News

ఐస్‌క్రీమ్ ఇప్పిస్తానని చిన్నారిని బలిగొన్న ఇమ్రాన్

39views

కర్ణాటకలోని రామనగర జిల్లా మాగడి పట్టణంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. నాలుగేళ్ళ బాలికను ఎత్తుకుపోయి, అత్యాచారం చేసి, చంపేశాడొక నీచుడు. గత శనివారం (జులై 20) బాలిక మాయమయ్యాక, సోమవారం (జులై 22) ఆమె మృతదేహం తిప్పగొండనహళ్ళి దగ్గర దొరికింది. ఆ బాలిక బంధువైన ఇమ్రాన్‌ఖాన్ అనే వ్యక్తే ఆ దుర్మార్గానికి పాల్పడ్డాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, ఇమ్రాన్‌ఖాన్ అనే వ్యక్తి బెంగళూరులోని గౌరీపాళ్య ప్రాంతంలో నివసించేవాడు. బాధిత బాలిక కుటుంబానికి అతను బంధువు. బెంగళూరుకు, మాగడికి 30కిలోమీటర్లే దూరం కావడంతో వారింటికి అతను తరచుగా వచ్చి వెడుతుండేవాడు. జులై 20న ఇమ్రాన్‌ఖాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. పాపను తనతో తీసుకువెళ్ళి ఆమెకు ఐస్‌క్రీమ్ కొనిపెట్టాడు.
అదేరోజు సాయంత్రం 5గంటలకు మళ్ళీ ఐస్‌క్రీమ్‌ కొనిపెడతానని ఆశపెట్టి ఆ బాలికను తన స్కూటర్‌ మీద తీసుకుని వెళ్ళాడు. మాగడికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిప్పగొండనహళ్ళి ప్రాంతానికి తీసుకువెళ్ళి, అక్కడ ఆమెపై అత్యాచారం చేసాడు. తర్వాత గొంతు నులిమి హత్య చేసాడు. బాలికను చంపేసాక నిందితుడు అక్కడినుంచి పారిపోయాడు. ఆ రాత్రి బాలిక తల్లి, తన కుమార్తె ఇంట్లో లేకపోవడంతో ఇమ్రాన్‌కు ఫోన్ చేసింది. అయితే పాపను ఇంటిముందు వదిలిపెట్టి తాను బెంగళూరు వెళ్ళిపోయానని చెప్పాడు. తర్వాత తన ఫోన్ స్విచాఫ్ చేసేశాడు.

తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మాగడి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సిసిటివి ఫుటేజ్‌లో బాలిక ఇమ్రాన్‌తో పాటు వెళ్ళడం గమనించారు. రెండురోజుల వెతుకులాట తర్వాత సోమవారం రాత్రి 7 గంటల సమయంలో తిప్పగొండనహళ్ళిలో ఒక పెద్ద రాతి కింద బాలిక నగ్నదేహం లభ్యమైంది. పోలీసులు ఇమ్రాన్‌ఖాన్‌ను మంగళవారం ఉదయం బెంగళూరు కళసిపాళ్య వద్ద అరెస్ట్ చేసారు. విచారణలో నిందితుడు తానే నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు.
బెంగళూరులోని రాజరాజేశ్వరి ఆస్పత్రిలో బాలిక మృతదేహానికి పంచనామా నిర్వహించి, శవాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ సంఘటన మాగడి పట్టణంలో ప్రజాగ్రహానికి దారితీసింది. మంగళవారం ఉదయం వెయ్యిమందికి పైగా ప్రజలు పెద్దస్థాయిలో నిరసన ప్రదర్శన చేపట్టారు. నిందితుణ్ణి వెంటనే ఉరి తీయాలి లేదా ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. మాగడి పట్టణంలో వందలాది మంది ప్రజలు ర్యాలీ నిర్వహించారు.

నిందితుడు బాలికను రేప్ చేసే ఉద్దేశంతోనే మాగడి వెళ్ళాడని పోలీసులు అంచనాకు వచ్చారు. అతనిపై భారతీయ న్యాయ సంహితలోని 103, 135 సెక్షన్లతో పాటు పోక్సో చట్టం ప్రకారం కూడా కేసు నమోదు చేసారు. నిందితుణ్ణి మంగళవారం ఉదయం మాగడి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్‌క్లాస్ కోర్టులో హాజరుపరిచారు. తర్వాత జ్యుడీషియల్ కస్టడీలో రిమాండ్‌కి పంపారు.