
2040 నాటికి చంద్రుడిపైకి వ్యోమగాములను పంపిస్తామని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం -ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. దీని కోసం ప్రత్యేకంగా శ్రీహరికోటలోని రాకెట్ ప్రయోగ కేంద్రంలో మూడో ప్రయోగ వేదికను నిర్మిస్తామని చెప్పారు. ఇప్పటికే స్థల పరిశీలన కూడా పూర్తిచేశామని తెలిపారు.
బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ చంద్రుడిపైకి భారతీయులు అడుగుపెట్టేలోపు చంద్రయాన్-4 ప్రయోగం ద్వారా చంద్రుడిపైకి క్రాఫ్ట్ (ఉపగ్రహం)ను పంపించి అక్కడి నమూనాలను సేకరించి భూమిపైకి తీసుకువచ్చేందుకు మొదటి అడుగు వేయబోతున్నామని చెప్పారు. ఈ ప్రయోగాన్ని 2028లోనిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుని, ఆ దిశగా పనులు చేస్తున్నామని తెలిపారు. చంద్రయాన్-1తో ప్రారంభమైన చంద్రయాన్ సిరీస్ ప్రయోగాలకు కొనసాగింపుగానే ఇది ఉంటుందని వివరించారు. చంద్రయాన్-4 ప్రయోగం తర్వాతచంద్రుడిపైకి వ్యోమగాములను పంపించి,అక్కడి రహస్యాలను ఛేదించి తిరిగి వారిని భూమిపైకి క్షేమంగా తీసుకురావడానికి ఇప్పటి నుంచే కృషి చేస్తున్నామని చెప్పారు. ముందుగా 2028లో చంద్రయాన్-4, ఆ తర్వాత 2040లో చంద్రుడిపైకి భారతీయులు తొలి అడుగు పెట్టేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నామని సోమనాథ్ చెప్పారు.





