ArticlesNews

ఒకే దేశంలో రెండు చట్టాలా? ఇకపై చెల్లదు.

608views

కే దేశంలో రెండు రకాల చట్టాలుంటాయా? దేశంలో స్వేచ్ఛగా తిరగాల్సిన పౌరులు జమ్ముకశ్మీర్‌లో మాత్రం బయటివారుగా ఎందుకు మిగిలిపోతున్నాడు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆ రాష్ట్రానికి ప్రత్యేకమైన హోదానిస్తున్న అధికరణం 370ను రద్దు చేసింది. దీంతో ఆ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేకమైన అధికారాలు చరిత్రలో కలిసిపోయాయి. కశ్మీర్‌ కూడా భారత్‌లో ఒక భాగమేనని స్పష్టమై పోయింది.

చిరకాల పోరాటం

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370పై భాజపా సుదీర్ఘ పోరాటం చేసింది. గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్న సమయంలో దీన్ని రద్దు చేయాలన్న డిమాండ్‌ వచ్చినా రాజ్యసభలో మెజార్టీ లేకపోవడంతో మౌనం వహించాల్సి వచ్చింది. మోదీ హయాంలో 2014-2019 మధ్య దీనిపై వాదనలు వినిపించినా రాజ్యసభలో సంఖ్యా బలం లేకపోయింది. తాజా ఎన్నికల్లో భాజపాకు ఘన విజయంతో పాటు రాజ్యసభలో బలం పెరిగింది. దీంతో ఆర్టికల్‌ 370 రద్దుకు ఉపక్రమించారు.

ఆర్టికల్ 370 రద్దు  విషయంలో నేటి పరిణామాలు :

– ఈ రోజు ఆగష్టు 5, 2019 సోమవారం ఉదయం రాజ్యసభలో జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దును ప్రతిపాదించే ఆర్డర్ నంబర్ 272/2019 పై ఆమోదం తెలుపుతూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

– 1954 లో 370 అధికరణంలోని 1 వ నిబంధన ద్వారా రాష్ట్రపతికి ఉండే విశేష అధికారాలతో కాశ్మీర్ కు కల్పించబడిన ప్రత్యేక ప్రతిపత్తి నేడు అదే క్లాజు ద్వారా తొలగించబడ్డం విశేషం.

– ఈరోజు ఇచ్చిన తాజా ఆదేశాలతో 1954లో ఇవ్వబడిన అన్ని ఆదేశాలు నిలిచిపోయి, మరు క్షణం నుంచే తాజా ఆదేశాలు అమలవుతాయని హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రకటించారు.

– ఏవో కొన్ని మినహాయింపులు తప్ప సంపూర్ణ భారత రాజ్యాంగం జమ్మూ కాశ్మీర్ కు కూడా వర్తిస్తుంది.

– గతంలో రాజ్యాంగ అధికరణలు, సవరణలు జమ్మూ కాశ్మీర్ కి వర్తించేవి కావు. దానివల్ల దేశంలోని మిగతా రాష్ట్రాల నుంచి జమ్మూ కాశ్మీర్ వేరుపడుతూ ఉండేది. కానీ ప్రస్తుత మోడీ ప్రభుత్వం రాజ్యాంగంలోని 367వ అధికరణలో సవరణ చేయడమే కాకుండా దానికి 4 వ నిబంధనను జోడించిన కారణంగా ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ కు కూడా దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు మల్లే రాజ్యాంగంలోని అన్ని నిబంధనలు వర్తిస్తాయి.

– తాజా పరిణామాలతో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఉండే సర్వాధికారాలు ఆ రాష్ట్ర గవర్నర్ కు సంక్రమించనున్నాయి. గతంలో అసెంబ్లీ నుంచి ప్రతిపాదనలు గవర్నర్ కి, గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపవలసి ఉండేది.

– మిగిలిన అన్ని రాష్ట్రాలలో లాగే మంత్రి మండలి గవర్నర్ కు సూచనలు చేయవచ్చు.

– 370 వ అధికరణం రద్దయిన కారణంగా నేటి నుంచి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీని “రాజ్యాంగ పరిషత్తు/ సంవిధాన సభ” (Constituent Assembly) అని కాకుండా మిగిలిన రాష్ట్రాలకు మల్లే “శాశన సభ” (Legislative Assembly) గా వ్యవహరించవలసి ఉంటుంది.

పార్లమెంటులో….

– నేడు మోడీ ప్రభుత్వం రెండు అంశాలను పార్లమెంటు ముందుంచింది.

– 370 వ అధికరణలోని 2, 3 నిబంధనల ప్రకారం 370 వ అధికరణని తొలగించాలంటే రాష్ట్ర రాజ్యాంగ పరిషత్తు సిఫార్సు అవసరమౌతుంది. ఇప్పుడు ఆ రెండు నిబంధనలకు కాలం చెల్లింది. కేవలం 1వ నిబంధన మాత్రమే ఉంటుంది.

జమ్మూ కాశ్మీర్ పునర్విభజన:

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజింపబడింది. లఢాక్ అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటుంది. ఇందులో రెండు ఉన్నత స్థాయి కౌన్సిళ్లు, ఒక లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. జమ్మూ కాశ్మీర్ మాత్రం అసెంబ్లీ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుంది. నిర్నయాధికారం గవర్నర్ దే.