
నెల్లూరులో వెలిసిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. కల్యాణమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామి భారీ రథంపై రంగనాయకులపేట పురవీధుల్లో విహరించారు. రథోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. అడుగడుగునా స్వామివారికి హారతులు ఇస్తూ, కొబ్బరికాయలు కొడుతూ, రథంపై ఉప్పు, మిరియాలు చల్లుతూ భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో బుధవారం ఉదయం 8.30 గంటలకు రథోత్సవాన్ని, రాత్రి 9 గంటలకు పొన్నవాహన ఉత్సవం జరగనున్నాయి.
రంగనాథుని జయజయ ధ్వనుల మధ్య నాలుగుకాళ్ల మండపం వరకు రథోత్సవం సాగింది. అనంతరం అక్కడ వేచి ఉన్న నరసింహకొండ నరసింహస్వామి రంగనాథునికి పట్టువస్త్రాలు సమర్పించి, సంప్రదాయబద్ధంగా సాగుతున్న ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. ఈ రథోత్సవాలకు ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు. కళాకారుల నృత్యాలు, డప్పులతో రథోత్సవాలు ఘనంగా జరిపించారు. రథోత్సవం సందర్భంగా పలువురు దాతలు ప్రసాదాలు, శీతల పానియాలు పంపిణీ చెయ్యడంతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. పోలీసులు భక్తులకు అన్ని రకాల భద్రత ఏర్పాట్లు చేశారు.





