
ఆర్టికల్ 370, ఆర్టికల్ 35(ఏ)ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించగానే కశ్మీరీ పార్టీలు శోకాలు అందుకున్నాయి. కశ్మీర ప్రజల హక్కులు అన్నీ కాలరాసుకుపోతున్నట్లు గులాంనబీ ఆజాద్, మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలు తెగ బాధపడిపోయారు. వాస్తవంగా గమనిస్తే కశ్మీర్‌లో ఆర్టికల్ 35(ఏ)అనేది ప్రవేశపెట్టడం కూడా ఒక పద్ధతి ప్రకారం జరగలేదని చెప్పాలి. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా దీనిని రాజ్యాంగంలో ప్రవేశపెట్టడం గమనార్హం. వాస్తవానికి రాజ్యాంగంలో చేర్చాల్సిన అంశాలు పార్లమెంటు ముందుకు వెళ్లడం తప్పని సరి కానీ, ఇది పార్లమెంట్ ముందుకు వెళ్లలేదు.దీంతో అసలు ఈ నిబంధన చట్టబద్ధతే ప్రశ్నార్థకంగా ఉంది.
అసలు 35(ఏ)ను ఎందుకు చేర్చారు..
ఈ నిబంధన ఏర్పాటు చేయడానికి చారిత్రక కారణాలు ఉన్నాయి. 1947 సమయంలో బయటవారు కశ్మీర్‌లో ఆస్తులు కొనకూడదనే నిబంధనను భారత్‌తో ఒప్పందం కుదుర్చుకొనే నాటికే ఉంచారు. అప్పట్లో కశ్మీర్ వాతావరణం ఆహ్లాదంగా ఉండటంతో బ్రిటీష్ వారు వచ్చి స్థిరపడతారనే భయం రాజా హరిసింగ్‌లో స్వతంత్రానికి ముందు నుంచి ఉంది. మరోపక్క పంజాబీలు తరలివస్తే ఉదంపూర్ ప్రాంతంలోని స్థానిక డోగ్రాల అవకాశాలు దెబ్బతింటాయన్నాది ఆయన ఉద్దేశం. అయితే కాలక్రమంలో కశ్మీర్‌లోయను హిందువులు ముంచెత్తుతారనే భావన స్థానిక పార్టీల్లో మొదలైంది. దీంతో వారు ఈ నిబంధన తొలగించకుండా అడ్డం పడుతూ వచ్చారు. అయితే దీన్ని అక్కడి జిహాదీ గ్రూపులు ఒక రక్షణ కవచంగా ఉపయోగించుకున్నాయన్నది బహిరంగ రహస్యం. లోయలోని మైనార్టీలైన లక్షలాది కశ్మీరీ పండిట్లను వెళ్లగొట్టి వారి ఆస్తులను ఆక్రమించారు.
ఆర్టికల్ 35ఏ; హక్కుల నిబంధన
* రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ జమ్మూకశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పిస్తుంది.
* జమ్మూకశ్మీర్ శాశ్వత నివాసి ఎవరు? అన్న దానిని నిర్వచిస్తుంది.
* వారి స్థిరాస్తి హక్కుల్ని నిర్ధారిస్తుంది.
కశ్మీరీ నివాసి అంటే..
కశ్మీర్ శాశ్వత నివాసి ఎవరు అన్న దానిని రాష్ట్ర రాజ్యాంగం నిర్వచించింది. 1954 మే 14వ తేదీకన్నా ముందు లేదా ఆ తేదీ నాటికి రాష్ట్రంలో జన్మించిన వ్యక్తి లేదా, పదేళ్లపాటు రాష్ట్రంలో నివసించిన వ్యక్తి కశ్మీర్ శాశ్వత నివాసి అవుతాడు. ఆ వ్యక్తి రాష్ట్రంలో స్థిరాస్తుల్ని కలిగి ఉండవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వం కల్పించే స్కాలర్‌షిప్‌లు, ఇతరత్రా సహాయాల్లాంటి ప్రత్యేక ప్రయోజనాలు పొందొచ్చు. దీర్ఘకాలం రాష్ట్రంలో నివసిస్తున్న వారికి సర్టిఫికెట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరుచేయొచ్చు. రాష్ట్ర స్థిర నివాసులు ఎవరో నిర్వచించడం కోసం చట్టాలు చేసే అధికారాన్ని జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి ఆర్టికల్ 35ఏ కట్టబెట్టింది. అయితే ఈ నిర్వచనాన్ని మూడింట రెండొంతుల మెజారిటీతో రాష్ట్ర అసెంబ్లీ మార్చొచ్చు. కశ్మీరీ మహిళ కశ్మీరేతరుణ్ని పెళ్లిచేసుకుంటే మాత్రం- ఆమె ఈ రాష్ట్రంలో స్థిరాస్తుల్ని కలిగి ఉండటానికి వీల్లేదు. ఆమె పిల్లలకూ ఆ ఆస్తిపై హక్కు ఉండదు. పిల్లలకు శాశ్వత నివాస సర్టిఫికెట్‌ను ఇవ్వరు. ఇది మహిళలపై వివక్ష కాదా..? అసలు ఇది ఏరకంగా సమానత్వాన్ని సూచిస్తిందో కశ్మీరీ పార్టీలకే తెలియాలి. ఈ నిబంధన చట్టవ్యతిరేకమని 2002లో జమ్ముకశ్మీర్ హైకోర్టు ప్రకటించింది. అయితే పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటే అతనికి కశ్మీరీ పౌరసత్వం లభిస్తుంది.ఇది ఎంత విడ్డూరం. కశ్మీరేతరుడు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక కాకూడదని 1956 నవంబరు 17వ తేదీన ఆమోదించిన రాష్ట్ర రాజ్యాంగం చెబుతోంది.
పారిశుద్ధ్య పనివారి పిల్లలు కూడా అలానే బతకాలా..?
ఈ ఆర్టికల్ రద్దు సందర్భంగా అమిత్ షా ఒక వ్యాఖ్య చేశారు. రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల హక్కులను ఆర్టికల్ 35(ఏ) కాలరాస్తోందని పేర్కొన్నారు. ఆయన మాటల్లో కొంత వాస్తవం ఉంది. 1957లో కశ్మీర్‌లో పారిశుద్ధ్య పనుల నిమిత్తం దేశంలోని ఇతరప్రాంతాల నుంచి దళితవర్గానికి చెందిన వాల్మీకీలను తీసుకువచ్చారు. వీరి భావితరాలు కూడా ఇక్కడ పారిశుద్ధ్య పనులు చేస్తూ బతకాలి అనే నిబంధనతోనే వారికి శాశ్వత నివాస పత్రాలను ఇచ్చారు. ఇంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా? వారి పిల్లల్లో ప్రతిభావంతులు ఉండరా..? వారికి ఈ ప్రపంచంలో మంచి హోదాతో జీవించే హక్కు ఉండకూడదా.. ఇప్పటీకి వారి తర్వాతి తరాలు అవే పనులు చేస్తూ పొట్టపోసుకుంటున్నాయి. ఇదోక ఆధునిక కట్టు బానిసత్వం కాదని అక్కడి పార్టీలు చెప్పగలవా..?
పాకిస్థాన్‌కు మనం ఇచ్చిన ఆయుధమే..
ఆర్టికల్ 35(ఏ) భారతీయులు, కశ్మీరీలు అనే కృత్రిమ విభజన భావన పుట్టుకకు కారణమైంది. అత్యంత ప్రతిభావంతులైన కశ్మీరేతరులకు కూడా ఇక్కడి విద్యాలయాల్లో ఉపకారవేతనాలు లభించవు. వీరికి కోర్టులను ఆశ్రయించే అవకాశం కూడా లేకుండా చేస్తోందీ నిబంధన. కశ్మీర్‌కు భారత్‌కు మధ్య ఉన్న ఈ చిన్న విభజన రేఖను పాక్ పెద్దది చేసి పబ్బం గడుపుకుంటూ వస్తోంది. అక్కడి వేర్పాటు వాదానికి ఈ విభజన రేఖే పునాది రాయి. ఫలితంగా కశ్మీర్‌లో కొత్తగా ఎటువంటి పెట్టుబడులు రావడంలేదు. కశ్మీరీలు బయట ప్రపంచంతో కలిసి అభివృద్ధి చెందితే మత ఛాందసాన్ని కోరుకోరు.. ఈ విషయం అభివృద్ధి చెందిన ముస్లిం దేశాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. టర్కీ వంటి దేశాల్లో మహిళలు అనుభవించే స్వేచ్ఛ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం ప్రజలను 35(ఏ)తో చీకటిలో ఉంచి తమ పబ్బం గడుపుకోవాలన్నదే అక్కడి రాజకీయ పార్టీలు, వేర్పాటు వాదులుగా చెప్పుకొనేవారి వ్యూహం. అక్కడి రాజకీయ నాయకులు అక్రమ సంపాదనల్లో మునిగి తేలుతూ కొండచిలువుల్లా కశ్మీరీ ఆస్తులను మింగేస్తున్నారు. సగటు కశ్మీరీ మాత్రం కటిక పేదరికంలో జీవిస్తూ కాలం గడుపుతున్నాడు. తాజాగా ఆర్టికల్ 35(ఏ)ను రద్దు చేయడంతోనే భారత్ అక్కడి అభివృద్ధికి సంబంధిన ప్రణాళికలను సిద్ధం చేసింది. కశ్మీర్‌లో అక్టోబర్‌లో పెట్టుబడిదారుల (ఇన్వెస్టర్స్ సమ్మిట్) భారీ సమావేశం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.
Source : Enadu





