News

ఆమిర్ ఖాన్ మూడో వివాహం.. ‘లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్’

29views

బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ వ్యక్తిగత జీవితం మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆయన మూడో వివాహం చేసుకున్నారనే వార్తల నేపథ్యంలో మహారాష్ట్ర మంత్రి నితేశ్ రాణే వ్యాఖ్యలు చేయడం చర్చకు దారితీసింది.

షిర్డీలో మీడియాతో మాట్లాడిన నితేశ్ రాణే, ఆమిర్ ఖాన్‌ను “లవ్ జిహాద్‌కు బ్రాండ్ అంబాసిడర్”గా అభివర్ణించారు. వరుస వివాహాలు, వాటి ద్వారా సమాజానికి వెళ్తున్న సందేశంపై హిందూ సమాజం, ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఇలాంటి వ్యక్తుల సినిమాలను భవిష్యత్తులో ఆదరించాలా లేదా అనే విషయాన్ని హిందూ సమాజం గంభీరంగా ఆలోచించాలని సూచించారు.

వార్తల ప్రకారం, 61 ఏళ్ల ఆమిర్ ఖాన్ ఈ నెల 5వ తేదీన 47 ఏళ్ల గౌరీ స్పాట్‌ను ముంబైలో ‘స్పెషల్ మ్యారేజ్ యాక్ట్’ కింద రహస్యంగా వివాహం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ఆయన మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావు కూడా హాజరయ్యారని సమాచారం.

నితేశ్ రాణే వ్యాఖ్యల అనంతరం ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. హిందూ సమాజంపై, కుటుంబ విలువలపై ప్రభావం చూపే అంశాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.