ArticlesNews

జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల

53views

జీవితంలో మనం ఏర్పరచుకునే బంధాలన్నీ అవసరార్థమైనవే. స్నేహ బంధం వాటికి అతీతమైంది. ఏ స్వార్థమూ లేకుండా, సహజంగా ఏర్పడే గాఢానుబంధమది. అంతరాలు, అంతస్తుల ప్రస్తావన లేకుండా ఒకరి భుజంపై ఒకరు చేయివేసి ఆప్యాయతల కలబోతతో కలిసి నడవగలిగే సయోధ్య స్నేహితుల సొంతం. ‘నాకేంటి… నా మిత్రుడున్నాడు’ అనే ఓ భరోసా ఆపద సమయంలో ఎంతో ఊరటనిస్తుంది. వాస్తవానికి, మనిషికి ఆపదలు రావడమూ ఒక్కోసారి మంచిదే. ఆ తరుణంలో అండగా ఉండి ఆదుకునే సన్మిత్రులెవరో స్పష్టమవుతుంది అంటాడు కబీర్‌. స్వచ్ఛమైన స్నేహం సంకుచితత్వానికి దూరంగా, ఆత్మీయతకు దగ్గరగా ఉంటుంది. జీవన వికాసానికి అది శ్వాసగా నిలుస్తుంది. శత్రువు ఒక్కడైనా ఎక్కువే! కానీ, మిత్రులు వందమంది ఉన్నా తక్కువే!

జీవాత్మ పరమాత్మల నుంచే…
వియ్యానికైనా, కయ్యానికైనా సమ ఉజ్జీలు కావాలి. కానీ, నెయ్యానికి… అంటే- స్నేహానికి ఆ నియమం వర్తించదు. పవిత్ర హృదయంతో ఎవరు, ఎవరితోనైనా స్నేహం చేయవచ్చు. సృష్టి అనే వృక్షాన్ని ఆశ్రయించి జీవాత్మ పరమాత్మ అనే రెండు పక్షులు సాహచర్యం చేస్తాయి. మిత్ర ధర్మాన్ని కొనసాగిస్తాయని వేదసూక్తం పేర్కొంటోంది. మధురమైన మైత్రీ బంధం జీవాత్మ పరమాత్మల నుంచే సృష్టిలో ఆరంభమవుతుంది. స్నేహ భావ పరిమళాలు ప్రతి వ్యక్తిలోనూ పరిఢవిల్లాలని అధర్వణ వేదంలోని సౌమనస్య సూక్తం ఆకాంక్షించింది. ‘హే భగవాన్‌! సమస్త ప్రకృతి మాకు స్నేహితుడిలా సహకరించాలి. ఎవరివల్లా ఎలాంటి ఆపదా మాకు సంభవించకూడదు. మాకు రాత్రి పగలు ఎలాంటి భీతి ఉండకూడదు. దిశలన్నీ ఆప్తులై మాకు చేయూతనివ్వాలి. సర్వకాల సర్వావస్థల్లోనూ మేము సుభిక్షంగా ఉండాలి’ అని వేదం పరమాత్మకు విన్నవించింది.

నష్టం తప్పదు
స్నేహం చేయడమూ గొప్పకళ. అయితే, స్నేహం పేరిట చెలామణీలో ఉన్న బంధాలన్నీ నిజమైనవేనా అని యువత ప్రశ్నించుకోవాలి. చెడ్డ వ్యక్తులతో స్నేహం కన్నా, అలాంటి నేస్తాలు లేకపోవడమే మంచిది. స్నేహితులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మనపై ప్రభావం చూపుతారు. అందుకే నీ వ్యక్తిత్వం ఏంటో నీ స్నేహితుల్నిబట్టి తెలుస్తుందంటారు. స్నేహితులనేవారు ఒకరికొకరు మార్గదర్శనం చేసుకుంటూ ఉన్నతంగా ఎదగాలి. మంచి మిత్రుడు సదా మన శ్రేయస్సు ఆకాంక్షిస్తాడు. చెడ్డపనులు చేయబోతే అడ్డుకొంటాడు. మనలోని మంచి గుణాల్ని మరింతగా పెంపొందిస్తాడు. కష్టనిష్టురాల్లో బాసటగా నిలుస్తాడు అని అన్నాడు భర్తృహరి. స్వార్థపరుల్ని స్నేహితులుగా ఎంచుకొంటే తీవ్ర నష్టం తప్పదు.

చిరస్మరణీయ మైత్రి
జీవితంలో కష్టనష్టాల్ని కలబోసుకుంటూ విజయసోపానాల్ని అధిరోహించడమే- స్నేహధర్మం. రామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా స్నేహ శపథం చేశారు. పరస్పరం సహకరించుకున్నారు. సాందీప మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేసిన బాల్యమిత్రులు శ్రీకృష్ణ సుధామల మైత్రి కూడా చిరస్మరణీయమైనది. తనను సుదీర్ఘ కాలం తరవాత చూడటానికి వచ్చిన కుచేలుడి దయనీయ స్థితిని వాసుదేవుడు గ్రహించాడు. మిత్రుడు అడగకపోయినా అపార సంపదల్ని అనుగ్రహించాడు. తనను నమ్ముకొన్న ప్రియమిత్రుడు కర్ణుణ్ని అంగరాజ్యానికి పట్టాభిషిక్తుణ్ని చేసి, దుర్యోధనుడు అతణ్ని గౌరవించాడు. వారిది కృతజ్ఞతకు మించిన స్నేహం. స్నేహ పరిధిని అధిగమించిన కృతజ్ఞత. ఈ రెండింటి కలబోతగా వారి బంధం బలపడింది.