ArticlesNews

తెలుగునాట సంఘ శిల్పి శ్రీ సోమయ్య

4views

సోమేపల్లి సోమయ్యగారు తెలుగునాట 30 సంవత్సరాలపాటు ప్రాంత ప్రచారక్‌గా గ్రామగ్రామాన సంఘకార్యం కోసం అవిశ్రాంతంగా పర్యటిస్తూ ఒక్కొక్క స్వయంసేవక్‌ను గుర్తించి కార్యకర్తగా మలచిన తీరు అద్భుతం. సామాజిక కార్యకర్తకు కావలసిన గుణగణాలను మొదటగా తాను ఆచరిస్తూ కార్యకర్తలను తీర్చిదిద్దిన తీరు ఎప్పటికీ మనకు అనుసరణీయం. అలాంటి అభినవ శిల్పి సోమేపల్లి సోమయ్యగారి గురించి సంఘ శతాబ్ది సందర్భంగా జాగృతి పాఠకుల కోసం కొన్ని జ్ఞాపకాలు..

సోమయ్యగారిది చాలా విలక్షణమైన వ్యక్తిత్వం. అనేక విషయాలను గూర్చిన చక్కని అవగాహన, స్పష్టమైన ఆలోచనారీతి, సమస్యను పరిష్కరించడానికి కావలసిన నైపుణ్యం వారిలో పుష్కలంగా ఉండేవి. ఎక్కడా తొట్రుపాటు కన్పించదు. రహస్య విషయ గోపనము, మితభాషిత్వము మొదలైన నేతృత్వ లక్షణాలుండేవి. కార్యకర్తల ఆర్తిని బాపి ఆదుకోవాలనే ఆతురత ఉండేది. కళాశాల చదువు తక్కువేగాని జీవి తాలను చదివింది ఎక్కువ. కార్యకర్తల నిర్మాణంలో కడు శ్రద్ధ వహించేవారు. ఎవరినీ తూలనాడేవారు కాదు. హృదయానికి హత్తుకొనేట్లు చెప్పడంలో అందెవేసిన చేయి. కార్యకర్తలకు ఎలాంటి సందేహాలు వచ్చినా ఇట్టే పోగొట్టి ముందుకు నడిపించగల కౌశలం ఉండేది.

కొన్ని వందల, వేలమందికి ప్రేరణనిచ్చిన మహనీయుడు శ్రీ సోమయ్య . చాలామంది వ్యక్తులతో వారికి ఎంతో ఆత్మీయానుబంధాలుండేవి.

విషయ నిష్ఠేగాని వ్యక్తి నిష్ఠకాదు
1946లో తెనాలిలోని రాంనగర్‌ ‌శాఖకు అన్నవరపు మాణిక్యాలరావు ముఖ్యశిక్షక్‌గా ఉండేవారు. సోమయ్యగారు కార్యవాహ. వ్యవస్థలో కొంత మార్పు తెచ్చి మాణిక్యాలరావును మరో శాఖకు మార్చారు. ‘ఆయనను మా శాఖ నుండి మారిస్తే మేము అసలు శాఖకే రాము’ అంటూ మొండికేసి కూర్చున్నారు వీరంతా. సోమయ్యగారు వీరందరిని కలుసుకొని, ‘మీరు సంఘానికి వస్తున్నది ఎందుకు?’ అని అడుగుతూ ‘సంఘం కోసమా లేక శిక్షక్‌ ‌కోసమా’ అని ప్రశ్నించారు. అంతా ‘సంఘ కోసము’ అన్నారు.

అయితే ‘సంఘం ఇప్పుడూ ఉంది కదా?’ అన్నారు. ఇంకా వివరిస్తూ ‘మనం సంఘానికి వెళుతున్నది వ్యక్తుల కోసం కాదు’ అన్నారు. ‘మనది విషయనిష్ఠేగాని, వ్యక్తి నిష్ఠ కాదు’ అని వివరించారు. ఈ విషయాన్నే మాణిక్యాలరావుచేత ఆ శాఖ స్వయంసేవకులందరికీ చెప్పించారు. అంతటితో ఆ ప్రహసనం ముగిసింది.

ఓరిమి, పరిశీలనా శక్తి
ఒంగోలు కార్యకర్త వెంకటాద్రి మాట్లాడుతూ ‘వారిలో జ్ఞాపకశక్తి చాలా గొప్పది. అలాగే వారికి గల ఓరిమి కూడా అనుకరింపదగినది. 1978లో ఒకసారి చీమకుర్తిలో తృతీయవర్ష అయిన స్వయం సేవకుల శిబిరం జరిగింది. అప్పుడు రిజర్వేషన్లకు సంబంధించిన చర్చ వచ్చింది. స్వయంసేవకులు కూడా కొందరు ప్రక్కదోవ పడుతున్నారు. కొంత మంది కార్యకర్తలు ఆందోళన వెలిబుచ్చారు. రిజర్వేషన్ల సమస్యపైన మరికొందరు కార్యకర్తలు చాలా ఉద్రిక్తతతో ప్రశ్నలవర్షం కురిపిస్తున్నారు. వారు చెప్పేదంతా సోమయ్యగారు చాలా ప్రశాంతంగా విన్నారు. ఆ తర్వాత ఏ మాత్రం ఆవేశం లేకుండా సమస్యను అన్ని కోణాల నుంచి విశ్లేషణ చేసి స్వయంసేవకులు వాస్తవాన్ని గ్రహించేట్లు చేశారు. వారిలో ఉన్న ఓరిమికి, పరిశీలనాశక్తికి అది ప్రబల నిదర్శనం.

సహాయం అందించే లక్షణం
ఇలాంటి సంఘటన గాలి సుబ్బారావు విషయంలో కూడా జరిగింది. వారి కుమారుడు 3 నెలల పసిబాలుడు ఇంట్లో కరెంటు షాక్‌ ‌కొట్టింది. చెయ్యి అంతా కాలిపోయింది. వైద్యం చేయించడానికి ఒంగోలు నుంచి గుంటూరు తీసుకెళ్లారు. అప్పుడు గుంటూరులో పి.వేణుగోపాలరెడ్డి ప్రచారక్‌గా ఉండేవారు. ఆయనతో విషయం చెప్పి ప్లాస్టిక్‌ ‌సర్జరీ చేయడానికి వీలు అవుతుందేమో ఎవరైనా మంచి డాక్టర్ను అడిగి తెలుసుకోవలసిందని సుబ్బారావు కోరారు. ప్రక్క గదిలో సోమయ్యగారు సంభాషణ విన్నారు. అయితే సుబ్బారావు ఒంగోలు తిరిగి వెళ్లిన నాల్గురోజులకు సోమయ్యగారి నుండి ఉత్తరం వచ్చింది. హైదరాబాద్‌కు వచ్చి డా।।బ్రహ్మాజీరావు వద్ద వైద్యం చేయించుకోమని రాశారు. పక్కగదిలో ఉండి, విని, వారంతట వారే శ్రద్ధ తీసుకొని ఉత్తరం రాశారంటే స్వయంసేవకుల పట్ల వారికి గల అనురాగం ఎంత గొప్పదో బోధపడుతుంది.

పుస్తక పఠనం
సోమయ్యగారు రోజంతా అనేక కార్యక్రమాల్లో తీరిక లేకుండా పనిచేస్తూ కూడా ప్రతిరోజు పుస్తకపఠనం గురించి శ్రద్ధ వహించేవారు. నారద భక్తిస్తోత్రాలు, దాసబోధ, గీతారహస్యం, 1857 స్వరాజ్య సంగ్రామం ఇత్యాది పుస్తకాలు చదువుతూ ఆసక్తి గల స్వయంసేవకులతో చర్చిస్తూ ఉండేవారు. అలాగే దినపత్రికలన్నీ చదివేవారు. శ్రీ గురూజీ, ఇంకా ఇతర సంఘ పెద్దల బౌద్ధిక్‌లలోని అంశాలను స్వయంసేవకులను కూర్చోబెట్టుకొని పునఃశ్చరణ చేసే వారు. ఇలా అనేక విషయాలపై స్వయంసేవకులతో చర్చిస్తూ ఉండటంవల్ల ఎవరెవరికి ఏ విషయాలపైన ఆసక్తి ఉన్నదో గమనించి, వాళ్లను ఆ విషయంలో ప్రోత్సహించేవారు.

వ్యక్తి నిర్మాణం
1956లో నెల్లూరులో హేమంత శిబిరం జరిగింది. ఆ రోజుల్లో ఆరుబయట స్వతహాగా తడికలతోగాని, గోనెసంచులతోగాని టెంట్లు నిర్మాణం చేసుకొని శిబిరాలు జరుపుకునేవారు. శిబిరం కొరకు నెలరోజుల ముందు నుంచే గోనెసంచులు సేక రించడం ప్రారంభమైంది. కర్రలు పాతి, వాటికి గోనె సంచులతో కట్టేపని 15 రోజులు సాగింది. సోమయ్యగారు కూడా స్వయంగా ఈ పనిలో పూర్తిగా నిమగ్నమయ్యారు. ప్రతిరోజూ స్వయంసేవకులను సోమయ్యగారు తన సైకిలుపై ఎక్కించుకొని తీసుకు వచ్చేవారు. రాత్రి 8నుండి12గంటలవరకు శ్రమించే వారు. దీనివల్ల తక్కువ ఖర్చుతో శిబిరం నిర్వహణ సాగేది. అంతేకాదు, ఇది నా పని, నేను స్వయంగా కష్టపడి నిర్మాణం చేసుకుంటాను అని స్వయం సేవకుల హృదయాలలో పాదుచేసుకుంది. ఈ ప్రభావం శిబిరంవల్ల లభించే శిక్షణపై కూడా సంఘం చేపట్టిన వ్యక్తి నిర్మాణ కార్యానికి దోహదం చేస్తుంది.

స్వయంసేవకులతో నిరంతర సంపర్కం
ఒంగోలులో సంఘ ప్రారంభ దినాల నుంచి రావుగారు అనే స్వయంసేవక్‌ ‌శాఖకు వస్తుండేవారు. వీరు సహృదయులు. కానీ ఎక్కువ మాట్లాడటం ఆయనకు అలవాటు. ఒకరోజు సోమయ్యగారిని భోజనానికి ఆహ్వానించాడు. మిగతా కార్యక్రమాన్ని దృష్టిలోపెట్టుకొని ‘ఆయన చాలాసేపు మాట్లాడి, మీ సమయం వృథా చేస్తారేమో’ అంటూ కొందరు స్వయంసేవకులు సోమయ్యగారికి ముందుగానే హెచ్చరిక చేశారు.

అయినా, సోమయ్యగారు వారింటికి భోజనానికి వెళ్లారు. అనుకున్నట్లుగానే రెండున్నర గంటలపాటు ఏవేవో విషయాలు చెపుతూ ఉన్నారు. సోమయ్యగారు అంతా ఓపికగా విని వచ్చారు. 30 సంవత్సరాల నుంచి సంఘంలోఉన్న స్వయంసేవక్‌ ‌వద్ద రెండున్నర గంటలు గడపడం వృథా అనుకుంటే ఎలా అన్నారు మిగతా స్వయంసేవకులతో.

అందరిని కలుపుకుపోవడం
ఒక స్వయంసేవక్‌ ‌పరిస్థితుల ప్రాబల్యం వలన వైరాగ్యం చెందాడు. అందుచేత ప్రతివారిని తూల నాడుతూ మాట్లాడటం అలవాటు చేసుకున్నాడు. ‘వాడా?’ వాడి సంగతి అందరికి తెలుసు’ అంటూ పెద్దవాళ్లను గూర్చి కూడా అంటుండటంతో స్వయంసేవకులకు అతడిపైన బాగా కోపం వచ్చి మాట్లాడటం మానేశారు. అందరు స్వయంసేవకుల లాగే రావుగారు కూడా అతడితో మాటలు తగ్గించేశారు. అతడు ఒకరోజు సోమయ్యగారి వద్దకు వచ్చి ‘చూడండి, నేను ఏమి అపరాధం చేశాను. సంవత్సరంనుండి రావుగారు కూడా నాతో మాట్లాడటం లేదు’ అని వాపోయాడు. అప్పుడు సోమయ్యగారు రావుగారిని కలుసుకొని ‘పరిస్థితుల ప్రభావంవల్ల కార్యకర్తలలో కొన్ని లోపాలు చోటు చేసుకోవచ్చు. వ్యక్తులందరు రాముడివంటి సచ్ఛీలురు కారు. లోపాలు లేని వ్యక్తులు అరుదు. ఈ లోపాలు సరిచేయడానికే సంఘం పెట్టారు. అందుకుగాను వ్యక్తులను దగ్గరికి తీసుకొని కలుపుకొనిపోవాలి. అలా ప్రయత్నం చేస్తూపోతే వారు మారుతారు. అలా కాకపోతే వారు అపకారం చేయడానికి సిద్ధపడే ప్రమాదం ఉంది. అందరి సంగతి ఎలా ఉన్నా కాస్త పెద్దవాళ్లు అతడిని దగ్గరకు తీసుకొని అనునయించి వారిని తీసుకురావాలి అని చెప్పారు.

కార్యకర్తలలో ‘మంచి’ని చూడడం
1977-78 సం.లో జనతా ప్రభుత్వం కొనసాగు తోంది. సోమయ్యగారు గుంటూరులో పెద్దల సమావేశం తీసుకొన్నారు. జి.వి.ఎల్‌ ‌తోపాటు సంఘ ప్రారంభదినాలలోని కార్యకర్త బోడి వెంకట రమణా రావు కూడా సమావేశంలో ఉన్నారు. జి.వి.ఎల్‌ అప్పుడు అంత చురుకుగా సంఘ కార్యక్రమాలలో పాల్గొనటంలేదు. సోమయ్యగారు ఆ విషయమే ప్రస్తావనకు తెస్తారని కార్యకర్తలు అనుకున్నారు. కాని ఆయన బైఠక్‌ ‌ప్రారంభంలోనే ‘ఈ సమావేశంలో నాకంటే సీనియర్‌ ‌కార్యకర్తలు ఇద్దరున్నారు’ అంటూ ఈ ఇద్దరి పేర్లు చెప్పారు. ఆ విధంగా వారికి పెద్దరికం ఇచ్చాక ఇక ఆయన అప్పగించే బాధ్యతను కాదనగలరా? కార్యశీలికి ఉండవలసిన గొప్ప లక్షణమిది.

స్వయంసేవకునిలో గల ప్రతిభ గుర్తించడం
ఆంజనేయులు అనే స్వయంసేవక్‌ ‌మూలికలకు సంబంధించిన విషయంపై పరిశోధన చేసి డాక్టరేట్‌ ‌పొందారు. సోమయ్యగారు ఒకరోజున కార్యా లయంలో ఆయనతో 30 ని.లు ఆ పరిశోధనకు సంబంధించిన వివరాలు విన్నారు. తరువాత ఆ సమాచారం ఎవరికీ చేరిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందో తెలియజేస్తానని చెప్పి వెళ్లిపోయారు. ఆంజనేయులు కనబడిన ప్రతిసారి మీ పరిశోధనకు ఏమైనా జోడించారా అంటూ ప్రోత్సాహకరంగా పలకరించేవారు. కొంతకాలం తరువాత ఒకానొక అఖిల భారతీయ స్థాయి సంగోష్టిలో పాల్గొనమని ఆంజనేయులుగారికి ఆహ్వానం వచ్చింది. ఈ ఆహ్వానం రావడానికి సోమయ్యగారే కారణమని ఆంజనేయులుకి అర్థమైంది.

కుల ప్రభావం
1977 ఎమర్జెన్సీ రోజుల్లో శ్రీరాములుతో పాటు ఇంకా కొంతమందిని నెల్లూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకుపోయారు. ఏదోఒక రికమండేషన్‌ ఉన్నవారిని విడిచిపెట్టేశారు. ఏ రికమండేషన్‌ ‌లేనటువంటి చలమయ్యను కేసులో ఇరికించారు. దానిమీద ఊళ్లోవాళ్లు, ‘ఏ కులంవాళ్లు ఆ కులంవాళ్లను విడిపించుకొన్నారు. అమాయకుడ్ని ఇరికించారు’ అనుకొన్నారు. ఈ విషయం సోమయ్యగారితో చెప్పగా, వారు నవ్వి ‘ఆ వదంతిలో నిజంఉండవచ్చు, లేకపోవచ్చు. కాని మనం మాత్రం ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోకూడదు. అదే నిజం అని కూడా అనుకోవద్దు. మిగతావారు ఏమి అనుకొంటున్నా రన్నది కాదు, కుల ప్రభావం మనపైన పడకుండా జాగ్రత్తపడాలి’ అని అన్నారు.

ఉత్తరాలు
కార్యకర్తలకు ఉత్తరాలు వ్రాసేటప్పుడు కూడా సోమయ్యగారు ఎంతో శ్రద్ధ కనపరిచేవారు. ఉత్తరాలు కార్యకర్తల నిర్మాణంలో భాగమేననిపించే రీతిగా ఉండేది. సంఘ కార్యక్రమాల వివరణ, ఆ స్వయం సేవకునిలో గల గుణదోషాలు, తన శక్తియుక్తులు సంపూర్ణంగా ఉపయోగించి సంఘ కార్యవిస్తరణకై కృషిచేసేందుకు తీసుకోవలసిన చర్యలు, ఇంటి పరిస్థితులు ఇత్యాది విషయాలన్నీ చోటుచేసుకునేవి. ముఖ్యంగా ఒక కార్యకర్త సంఘ కార్యానికి బాగా ఉపయోగపడతారని భావించినప్పుడు ఉత్తరంలోని విషయాలు ఇంకా లోతుగా ఉండేవి.

సంఘ ప్రతిజ్ఞే వారి జీవనమంత్రం
మహత్కార్యాలు సాధించడానికి సౌకర్యాలు ప్రధానం కావని వారి జీవనం నిరూపిస్తుంది. సంఘ కార్యంలో తాదాత్మ్యం చెందారు. సంఘంతో వారిది అవినాభావ సంబంధం. కన్నతల్లికంటే సమాజ కార్యమే ఆయన మనస్సులో ప్రముఖ స్థానం ఆక్రమిం చింది. త్యాగంతో పాటు వ్యవస్థితమైన ఆలోచన, జీవన విధానం వారి జీవితంలో పెనవేసు కున్నాయి.

కాలేజీ చదువులు పూర్తి చేయకపోయినా ప్రపంచంలోని అవసరమైన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మహామేధావి శ్రీసోమయ్య. వారి చూపులు నిరంతరం సమాజ కార్యం వైపే ఉండేవి. కీర్తిపట్ల విముఖత వారిలోని విలక్షణమైన పద్ధతి. సోమయ్యగారికి 60 ఏళ్లు నిండిన సందర్భంగా నూతన వస్త్రాలు బహుక రించాలనే కోరికను కొందరు చిలుకూరు సుబ్రహ్మణ్య శాస్త్రిగారికి వెళ్లడించారు. ‘పుట్టిన రోజు పండుగలు, షష్టిపూర్తులు జరుపుకోవడం నాకైతే ఇష్టంలేదు’, మీరు సోమయ్యగారిని అడగండి, వారంగీకరిస్తే తోడుపెళ్లికొడుకులాగా నేను కూర్చుంటాను’ అన్నారు సుబ్రహ్మణ్య శాస్త్రిగారు. ఈ విషయం సోమయ్యగారి దగ్గర ప్రస్తావనకు వచ్చింది. వారు చిరునవ్వుతో నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.

సోమయ్యగారి మనసులో ఏదో మూల కన్నతల్లికి సేవ చేయలేకపోతున్నాననే అనే బాధ ఉండేది. అవకాశం ఉన్నప్పుడల్లా తల్లిగారిని దర్శించి వస్తుండేవారు. ఆమె ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు స్వయంసేవకులెవరైనా ప్రయత్నించడానికి ముందుకు వస్తే నిర్మొహమాటంగా తిరస్కరించేవారు. వారు సంఘ ప్రతిజ్ఞను స్వీకరించినప్పటి నుండి అంతిమ క్షణంవరకు నిత్య జప మహామంత్రంగా జపిస్తుండే వారు. ఈ మహామంత్రాన్ని మరువకూడదని స్వయంసేవకులకు కూడా సూచిస్తుండేవారు.

(‘‌స్ఫూర్తి ప్రదాత శ్రీ సోమయ్య’ పుస్తకం నుంచి)