
జ్ఞానం, శీలం, ఏకత అనేవి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ప్రత్యేకతలు అని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి యాగంటి వెంకట గోపి చెప్పారు.ఏబీవీపీ 76వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏబీవీపీ విజయవాడ శాఖ ఆధ్వర్యంలో నగరంలో మంగళవారం ర్యాలీ జరిగింది. ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి యాగంటి వెంకట గోపి మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తి భావం పెరిగేలా తమ సంఘం పనిచేస్తుందన్నారు. 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించాలని ఆందోళన చేసి విజయం సాధించిన ఘనత తమ సంఘానిదేనన్నారు. కరోనా సమయంలో కూడా ధైర్యంగా తమ సంఘం సభ్యులు సేవా కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. దేశంలో ఎమర్జెన్సీ అమలులో ఉన్న 5 రోజుల్లో సైతం బయటకు తమ వాణిని గట్టిగా వినిపించిన ఏకైక విద్యార్థి సంస్థ తమదేనని గోపి చెప్పారు. ఏబీవీపీ రాష్ట్ర కమిటీ పూర్వ అధ్యక్షుడు పీవీ రాము మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై ఉద్యమాలతో పాటుగా వారిలో సేవా గుణాన్ని నింపిన ఏబీవీపీ ఈరోజు జాతీయస్థాయిలో ఎంతో మంది నాయకులను ఈ దేశానికి అందించిందన్నారు.
పీబీ సిద్ధార్థ కళాశాల దగ్గర మొదలైన ర్యాలీ మదర్ థెరిస్సా జంక్షన్, ఆర్ఆర్ జంక్షన్, జమ్మిచెట్టు సెంటర్, మధుచౌక్, శిఖామణి సెంటర్ మీదుగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గర ఉన్న ఈట్ స్ట్రీట్ వరకు సాగింది. శిఖామణి సెంట ర్ లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఏబీవీపీ నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు.





