ఉన్నత విద్యాప్రమాణాలు, పరిశోధనలు దేశ ప్రయోజనాలు, అభివృద్ధికి దోహదపడాలని, యువత ఆలోచనలు ఈ దిశగా సాగాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. మంగళవారం మధ్యాహ్నం భువనేశ్వర్‌లోని నైజర్ విద్యాసంస్థ 13వ స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ విద్యాప్రమాణాలతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఉన్నత విద్యాసంస్థలు ప్రయోగశాలలు కావాలని, నూతన ఆవిష్కరణలకు వేదికలు కావాలన్నారు. అన్ని రంగాల్లో ముందంజలో ఉన్న భారత్ సమీప భవిష్యత్తులో ప్రపంచంలో తృతీయ ఆర్థికశక్తిగా అవతరించనుందని, ఉత్పత్తుల్లో ప్రగతి సాధ్యమైందన్నారు. స్నాతకోత్సవంలో రాష్ట్రపతి 238 మందికి డిగ్రీలు, 18 మందికి పసిడి పతకాలు అందజేశారు. వివిధ రంగాల్లో సేవలందిస్తున్న అయిదుగురు ప్రముఖుల్ని సత్కరించారు. కార్యక్రమంలో గవర్నరు రఘుబర్‌దాస్, ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి, నైజర్ సంచాలకుడు ఆచార్య హిరేంద్రనాథ్‌ఘోష్ తదితర ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక భావాలు దిశా నిర్దేశం చేశాయి: రాష్ట్రపతి
ఒకప్పుడు తీవ్ర మానసిక క్షోభకు గురైన తనకు ఆధ్యాత్మిక భావాలు దిశా నిర్దేశం చేశాయని, ప్రశాంతత సాధించానని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చెప్పారు. సోమవారం రాత్రి భువనేశ్వర్‌లోని బ్రహ్మకుమారీ ఈశ్వరీయ సేవా కేంద్రంలో దివ్య ఆధ్యాత్మిక భవనం (డివైన్ రిట్రీట్ సెంటర్) కొత్తగా నిర్మాణమైంది. దీన్ని శుభారంభం చేసిన రాష్ట్రపతి మాట్లాడుతూ.. మానవజన్మ ఉత్కృష్టమైనదని, సత్కర్మలు చేయాలని, ‘నేను, నాది’ అన్న అహంకారం, స్వార్థం వీడాలని అన్ని ధర్మశాస్త్రాలు ఉద్బోధిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో గవర్నరు రఘుబర్ దాస్, ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి, బ్రహ్మకుమారీలు పాల్గొన్నారు.