
హిందూ వివాహ సాంప్రదాయంపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. హిందూ వివాహం పవిత్ర లక్షణాలను ప్రస్తావిస్తూ.. అది ఒక పవిత్రమైన మతపరమైన పక్రియ అని పేర్కొంది. అంతేకాదు హిందూ వివాహం చెల్లుబాటు కావాలంటే వివాహ క్రతువు సముచితమైన మర్యాదలతో నిర్వహించాలని కోర్టు నొక్కి చెప్పింది. సప్తపది (పవిత్రమైన అగ్ని చుట్టూ ఏడు మెట్లు) వంటి వేడుకలను గురించి ప్రస్తావించింది. జస్టిస్ బివి నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం హిందూ వివాహం మతకర్మ అని, “ఆట పాట”, “విందు భోజనాల” కోసం జరిగే కార్యక్రమం కాదని పేర్కొంది.
“హిందూ వివాహం ఒక సంస్కారమైన మతకర్మ. ఇది భారతీయ సమాజంలో గొప్ప విలువ కలిగిన సంస్థగా దాని హోదాను పొందవలసి ఉంటుంది. అందువల్ల యువతీ యువకులు వివాహ వ్యవస్థలోకి ప్రవేశించే ముందు కూడా దాని గురించి లోతుగా ఆలోచించాలని మేము కోరుతున్నాము. భారతీయ సమాజంలో వివాహం అనేది ‘పాటలు , డ్యాన్స్, విందు కోసం లేదా కట్నాలు, కానుకలను డిమాండ్ చేసే ఒక సందర్భం కాదని ధర్మాసనం వెల్లడించింది.





