
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ నెల 7న పోలింగ్ జరగడానికి ముందు రోజు 36 పాఠశాలలకు వచ్చిన బాంబు బెదిరింపు ఈ-మెయిళ్లు పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఫైసలాబాద్ నుంచి ఓ వ్యక్తి నకిలీ పేర్లతో వీటిని పంపినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. ‘‘మెయిల్.ఆర్యూ డొమైన్ నుంచి వచ్చిన ఈ-మెయిల్లో ఒకరు తనను తాను తాహిద్ లిక్కత్గా పేర్కొన్నాడు. ఓటర్లు, ప్రజల్లో భయాందోళనలు కలిగించేందుకే అతడు పాఠశాలలకు బెదిరింపు సందేశాలు పంపించాడు’’ అని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘‘లిక్కత్కు వివిధ సామాజిక మాధ్యమాల్లో పలు పేర్లతో ఖాతాలు ఉన్నాయి. అందులో హమద్ జావేద్ పేరు ఒకటి. వీటిని భారత్కు వ్యతిరేకంగా సందేశాలు పంపించడానికి, వదంతులు సృష్టించడానికి, ప్రజల్లో భయాందోళనలు కల్గించడానికి ఉపయోగిస్తున్నాడు’’ అని పోలీసు అధికారులు తెలిపారు. ఈ నిందితుడి పేరు మరో దర్యాప్తు సంస్థ చేపట్టిన హనీట్రాప్ విచారణలోనూ వెల్లడైందని, తదుపరి దర్యాప్తు జరగుతోందని చెప్పారు.





