News

ముచ్చటగా మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్- ప్రయోగం ఎప్పుడంటే?

282views

భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ మూడోసారి రోదసి యాత్రకు వెళ్లనున్నారు. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్‌ లైనర్‌ వ్యోమనౌకలో సునీతా విలిమయ్స్ మరో వ్యోమగామి బచ్‌ విల్‌మోర్​తో కలిసి అంతరిక్షయానం చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం మే 7న(మంగళవారం) ఉదయం 8గంటల నాలుగు నిమిషాలకు ఫ్లోరిడాలో స్పేస్ లాంఛ్ కేంద్రం నుంచి ఈ వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇందులో సునీతా విలియమ్స్ మిషన్‌ పైలట్‌గా వ్యవహరించనున్నారు. కాగా, తాము రోదసి యాత్రకు సిద్ధంగా ఉన్నామని సునీతా విలియమ్స్ తెలిపారు. ఈ అంతరిక్ష యాత్రలో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు.

నాసా తన కమర్షియల్‌ క్రూ ప్రోగ్రామ్‌లో భాగంగా తొలి మానవ సహిత స్పేస్‌ క్రాఫ్ట్‌ ను అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమైంది. ఇందులో సునీతా విలియమ్స్​తో పాటు మరో వ్యోమగామి బచ్‌ విల్‌ మోర్‌ అంతరిక్షయానం చేయనున్నారు. ఈ రాకెట్‌లో వీరిద్దరూ ప్రయాణించి, ఐఎస్‌ఎస్‌కు చేరుకుని అక్కడ వారం రోజుల పాటు ఉండనున్నారు. ఇలా ఈ ప్రయోగం ద్వారా స్పేస్‌ క్రాఫ్ట్‌ శక్తిసామర్థ్యాల్ని నాసా పరిశీలించనుంది. ఈ పర్యటన విజయవంతమైతే అంతరిక్ష కేంద్రానికి సిబ్బందితో కూడిన మిషన్ల కోసం స్టార్‌ లైనర్‌ను సర్టిఫై చేసే ప్రక్రియను నాసా ప్రారంభిస్తుంది. ఇప్పటివరకు ఎలాన్ మస్క్​కు చెందిన స్పేస్ ఎక్స్ నాసా సర్టిఫై అయింది. స్టార్ లైనర్ వ్యోమనౌక అంతరిక్ష యాత్ర కూడా విజయవంతమైతే స్పేస్ ఎక్స్ జాబితాలో చేరిపోనుంది.