాలను సైతం లెక్కచేయకుండా హిందువుల విశ్వాసాన్ని, ఆస్తులను బహిరంగంగా దోచుకుంటున్నారు. అక్కడ చాలా పెద్ద దేవాలయాలు, భారీ నైవేద్యాలు ఉన్నా, వాటి పూజా సామాగ్రికోసం కనీస ఏర్పాట్లు చేయడం లేదు. కేరళలోని అనేక దేవాలయాల్లో ఇఫ్తార్ పార్టీలు ఇవ్వవచ్చు కానీ హిందువుల మతపరమైన కార్యక్రమాలకు భారీ రుసుము చెల్లించాలి.”

‘‘తిరుపతి బాలాజీ తదితర మందిరాలలో, వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమాల వల్ల ప్రభుత్వ నియంత్రణ నుంచి తమ ఆలయాలను తొలగించి ఆలయాల పవిత్రతను పునరుద్ధరించాలనే డిమాండ్ హిందూ సమాజంలో బలపడింది. దేవాలయాల ఆస్తి, ఆదాయాన్ని వాటి అభివృద్ధికి, హిందువుల మతపరమైన కార్యకలాపాలకు మాత్రమే ఉపయోగించాలి. ‘హిందూ విశ్వాసపు సంపద హిందువులకే చెందాలి’ అన్నది సార్వత్రికంగా ఆమోదించబడిన సూత్రం. వాస్తవమేమిటంటే దేవాలయాల ఆదాయం, ఆస్తులను అధికారులు, రాజకీయ నాయకులే కాకుండా కొన్నిసార్లు వారి అభిమాన హిందూ వ్యతిరేకులు కూడా బహిరంగంగా దోచుకుంటున్నారు’’.

‘‘అన్ని దేవాలయాలనూ అక్రమ, అనైతిక ఆక్రమణ నుంచి తక్షణమే విడిపించి, వాటిని హిందూ సాధువులు, భక్తులకు నిర్దిష్ట ఏర్పాటు ప్రకారం అప్పగించాలని విశ్వహిందూ పరిషత్ అన్ని ప్రభుత్వాలను కోరుతోంది. ఆ వ్యవస్థ ఆకృతి అనేక సంవత్సరాల ఆలోచన, చర్చల తర్వాత సాధుసంతులచే నిర్ణయించబడింది. ఆ నమూనా చాలా చోట్ల విజయవంతమైంది. పరస్పర చర్చల ద్వారానే మన దేవాలయాలను తిరిగి పొందగలం, దానికి పెద్దఎత్తున ఉద్యమం చేయాల్సిన అవసరం లేదని నమ్ముతున్నాము. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల గవర్నర్ల ద్వారా ప్రభుత్వాలకు మెమోరాండం సమర్పిస్తాము. ఈ ప్రభుత్వాలు హిందూ దేవాలయాలను తిరిగి సమాజానికి అందించకపోతే పెద్దఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. దేవాలయాల ప్రభుత్వీకరణ కాదు సామాజికీకరణ కావాలి, అప్పుడే హిందువుల విశ్వాసం గౌరవించబడుతుంది’’. అని డాక్టర్ సురేంద్ర జైన్ డిమాండ్ చేసారు.