News

మహంత్ రామగిరికి ఇస్లాం ఛాందసుల బెదిరింపులు

41views

నుపుర్ శర్మని ఇస్లామిక్ ఛాందసులు బెదిరించిన తీరును హిందువులెవ్వరూ మరిచిపోలేదు. అచ్చు ఇలాంటి ఘటనే మరొక్కటి తాజాగా జరిగింది. మహారాష్ట్ర నాసిక్ లోని సరళా ద్వీపానికి చెందిన మహంత్ రామగిరిని కూడా ఇస్లామిక్ ఛాందసులు అలాంటి బెదిరింపులకే దిగారు. బంగ్లాదేశ్ లో హిందువులు, హిందువుల దేవాలయాలపై జరుగుతున్న హింసా కాండను నిరసిస్తూ రామగిరి స్వామి ఓ ప్రకటన విడుదల చేశారు. ఇది తమకు అభ్యంతరకరమంటూ కొందరు ఇస్లామిక్ ఛాందసులు వాదనకు దిగారు. అంతేకాకుండా సర్ తన్ సే జుదా (మొండెం, తల వేరు చేస్తాం) అంటూ బెదిరింపులకు కూడా దిగారు. అంతేకాకుండా ఇస్లాం ప్రవక్తపై మహంత్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ కేసులు కూడా పెట్టారు. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ తాము బంద్ కూడా నిర్వహించారు. ఈ బంద్ లోనే సర్ తన్ సే జుదా అంటూ నినాదాలు చేశారు. వెంటనే స్వామీజీని అరెస్ట్ చేయాలంటూ ఛాందసులు డిమాండ్ చేస్తున్నారు.

పరిస్థితిని గమనించిన పోలీసులు మహంత్ రామగిరికి భద్రతను ఇచ్చారు. అయితే.. ఇస్లాం ఛాందసుల వ్యాఖ్యలు, డిమాండ్లపై మహంత్ రామగిరిజీ మహారాజ్ స్పందించారు. తాను ఎలాంటి కించపరిచే, తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని, తాను చేసిన వ్యాఖ్యలన్నీ వారి పుస్తకాల్లోనే వున్నాయని స్పష్టం చేశారు. అనవసరంగా కోపం తెచ్చుకోవద్దని అన్నారు. తాను మాట్లాడింది నిజమేనని, పుస్తకాల్లో వుంది కాబట్టే మాట్లాడానని అన్నారు. ప్రతి ఒక్కరికీ వారి సొంత అభిప్రాయమంటూ ఒకటి వుంటుందని, ఏది చెప్పాలో అదే చెప్పానని అన్నారు.

ఇంతకీ మహంత్ స్వామీజీ ఏమన్నారు?
ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహంత్ రామగిరి మాట్లాడుతూ… ‘‘బంగ్లాదేశ్ లో హిందువులపై అకృత్యాలు జరుగుతున్నాయి. హిందువులమైన మనం జాగ్రత్తగా వుండాలి. లేకపోతే ఈ అరాచకాలు మరింత కొనసాగితే.. బంగ్లాదేశ్ లాంటి పరిస్థితే ఇక్కడ కూడా రావొచ్చు.’’ ఈ సమయంలోనే మహ్మద్ ప్రవక్తకి సంబంధించిన ఓ ఉదాహరణ ఇచ్చారు. ఈ ఉదాహరణ ఇస్లామిక్ పుస్తకాలలో మాత్రమే వుంది. అయితే ముస్లింలు తన వ్యాఖ్యలపై అనవసర రాద్ధాంతం చేయడంపై మాట్లాడుతూ… తాను కేవలం రాజధర్మం గురించే మాట్లాడానని రామగిరి మహంత్ అన్నారు. భీష్మ పితామహుడికి, యుధిష్ఠిరుడికి మధ్య జరిగిన సంభాషణను మాత్రమే చెప్పానని, అప్పుడు కృష్ణుడు భీష్మ పితామహుడ్ని కలవడానికి వెళ్లిన సమయంలో భీష్ముడు కేవలం ధర్మం గురించే మాట్లాడాడని, అందులో రాజనీతికి సంబంధించిన అంశాలు కూడా వున్నాయని, రాజధర్మం గురించి భీష్ముడు చెప్పానని మాత్రమే తన ఉపన్యాసంలో తెలిపానని స్వామీజీ పేర్కొన్నారు. ఈ సందర్భంలోనే స్వామీజీ తన ఉపన్యాసంలో భీష్మ పితామహుడి వ్యాఖ్యలను ఉటంకిస్తూ… ‘‘ఏ రాజ్యంలోనైనా అన్యాయాన్ని రాజు సహించకూడదు. ఎవరైనా అన్యాయాన్ని ఎదిరించే శక్తి వున్నా.. ఎదిరించకపోతే.. పాపం చేసినట్లే లెక్క. అందుకే అన్యాయాన్ని ఎదుర్కోవాలి అని మాత్రమే మాట్లాడుకున్నాం. ఇదే సమయంలో బంగ్లాదేశ్ లో జరుగుతున్న హింస గురించి ప్రస్తావన వచ్చింది. ఎందుకంటే అక్కడి హిందువులపై అత్యాచారాలు జరుగుతున్నాయి కాబట్టి. మహిళలను చిత్ర హింసలు పెడుతున్నారు కాబట్టి. అక్కడి నుంచి హిందువులు పారిపోవడానికి సిద్ధంగా వున్నారు. అక్కడి పరిస్థితి అచ్చు నరకంలా గోచరిస్తోంది. ’’ అని మాట్లాడుకున్నామని వెల్లడించారు.

మహంత్ రామగిరికి మద్దతుగా నిలబడిన సీఎం షిండే
మహంత్ రామగిరిపై ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే ఆయనతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పై అంశాన్ని ప్రస్తావించారు. తమ ప్రభుత్వ హయాంలో మత పెద్దలకు ఎలాంటి సమస్య రాదని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వానికి ఇలాంటి సాధు సంతుల ఆశీర్వాదాలున్నాయని, మహారాష్ట్రంలో సాధువులను ఎవ్వరూ ముట్టుకోలేరని తెలిపారు.

ఇంతకీ మహంత్ రామగిరి ఎవరు?
మహారాష్ట్ర అంతటా ఈయనని సరళ ద్వీప పీఠాధిపతిగా పిలుస్తుంటారు. గోదావరి నది విభజన వల్ల సరళ ద్వీపం ఏర్పడిందని అందరూ నమ్ముతారు. ఛత్రపతి శంభాజీ నగర్, నాసిక్, జాల్నా, జల్ గావ్ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో వీరికి భక్తులున్నారు. అనేక మంది పెద్ద పెద్ద రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు ఈయన శిష్యులు. అలాగే అక్కడి ప్రాంత రాజకీయాల్లోనూ ఈయన ముద్ర బలంగానే వుంటుంది.