
ముంబైలోని హార్బర్ లైన్ మార్గంలో నడిచే ఏసీ లోకల్ రైళ్లలో క్రైస్తవ మత ప్రచార కరపత్రాలు అంటించి ఉన్నాయి. పన్వెల్ నుండి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ మధ్య నడిచే రైళ్లలో ఈ కరపత్రాలు కనిపించినట్లు సమాచారం.
కరపత్రాలలో మానసిక, భావోద్వేగ సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని “మీ జీవితంలో మీకు మద్దతు అవసరమా?”, “యేసు దేవుడు”, “మీరు ప్రేమించబడటానికే సృష్టించబడ్డారు” వంటి సందేశాలను ప్రచారం చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే నిరుద్యోగం, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడి వంటి పరిస్థితులను ప్రస్తావిస్తూ “మిమ్మల్ని యేసు మాత్రమే రక్షించగలడు” అనే సందేశాన్ని ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రయాణికులను మరింత ఆకర్షించేందుకు “ThisLoveStory.org” అనే వెబ్‌సైట్ చిరునామాను కూడా కరపత్రాలలో ప్రదర్శించినట్లు సమాచారం.
ఈ ఘటనపై స్పందించిన డాక్టర్ స్వప్నిల్ నీలా మాట్లాడుతూ, రైళ్లలో లేదా రైల్వే ఆస్తులపై ఎలాంటి అనుమతి లేని కరపత్రాలు, పోస్టర్లు అంటించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు గమనిస్తే వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించాలని కోరారు. విచారణలో దోషులుగా తేలిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రైల్వేలు ప్రజా రవాణా వ్యవస్థలు కావడంతో, మతపరమైన ప్రచార కార్యకలాపాలు అధికారిక అనుమతులు లేకుండా నిర్వహించకూడదని పలువురు ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.





