
కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో ప్రసంగిస్తుండగా కొందరు ఖలిస్థానీ అనుకూల నినాదాలు చేయడంపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. దీనిపై భారత్‌లో కెనడా రాయబారికి కేంద్ర విదేశాంగ శాఖ సమన్లు పంపింది. ఈ విషయాన్ని ఎంఈఏ ఓ ప్రకటనలో తెలియజేసింది.
ఇలాంటి ఘటనల వల్ల వేర్పాటువాదం, ఉగ్రవాదం, హింసకు కెనడా తావిచ్చినట్టు అవుతుందని, దీని ప్రభావం కెనడా- భారత్ సంబంధాలపై పడటమే కాకుండా, సొంత పౌరుల్లో పౌరుల్లో హింస, నేరతత్వా్న్ని కెనడా ప్రోత్సహించడమే అవుతుందని కెనడా రాయబారికి తెలియజేసినట్టు ఎంఈఏ ఆ ప్రకటనలో పేర్కొంది.
‘ఖల్సా’ దినోత్సవాల్లో భాగంగా ఆదివారంనాడు టొరంటోలో ‘ఖల్సా’ పరేడ్ నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రధాని ట్రూడో హాజరయ్యారు. సిక్కు కమ్యూనిటీని ఉద్దేశించి ట్రూడో ప్రసంగించేందుకు వేదికపైకి వెళ్లిన సమయంలో కొందరు ‘ఖలిస్థానీ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. అయితే, ట్రూడో మాత్రం వాటిని పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు.





