స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రప్రాంతాన్ని కేంద్రంగా చేసుకున్న విదేశి వనితలు 68 ; మెల్లిషోలింగర్

మెల్లిషోలింగర్ పుట్టిల్లు స్విట్జర్లాండ్, మాతృభాష జర్మనీ, కాని ఆమె అభిమానించింది హిందూ, బౌద్ధ మతాలు. హిందూ, శ్రీలంక దేశాలు చూడాలన్నది ఆమె కోరిక. భారతీయసంస్కృతి పట్ల అభిమానం సోషలిజం పట్ల, మహిళా హక్కుల పట్ల ఆకర్షణ అటువంటి సమయంలో ఒక భారతీయుడితో పరిచయం. ఆ పరిచయం స్నేహం, ఆ స్నేహం వివాహం, అలా మెల్లిషోలింగర్ 1937 ఆగస్టు 30న ఉప్పల లక్ష్మణరావును వివాహమాడింది. మరుసటి సంవత్సరం భర్తతో కలిసి వచ్చి విజయవాడలో స్థిరపడ్డారు.
అంతకుముందే మెల్లీ భారతదేశంలో బ్రిటీష్ వారి దమననీతిని, హింసాకాండను.. గమనించి వలస పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించుకుంది. 1920ల్లో భారత్ పర్యటనకు రావాలనుకున్నా బ్రిటీష్ వారు అనుమతి నివ్వలేదు. చివరకు వ్యాపారం పేరిట అనుమతి సంపాదించి భారత్‌కు వచ్చి గ్రామీణ ప్రజల్లో జాగృతి ఏమేరకు ఉందో అధ్యయనం చేసారు. ఆంధ్ర, ఒడిస్సా ప్రాంతాలను స్వయంగా పర్యటించి, పలురకాలుగా అధ్యయనం చేసింది. జాతీయోద్యమంతో సంబంధమున్న కోస్తా నాయకులతో ఆమెకు పరిచయాలు ఏర్పడ్డాయి. తాను కూడా ఖాదీ ధరించటం మొదలు పెట్టింది. ఆ అలవాటు చివరి వరకు మెల్లిషోలింగర్‌లో కొనసాగింది. 1929లో లాహోర్‌లో జరిగిన కాంగ్రెస్ సమావేశాలకు హాజరై సంపూర్ణ స్వరాజ్య సాధన కోసం దీక్ష తీసుకుంది.
నాటి నుండి మెల్లిషోలింగర్ స్వాతంత్య్ర సమర యుద్ధంలోని ప్రతి ఉద్యమంలోనూ పాల్గొన్నది. 1940 వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్నది. విజయవాడలో సత్యాగ్రహం చేసి అరెస్టు అయింది. తొమ్మిది నెలలు శిక్షపడింది. విడుదలైన తర్వాత తిరిగి మద్రాసులో సత్యాగ్రహం చేసి అరెస్టయి మళ్ళీ సంవత్సరంపాటు జైలు శిక్ష అనుభవించింది. ఒక విదేశీ వనిత వచ్చి భారతీయ స్వాతంత్య్రం కోసం పోరాటడం ఏమిటనేది బ్రిటీష్ వారి ప్రశ్న! నీకెందుకు ఈదేశం గురించి బ్రిటీష్ అధికారులు ప్రశ్నించినపుడు. ఇది నా దేశమే, నా మెట్టినిల్లు, ఇది పవిత్రభూమి అని ధైర్యంగా చెప్పింది.1942 క్విట్ ఇండియా ఉద్యమంలో మెల్లిషోలింగర్ పాల్గొన్న తీరు అందరినీ ఆకట్టుకుంది. “విజయమో వీరస్వర్గమో అందు తేలాలి. శాంతి సమరంలో యిది ఆఖరి ఘట్టం. బ్రిటీష్ సామ్రాజ్యవాదుల్లారా భారతదేశాన్ని వదిలి వెళ్లిపోండి” అంటూ సివంగిలా గర్జించింది. ఖాదీ నిక్కరు, చొక్కా ధరించిన ఆ వనిత భారతీయ వనిత కాదని శరీరపు రంగు, రూపం తెలియజేస్తున్నది. భారతీయులను మించి నినదిస్తున్న మెల్లీ లక్ష్మణరావును చూసి, మిగిలిన భారతీయులు కార్యోన్ముఖులై రంగంలోకి దూకారు.
దండియాత్ర, ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ, విదేశీ వస్త్ర దుకాణాల ఎదుట పికెటింగ్ చేయటం వంటి వాటన్నింటిలో మెల్లిషోలింగర్ పాల్గొన్నది. రాట్నం వడకటం నేర్చుకున్నది. శ్రీకాకుళం జిల్లా పొందూరు ప్రాంతంలో చేనేత కార్మికులతో కలిసి పట్టు, జరీలతో ఖాదీవస్త్రాలు తయారుచేయటం నేర్చుకున్నది. సులువుగా తిరిగే రాట్నం తీసుకుని కోస్తా ఆంధ్రా అంతా తిరిగి విశేషంగా ప్రచారం చేసింది.
మెట్టిన దేశ స్వాతంత్ర్యం కోసం పనిచేసిన మహిళానేత మెల్లిషోలింగర్. భారత స్వాతంత్ర్యాన్ని, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును దగ్గరుండి చూసిన వారు మెల్లీ లక్ష్మణరావు దంపతులు. 1956 వరకు విజయవాడ కేంద్రంగా పనిచేసారు ఆ భార్యాభర్తలు. ఆ తర్వాత తూర్పు జర్మనీకి మకాం మార్చినా తన భారతీయతను, ఖద్దరు ధారణను వదులుకోలేదు ఆమె. అంతగా భారతదేశాన్ని అభిమానించిన విదేశీ వనిత మెల్లి షోలింగర్.





