
సెక్యులరిజం భారతీయ మూలాలను హరిస్తున్న వేరుపురుగు. ఇది భారతీయ సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుతుందన్న మాట పెద్ద భ్రమ. ఇక్కడ సెక్యులరిజం అంటే భారత వ్యతిరేకత. స్థూలంగా చెప్పాలంటే పచ్చి హిందూద్వేషానికి ఒక రాజకీయ ముసుగు. 1976లో రాజ్యాంగంలో చొరబడిన ఈ పదం 1947 నుంచే భారతీయ మూలాలను హరించడం మొదలు పెట్టింది. భారత్ సెక్యులర్ దేశమంటే డేవిడ్ ఫ్రాలే (అమెరికాకు చెందిన సంస్కృత పండితుడు, వాసుదేవశాస్త్రి అని పేరు మార్చుకున్నారు) అంగీకరించరు. ఇది హిందూ వ్యతిరేక దేశమనే ఆయన ఘంటాపథంగా అంటున్నారు. భారత్‌లో మెజారిటీ ప్రజలను దోపిడీ చేస్తున్న తీరులో ప్రపంచంలో మరెక్కడా మెజారిటీ ప్రజలు దోపిడీకి గురికావడం లేదని కూడా ఆయన రాస్తారు. 80 శాతానికి పైగా హిందువులు ఈ దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులనే చాలామంది అనుభవం. హిందువులకు కూడా హక్కులు ఉంటాయని గుర్తించాలని చాలామంది ఇవాళ కూడా చెబుతూ ఉంటారు.
ఇక్కడ సెక్యులరిజం అంటే హిందువుల హక్కులను నిరోధించడమే. వారి పండుగలను అడ్డుకోవడమే. వారి ఆచార వ్యవహారాలను అపహాస్యం చేయడమే. భారత్‌లో హిందూ దేవాలయాల మీద ప్రభుత్వ ఆధిపత్యం ఉంటుంది. కానీ మసీదుల కేసి, చర్చ్‌ల వైపు చూసే దమ్ము ధైర్యం వాటికి ఉండదు. చాలా చర్చ్‌ల భూములు లీజ్‌లోనివి. ఆ లీజ్ పూర్తయి దశాబ్దాలు గడుస్తున్నది. స్వాధీనం చేసుకునే ప్రయత్నమే లేదు. కానీ హిందూ దేవాలయాల మీద పన్నులు విధిస్తారు. వాటి భూములు వేలం వేయాలని కమ్యూనిస్టులు గొంతు చించుకుంటారు. దీపావళి జరుపుకుంటేనే ఇక్కడ వాయుకాలుష్యం, పర్యావరణ కాలుష్యం సంభవిస్తాయి. హోలీ రంగులు ప్రమాదకరం. కానీ ప్రతి జనవరి 1వ తేదీకి ప్రపంచమంతటా తగలబెట్టే బాణసంచా గురించి వీరెవరూ నోరెత్తరు. కొన్ని కొన్ని హిందూ ఆలయాల దగ్గర కనిపించే బలులు ఉదారవాదులకి అమానుషంగా కనిపిస్తాయి. ముస్లింల పండుగలలో తెగిపడే వేలాది జంతువుల తలలు వారికి కనిపించవు. కోర్టులు కూడా హిందువుల పండుగలంటే వెంటనే స్పందించి, కట్టడికి ఆదేశాలు ఇస్తాయి.
ఇక రాష్ట్ర ప్రభుత్వాల సంగతి చెప్పవలసిన అవసరమే ఉండదు. హిందువుల పండుగ, మైనారిటీల పండుగ ఒకే సమయంలో వస్తే హిందువుల పండుగల మీద నిషేధం విధించిన వాతావరణం ఇప్పుడు కూడా పశ్చిమ బెంగాల్‌లో ఉంది. కర్ణాటకలో దేవాలయాల పరిస్థితి ఘోరం. తమిళనాడులో హిందూ దేవాలయాల ముందే ఈవీ రామస్వామి నాయకర్ విగ్రహాలు ఉంటాయి. వాటికింద హిందూత్వాన్ని, ఆచారాలని కించపరిచే వ్యాఖ్యలు ఉంటాయి. దీనిని ప్రశ్నిస్తే హిందువులలో అసహనం పెరిగిపోయిందన్న ప్రచారం చేయడానికి ఒకవర్గం మీడియా సదా సిద్ధంగా ఉంటుంది. హిందూ అన్న పేరుతో ఉన్న పత్రికలు కూడా హేతుబద్ధం కాని విమర్శలను చేయడం రివాజుగా మారింది.





