
జమ్మూ-కశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో వాయుసేనకు చెందిన వాహనశ్రేణిపై దాడి కేసు దర్యాప్తులో ఏజెన్సీలు కీలక ముందడుగు వేశాయి. ఈ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదుల చిత్రాలను సేకరించాయి. వీరిలో పాక్ సైన్యం ప్రత్యేక దళాల్లో పనిచేసిన ఓ మాజీ కమాండో కూడా ఉండటం గమనార్హం. వీరిని ఇల్లియాస్ (పాక్ మాజీ కమాండో), అబూ హమ్జా (లష్కరే కమాండో), హడూన్‌గా గుర్తించారు. ఇల్లియాస్‌ను ఫౌజీ అనే పేరుతోను పిలుస్తారు.
కొత్తగా ఏర్పాటుచేసిన పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫోర్స్ తరఫున ఈ ముగ్గురు ఉగ్రవాదులు కాన్వాయ్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ సంస్థ జైషే అహ్మద్ అనుబంధంగా పనిచేస్తోంది. భద్రతా దళాలు ఈ ఉగ్రవాదులను పట్టుకోవడానికి రాజౌరీ, పూంఛ్ జిల్లాల్లో భారీ గాలింపు చర్యలకు తెరతీశారు. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
తాజాగా దాడిలో విదేశీ ఉగ్రవాది ఉండటం గమనార్హం. ఉగ్ర చొరబాట్లకు జమ్మూలోని రాజౌరీ-పూంఛ్ జిల్లాలు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ గతేడాది జరిగిన తొమ్మిది ఎన్‌కౌంటర్లలో ఆరు ఈ రెండు జిల్లాలోనే చోటుచేసుకోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఇక్కడి పీర్ పంజాల్ పాస్ కశ్మీర్‌ను రాజౌరీ-పూంఛ్‌తో కలుపుతుంది. ఈ జిల్లాలకు 225 కి.మీ. మేరకు పాక్‌తో సరిహద్దు (ఎల్‌వోసీ) ఉంది. సరిహద్దుల సమీపంలో ఉండటంతో ఎన్‌కౌంటర్ల వేళ పాక్ నుంచి డ్రోన్లు ఇక్కడికి ఆయుధాలు చేరవేస్తున్నాయి. గతేడాది జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో కూడా డ్రోన్ల కదలికలను దళాలు గుర్తించాయి. ఇక్కడ మన దళాలపై దాడుల్లో పాక్ సైనికులు, బోర్డర్ యాక్షన్ బృందాలు, మాజీ సైనికులు కూడా పాల్గొనే అవకాశం ఉందని భారత్ అనుమానిస్తోంది. తాజాగా వాయుసేన కాన్వాయ్‌పై దాడిలో కూడా ఇలాంటివి వాడారు. స్నైపర్లు కూడా వీరిలో ఉండటం పాక్ సైన్యం పాత్రను బలపరుస్తోంది.





