News

మోదకొండమ్మ ఉత్సవాలకు వేళాయె

1.6kviews

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో మోదకొండమ్మ ఉత్సవాలను ఈ నెల 9, 10, 11 తేదీల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వాస్తవానికి గత నెల 19, 20 21 తేదీల్లో ఈ ఉత్సవాలు జరగాల్సి ఉండగా ఎన్నికల కోడ్‌, రాష్ట్రంలో అల్లర్ల నేపథ్యంలో 144 సెక్షన్‌ అమల్లో ఉండడంతో ఈ నెలకు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్నికల హడావిడి, కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తికావడంతో అధికార యంత్రాంగం, ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

మోదకొండమ్మ ఉత్సవాల ప్రారంభానికి సమయం తక్కువగా ఉండడంతో ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే ఆలయానికి రంగులు వేయడంతో పాటు అమ్మవారిని కొలువు తీర్చే సతకంపట్టు పందిరి నిర్మాణం పూర్తయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా పట్ణణ వీధుల్లో విద్యుత్‌ అలంకరణ పనులు గత నెలలోనే చేపట్టారు. అంబేడ్కర్‌ సెంటర్‌ నుంచి అరకులోయ, విశాఖపట్నం, చింతపల్లి వెళ్లే మార్గాల్లో సీరియల్‌ సెట్‌లతో విద్యుత్‌ అలంకరణ పనులు చేపడుతున్నారు. పట్టణంలోని మెయిన్‌ రోడ్డుపై భారీ విద్యుత్‌ సెట్టింగ్‌ల కోసం కటౌట్‌లు పెట్టారు. అధికార యంత్రాంగం ఉత్సవాలకు వచ్చే భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుధ్యం, వైద్య సేవలు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. దూర ప్రాంతల నుంచి వచ్చే భక్తులకు ఉచిత భోజన సదుపాయాలను సమకూర్చుతారు. ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తుల రాకపోకలకు అనువుగా అవసరమైనన్ని బస్సు సర్వీసులను నడపాలని కలెక్టర్‌ ఎం.విజయసునీత ఇప్పటికే ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఉత్సవాలకు అధిక సంఖ్యలో జనం వచ్చే అవకాశాలుండడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.