News

అన్నప్రసాద కేంద్రం ఆధునికీకరణకు అడుగులు

234views

శ్రీవారి దర్శనార్థం పెద్దఎత్తున తిరుమలకు వచ్చే భక్తులకు టిటిడి అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో విరివిగా అన్నప్రసాదం వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా అన్నప్రసాదంపై భక్తుల ఆరోపణల నేపథ్యంలో నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టిన జె.శ్యామలరావు ముందుగా అన్నప్రసాదం నాణ్యతపై దృష్టిసారించారు. దీంతో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, తిరుమలలో సుదర్శన్, రాంభగీచాతోపాటు పలుప్రాంతాల్లో ఉన్న అన్నప్రసాద కేంద్రాల్లో భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదాలను అందిస్తున్నారు. దీనిపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

చోటుచేసుకోనున్న భారీ మార్పులు
తిరుమలకు వస్తున్న భక్తుల్లో శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనానంతరం స్వామివారి ప్రసాదంగా భావించే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అన్నప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు. రోజూ సుమారు రెండు లక్షల మంది భక్తులు మాతృశ్రీ తరిగొండ అన్నప్రసాదకేంద్రం, తిరుమల వ్యాప్తంగా ఉన్న అన్నప్రసాద కేంద్రాలు, మినీ అన్నప్రసాద కేంద్రం, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ ద్వారా భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తుంటారు. ఒక రోజు అన్నప్రసాదానికి తితిదే రూ.38 లక్షలను ఖర్చు చేస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రముఖ చెఫ్‌లు, పాకశాస్త్ర నిపుణులతో ఏర్పాటు చేసిన కమిటీ సమగ్ర నివేదిక ఆధారంగా అన్నప్రసాద భవనంలో అధునాతనమైన శాస్త్ర సాంకేతిక పద్ధతిలో కూరగాయలు, ముడిసరుకులు నిల్వ, పారిశుద్ధ్యం, ఆహార పదార్థాల తనిఖీకి అధికారులను నియమించనున్నారు. 10-15 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన అన్నప్రసాద తయారీ యంత్రాల స్థానంలో భారీ అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. అన్నప్రసాద విభాగంలో సిబ్బందిని పెంచనున్నారు.