
స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పరారీలో ఉన్న ఓ ఐసిస్ ఉగ్రవాది ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. దిల్లీలోని దరియాగంజ్‌కు చెందిన రిజ్వాన్ అబ్దుల్ హజీ అలీ ఐసిస్ పుణె మాడ్యూల్‌లో కీలక సభ్యుడిగా వ్యవహరిస్తున్నాడు. అతడిపై ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ రూ.3 లక్షల రివార్డ్ ప్రకటించింది. గురువారం రాత్రి 11 గంటలకు తుగ్లకాబాద్‌లోని బయోడైవర్సిటీ పార్క్ వద్దకు రిజ్వాన్ అలీ వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన ప్రత్యేక విభాగం పోలీసులు అత్యంత చాకచక్యంగా అతడిని వలపన్ని పట్టుకున్నారు. అలీ నుంచి పిస్టోల్, ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. రెండు మొబైల్ ఫోన్లను సీజ్ చేసి.. వాటిలోని డేటాను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.ఢిల్లీలోని పలు వీఐపీ ప్రాంతాల్లో రిజ్వాన్, అతడి అనుచరులు ఇప్పటికే పలుమార్లు రెక్కీ నిర్వహించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. పంద్రాగస్టు వేళ ఉగ్రదాడులకు వీరు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్నారు. ఈ అరెస్టు నేపథ్యంలో ఢిల్లీవ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.




