
( జూన్ 25 – అత్యవసర పరిస్థితి )
స్వతంత్ర భారతదేశ చరిత్రలో 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 వరకు కొనసాగిన అత్యవసర పరిస్థితి ఒక చీకటి అధ్యాయంగా నిలిచింది. ప్రజాస్వామ్య విలువలు, పౌర హక్కులు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ తీవ్రంగా దెబ్బతిన్న ఈ కాలాన్ని భారత రాజకీయ చరిత్రలో అత్యంత వివాదాస్పద ఘట్టంగా భావిస్తారు. అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ దేశంలో అంతర్గత అస్థిరతను కారణంగా చూపుతూ ఎమర్జెన్సీని ప్రకటించగా, దాదాపు 21 నెలలపాటు దేశం నిర్బంధ పాలనను అనుభవించింది.
ఎమర్జెన్సీ అమలులోకి వచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థి నాయకులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు పెద్దఎత్తున అరెస్టులకు గురయ్యారు. మీసా..మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్, డీఐఆర్ వంటి చట్టాల కింద వేలాది మందిని జైలుకు పంపించారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను నిలిపివేయడంతో పాటు పత్రికలపై కఠినమైన సెన్సార్ విధించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా వార్తలను ప్రచురించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాన్ని విమర్శించిన వారిని అరెస్టు చేయడం సాధారణ విషయంగా మారింది.
ఈ కాలంలో ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ ప్రభావం అధికంగా కనిపించింది. కుటుంబ నియంత్రణ కార్యక్రమాల పేరుతో బలవంతపు శస్త్రచికిత్సలు నిర్వహించడం, పట్టణాల అభివృద్ధి పేరిట ముందస్తు హెచ్చరికలు లేకుండా ఇళ్లను కూల్చివేయడం వంటి చర్యలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించాయి. ప్రభుత్వ యంత్రాంగంపై నిఘా పెరగడంతో భయాందోళనల వాతావరణం నెలకొంది.
అయితే ఈ నిర్బంధ పరిస్థితులను ప్రజాస్వామ్య శక్తులు మౌనంగా అంగీకరించలేదు. లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో ఏర్పడిన లోక్ సంఘర్ష సమితి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమం కొనసాగింది. ఈ పోరాటంలో భారతీయ జనసంఘ్, సోషలిస్టు వాదులు, వివిధ ప్రతిపక్ష నాయకులతో పాటు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేలాది మంది సత్యాగ్రహాలు చేసి అరెస్టులకు సిద్ధమయ్యారు. ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు కరపత్రాలు, అజ్ఞాత పత్రికలు, రహస్య సమావేశాలు నిర్వహించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమం చురుగ్గా సాగింది. వందేమాతరం, ఎక్స్‌రే, గర్జన, అంతర్వాణి, ప్రజావాణి, జనవాణి వంటి అజ్ఞాత పత్రికల ద్వారా ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ప్రజలకు సమాచారాన్ని చేరవేశారు. రాష్ట్రవ్యాప్తంగా సత్యాగ్రహాలు, నిరసనలు నిర్వహించగా, అనేక మంది మీసా, డీఐఆర్ చట్టాల కింద అరెస్టయ్యారు. విశాఖపట్నం, భీమునిపట్నం, తణుకు వంటి ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యక్రమాల సమయంలో నిరసనలు వ్యక్తమయ్యాయి.
ఎమర్జెన్సీ కాలంలో జరిగిన నిర్బంధ చర్యలు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచాయి. చివరకు 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. పాత కాంగ్రెస్, భారతీయ జనసంఘ్, లోక్‌దళ్, సోషలిస్టు పార్టీల విలీనంతో ఏర్పడిన జనతా పార్టీ ఘన విజయం సాధించింది. ఇందిరా గాంధీ కూడా ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. దీంతో 21 నెలల నిర్బంధ పాలనకు తెరపడింది.
ఎమర్జెన్సీ కాలం భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక గుణపాఠంగా నిలిచింది. అధికార కేంద్రీకరణ, పౌర హక్కుల హరణ ప్రజాస్వామ్యానికి ఎంతటి ప్రమాదాన్ని కలిగిస్తాయో ఆ కాలం చాటిచెప్పింది. అదే సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వివిధ రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు, సాధారణ ప్రజలు చేసిన పోరాటం భారత రాజ్యాంగ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచింది. అందుకే ఎమర్జెన్సీ చరిత్రను కేవలం ఒక రాజకీయ ఘటనగా కాకుండా, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు సంబంధించిన శాశ్వత పాఠంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.





