
ఆధ్యాత్మిక సాధనలో బతుకు సార్థకమవుతుందని రాజమహేంద్రవరం ఆశ్రమ స్వామి శశికాంతానంద తెలిపారు. ఆదివారం తిరుపతి ఇస్కాన్ రోడ్డులోని శ్రీరామకృష్ణ ఆశ్రమ 9వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన భక్త సమ్మేళనంలో శశికాంతానంద ప్రసంగించారు. ఉత్తమ శిష్యుడు మోక్ష మార్గం పొందుతాడని, భగవంతుడు ఇచ్చిన పని పూర్తి చేసే వాడు ఆదర్శ భక్తుడవుతాడన్నారు. గురువు చెప్పినవి ఆచరించేవారు ఉత్తమ భక్తుడని వెల్లడించారు. అనంతరం ఆశ్రమ కార్యదర్శి స్వామి సుకృతానంద, ఆచార్య పీవీ రెడ్డి, పి.భాస్కరరావు మాట్లాడుతూ వివిధ ఆధ్యాత్మిక విషయాలపై ఉపన్యసించారు. ఈ క్రమంలోనే ఆశ్రమంలో ధ్యానం, విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. సాయంత్రం మాస్టర్ గోపి బృందం వారు భజనలు చేశారు. కార్యక్రమంలో స్వామి సత్వస్థానంద, జయచంద్రరెడ్డి, జీఎస్ ప్రసాద్ పాల్గొన్నారు.





