
ఈశాన్యరాష్ట్రం త్రిపురలో రెండు వేర్వేరు ప్రదేశాల్లో 16మంది చొరబాటుదార్లు పట్టుబడ్డారు. వారిలో కొందరు బంగ్లాదేశీయులు కాగా మరికొందరు రోహింగ్యా ముస్లిములు ఉన్నారు. రైల్వే పోలీసులు, బిఎస్ఎఫ్ జవాన్లు ఆ చొరబాటుదార్లను అదుపులోకి తీసుకున్నారు.
జులై 11 అర్ధరాత్రి వేళలో అగర్తలా రైల్వే స్టేషన్‌లో బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి చొరబడిన 8మంది అక్రమ వలసదారులను గవర్నమెంట్ రైల్వే పోలీసులు (జిఆర్‌పి) అదుపులోకి తీసుకున్నారు. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం… కొంతమంది బంగ్లాదేశీయులు చట్టవిరుద్ధంగా సరిహద్దులు దాటి త్రిపురలోకి వచ్చారని, అగర్తలాలో రైలు ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారనీ జిఆర్‌పికి సమాచారం వచ్చింది. అటువంటి వ్యక్తుల కోసం రైల్వే పోలీసులు నిఘా వేసారు. కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాము బంగ్లాదేశీయులమని, త్రిపురలోకి చట్టవిరుద్ధంగా చొరబడ్డామనీ వారు ప్రాథమిక విచారణలో చెప్పారు. భారతీయ పౌరసత్వానికి చెందిన నకిలీ డాక్యుమెంట్లతో వారు భారత్‌లోకి అడుగు పెట్టారు. దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళాలన్నది వారి లక్ష్యం. ఉద్యోగం సంపాదించుకోవడం కోసమే భారత్ వచ్చామని వారు చెబుతున్నారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి. మహమ్మద్ షిముల్ హుసేన్ (28), నూర్ నహర్ జుమా (23), తస్లీమా కానూమ్ (24), మీనూ ఖాతూన్ (19), ఇబ్రహీం హుసేన్ (24), సఫీకుల్ ఇస్లాం (32), ముసామెద్ సలీనా బేగమ్ (22), ఆమె కుమారుడు సమీమ్ రెజీ (5)
అంతకుముందు, జులై 10 రాత్రి బిఎస్ఎఫ్ దళాలు అగర్తలా రైల్వే స్టేషన్‌లోనే ఐదుగురు చొరబాటుదారులను అరెస్ట్ చేసారు. ఆమ్‌తలీ స్పెషల్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్ అధికారులు, బీఎస్ఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో వారు పట్టుబడ్డారు. వారిలో తల్లి, ఆమె మైనర్ కొడుకు అగర్తలా-లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ ఎక్కడానికి ప్రయత్నిస్తూ దొరికారు. కస్టడీలో ఉన్న ఆ వ్యక్తుల పేర్లు సిముల్ హుసేన్ (28), ఇబ్రహీం సర్దార్ (24), సెలీనా బీబీ (20), సమీమ్ రెజా (9), మహమ్మద్ సఫీకుల్ ఇస్లాం (32).
మరోవైపు, ఐదుగురు రోహింగ్యా ముస్లిములు బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి చొరబడ్డారు. వారిని కూడా అగర్తలా రైల్వేస్టేషన్‌లో జులై 9న అరెస్ట్ చేసారు. రోహింగ్యాలు భారత్‌లోకి బంగ్లాదేశ్ నుంచి చట్టవిరుద్ధంగా చొరబడ్డారు. వారు నకిలీ పత్రాలతో ఢిల్లీ వెళ్ళడానికి ప్రయత్నిస్తూ పట్టుబడ్డారు. వారిపై కేసు నమోదు చేసారు. భారత్‌లోకి అక్రమంగా చొరబాట్లకు సహకరిస్తున్న రాకెట్‌ను పట్టుకోడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.





