ArticlesNews

పీవోకేలో రక్తపాతం-పాక్‌ అ‌ప్రజాస్వామ్యం

20views

ఒకే కశ్మీరం..కానీ భిన్న రూపాలు.. జవ్మ-కశ్మీర్‌ ‌చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా అత్యంత కీలకమైన జోజిలా సొరంగా మార్గ పనుల కీలక ఘట్టం కొద్ది రోజుల క్రితమే పూర్తయింది. భారత ప్రభుత్వం భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రవాణా మార్గాల విస్తరణ, పర్యాటక అభివృద్ధి పనులను వేగంగా కొనసాగిస్తోంది. అదే సమయంలో పాకిస్థాన్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ ఆం‌దోళనలు, హింసాత్మక అల్లర్లతో అట్టుడికిపోయింది. సైన్యం కాల్పుల్లో అక్కడి ప్రజలు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. న్యాయం అడిగిన వారి నెత్తురు కళ్లజూడటం ద్వారా పాకిస్థాన్‌ ‌తన పైశాచికత్వాన్ని బయట పెట్టుకుంది. నియంత్రణ రేఖకు ఇరువైపులా గల కశ్మీర్‌లో పరస్పర భిన్నమైన పరిస్థితు లకు ఈ రెండు ఘటనలే సజీవ సాక్ష్యం.

పేరుకే ఆజాదీ.. కానీ అక్కడి ప్రజలు స్వాతంత్య్రం కోల్పోయారు. తమ ప్రాంతం మీద హక్కులు లేవు. అక్కడ ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోంది. ప్రభుత్వం నుంచి న్యాయంగా దక్కవలసిన వాటినే ప్రజలు అడుగుతున్నా, గొంతెత్తితే అణచివేస్తున్నారు. ప్రశ్నిస్తే తుపాకీ గుండుతోనే సమాధానం లభిస్తుంది. పాకిస్థాన్‌ ‌ప్రభుత్వం ‘ఆజాద్‌ ‌కశ్మీర్‌’ అని పిలిచే ఆక్రమిత కశ్మీర్‌లో పరిస్థితి ఇది. గత కొన్నాళ్లుగా ముజఫరాబాద్‌, ‌రావల్‌కోట్‌, ‌మీర్‌పూర్‌ ‌పట్టణాలు నిరసనలతో అట్టుడుకుతు న్నాయి. ఈ నిరసనల గొంతుకలను పాకిస్థాన్‌ ‌సైన్యం తుపాకులతో అణిచివేసింది. ఈ ఆందోళనల్లో వంద మందికిపైగా మృత్యువాత పడ్డా, ఆ సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారు. గాయపడ్డవారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

మే 5వ నాటికి పాకిస్థాన్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌లో ఆందోళనలు ఊపందుకున్నాయి. ఆ రోజు రాత్రి సైన్యం జరిపిన కాల్పుల్లో ఒక వ్యాపారి మరణిం చడంతో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగాయి. రావల్‌కోట్‌లో సైన్యానికి, నిరసనకారులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. వ్యాపారి మృతదేహాన్ని భద్రపరచిన సైనిక ఆస్పత్రి వెలుపల జేఏఏసీ మద్దతుదారులు భారీగా గుమిగూడగా, భద్రతా దళాలు వారిని చెదరగొట్టాలని చూశాయి. ఆగ్రహించిన జనం వారిపై దాడులకు దిగారు. భద్రతాదళాలు జరిపిన కాల్పుల్లో ఆరుగురు నిరసనకారులు మరణించారు. ఆ తర్వాత పలువురిని అరెస్టు చేశారు. జాయింట్‌ అవామీ యాక్షన్‌ ‌కమిటీ (జేఏఏసీ) కార్యకర్తలు ఆటోమేటిక్‌ ‌రైఫిళ్లు, పెట్రోల్‌ ‌బాంబులు, ఇతర ఆయుధాలతో దాడులకు దిగారని రావల్‌కోట్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సర్దార్‌ ‌వహీద్‌ ‌ఖాన్‌ ‌ప్రకటించడం వారిని మరింత ఆగ్రహానికి గురి చేసింది

జూన్‌ 9‌వ తేదీన రావల్‌కోట్‌ ‌జేఏఏసీ పిలుపు మేరకు జరిగిన ప్రదర్శనలో పురుషులు, మహిళలు, చిన్నారులు, వృద్ధులు, న్యాయవాదులు, వర్తకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అక్కడి నుంచి రాజధాని ముజఫరాబాద్‌ ‌వైపు చేపట్టిన లాంగ్‌ ‌మార్చ్ ‌కాన్వాయ్‌ ‌ర్యాలీని అడ్డుకొనేందుకు పాకిస్థాన్‌ ‌సైన్యం ప్రయత్నించడంతో ఆందోళనకారులు తిరగబడ్డారు. దీంతో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి.సైన్యం ఒక్కసారిగా వారి మీద కాల్పులకు దిగడంతో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని, 200 మంది వరకు గాయపడ్డారని అధికారికంగా చెబుతున్నారు. అయితే మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. 11వ తేదీన స్థానిక ఈద్గా మైదానంలో సమావేశమై బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, తమ కనీస అవసరాలు తీర్చాలని, ప్రాథమిక హక్కులను గుర్తించాలని ఆందోళన చేస్తున్న ప్రజలపై సైన్యం తుపాకులతో విరుచుకుపడింది. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 37 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

నిరసనలకు మూలం
గత కొన్నాళ్లుగా పాకిస్థాన్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌లో వనరుల దోపిడీ, రాజకీయ వివక్ష, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, విద్యుత్‌ ‌కొరత- బిల్లుల భారం, నిత్యావసరాల కొరత, ఇంటర్నెట్‌ ‌నిలిపివేత తదితర సమస్యలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కొత్తగా ఏర్పడ్డ జేఏఏసీ ప్రజలను సమీకరించి పోరాటం చేస్తోంది. సరసమైన ధరకు గోధుమ పిండి, బియ్యం, విద్యుత్‌ అం‌దించాలని, తమ ప్రాథమిక హక్కులను గుర్తించాలని వారు డిమాండ్‌ ‌చేస్తున్నారు. ఉద్యమకారులు 38 కోర్కెలను ప్రభుత్వం ముందుంచారు. డజను సీట్ల కోటా రద్దుతోపాటు, మంత్రులు, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులకిస్తున్న ఖరీదైన కార్లు, ఉచిత విద్యుత్‌ ‌తదితర రాయితీలు రద్దు చేయాలని, సంబంధిత నిధులను జన సంక్షేమానికి వ్యయం చేయాలని కూడా వారు కోరుతున్నారు. కానీ వాటిని పరిష్కరించడం కాదు కదా, పాకిస్థాన్‌ ‌ప్రభుత్వం కనీసం ఆలకించడంలేదు. పీవోకే ప్రజల డిమాండ్లు కొత్తవేం కాదు.

రావల్‌కోట్‌, ‌ముజఫరాబాద్‌, ‌మరికొన్ని ఇతర ప్రాంతాల్లో 2023లో స్థానిక సమస్యలపై కమిటీలు ఏర్పడి ఉద్యమించాయి. ప్రజల మౌలికాహారమైన గోధుమ పిండి ధర పెంచడాన్ని ప్రశ్నించాయి. పుష్కలంగా ఉన్న వనరులను పాక్‌ ‌ప్రభుత్వం దోచుకుంటోందని, కనీసం బతికే అవకాశాలను తమకు ఇవ్వడం లేదని పీఓకే ప్రజలు వాపోతుండగా, వారి ఆందోళనలను పాలకులు ఉక్కు పాదంతో అణచి వేస్తున్నారు.

ఉత్తుత్తి ఎన్నికలు
అదే సమయంలో పాకిస్థాన్‌ ‌ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పుండు మీద కారం చల్లినట్లు స్థానికులకు ఆగ్రహం తెప్పించింది. ఆక్రమిత కశ్మీర్‌ ‌వనరులను పూర్తిగా కొల్లగొట్టాలంటే అక్కడి ప్రజా ప్రభుత్వం పాక్‌ ‌కనుసన్నల్లో నడవాలి. పీవోకేకు ప్రత్యేక జెండా, అధ్యక్షుడు, ప్రధాని ఉన్నా ఆ ప్రాంతాన్ని శాసించేది పాకిస్థానే అన్నది ప్రపంచానికి తెలుసు. అధికారాలన్నీ ఇస్లామాబాద్‌లో కొలువుదీరిన సైనికాధికారుల ఆధిపత్యంలోని కశ్మీర్‌ ‌కౌన్సిల్‌ ‌చేతిలో ఉంటాయి. ఈ ప్రాంతానికి ఓ శాసన సభ ఉంది. అందులో 53మంది సభ్యులుంటారు. జులై 27న శాసనసభకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ శాసనసభలో ఉన్న మొత్తం 45 స్థానాలకు గానూ12 స్థానాలను పీవోకేకు చెందని పాక్‌ ‌జాతీయు లకు కేటాయించింది. మరో అయిదు మహిళలకూ, ఉలేమాలు, సాంకేతిక నిపుణులు, విదేశాల్లో స్థిరపడిన కశ్మీరీలకు ఒక్కొక్క స్థానం ఉంటాయి. ఈ ఖాతాల కింద పోయే 20 స్థానాలకూ ఎన్నికలు జరిగేదెక్కడో, నిర్వహించేదెవరో ఎవరికీ తెలియదు. వారు ఎన్నుకోవాల్సింది మాత్రం 33 మందిని. మళ్లీ ఇందులో అత్యధికులు పాక్‌ ‌పాలకుల కనుసన్నల్లో నడిచేవారే ఉంటారు.

ఈ ఎన్నికల్లో శరణార్థుల పేరిట రిజర్వ్ అయ్యే సీట్ల ద్వారా పీవోకేపై పట్టు నిల్పుకోడానికి పాకిస్తాన్‌ ‌లోని ప్రధాన రాజకీయ పార్టీలు పాకిస్థాన్‌ ‌ముస్లిం లీగ్‌ (ఎన్‌), ‌పాకిస్థాన్‌ ‌పీపుల్స్ ‌పార్టీ ప్రయత్నిస్తున్నాయి. దీంతో జేఏఏసీ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. శరణార్థుల పేరుతో రిజర్వు చేసిన 12 సీట్ల రిజర్వేషన్‌ను రద్దు చేయాలన్నది వీరి ప్రధాన డిమాండ్‌. ‌కానీ పాకిస్థాన్‌ ‌ప్రభుత్వం ఇంకో ఎత్తుగడ వేసింది. జూన్‌ 5‌న అల్లర్లు, జూన్‌ 9 ‌తలపెట్టిన లాంగ్‌ ‌మార్చ్ ‌కాన్వాయ్‌ ‌కన్నా ముందే జేఏసీని ‘యాంటీ టెర్రరిజం యాక్ట్ 2014’ ‌కింద పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ ‌హోం శాఖ నిషేధించింది. ఈ సంస్థ దేశంలో ‘భయాందోళనలు, అరాచకం, ద్వేషాన్ని’ రేకెత్తిస్తోందని ఆరోపించింది. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి భారతదేశం మీద దాడులకు ఉసిగొల్పే ప్రభుత్వమే ప్రజా హక్కుల కోసం పోరాడే సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం విడ్డూరం.

ఆక్రమిత కశ్మీరం..
పాకిస్థాన్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ ‌పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే కొంత చరిత్రలోకి వెళ్లాలి. 1947 ఆగస్టులో బ్రిటిష్‌వారు భారత్‌కు స్వాతంత్య్రం ప్రకటిం చడంతోపాటు ముస్లింల కోసం దేశాన్ని విడగొట్టి పాకిస్థాన్‌ ఏర్పాటు చేయడం తెలిసిందే. దేశంలోని 562 సంస్థానాలకుగానూ,పెద్ద సంఖ్యలో భారతదేశంలో విలీనం కాగా, జవ్మ కశ్మీర్‌, ‌జునాగఢ్‌, ‌హైదరాబాద్‌ ఏ ‌నిర్ణయం తీసుకోలేదు. తొలి హోంమంత్రి వల్లభ్‌భాయ్‌ ‌పటేల్‌ ‌చతుర్విధ ఉపాయాలతో జునాగఢ్‌, ‌హైదరాబాద్‌ ‌సంస్థానాలను దారికి తెచ్చారు. కానీ జవ్మ కశ్మీర్‌ ‌విషయాన్ని ప్రధాని జవాహర్‌లాల్‌ ‌నెహ్రూ తన చేతిలోకి తీసుకు న్నారు. తన సంస్థానంలో ముస్లింలు అధికంగా ఉండటం, షేక్‌ అబ్దుల్లా అలజడి కారణంగా జవ్మ కశ్మీర్‌ ‌సంస్థాన పాలకుడు మహారాజా హరిసింగ్‌ ఈ ‌వ్యవహారాన్ని జాగ్రత్తగా పరిష్కరించాలని నిర్ణయించారు.

ఈలోగా పాకిస్తాన్‌ ‌సైన్యం జవ్మ కశ్మీర్‌ ‌మీద కన్నేసింది. అక్టోబర్‌ల• గిరిజన తెగల ముసుగులో పాకిస్థాన్‌ ‌సైనికులు ఆక్రమణ మొదలు పెట్టారు. ఈ పరిణామాలతో హరిసింగ్‌ 1947 అక్టోబర్‌ 26‌న సంస్థానాన్ని సంపూర్ణంగా భారత్‌లో విలీనం చేస్తూ సంతకాలు చేశారు. దురాక్రమణకు దిగిన శత్రు వ•కలను తిప్పి కొట్టడానికి భారత సైన్యం వెంటనే రంగంలోకి దిగి, యుద్ధంలో పైచేయి సాధించి ఆక్రమిత ప్రాంతాలను విడిపిస్తూ ముందుకు సాగుతోంది. సరిగ్గా అప్పుడే జవాహర్‌ ‌లాల్‌ ‌సమస్యను ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లి మరింత జటి•లం చేశారు. యథాతథ స్థితిని కొనసాగిం చడంతో పాటు ఏడాదిలోపు ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని సమితి ఆదేశించింది. దీంతో అప్పటి నుంచీ పాకిస్థాన్‌ ‌సైన్యం చేతి నుంచి విముక్తి కాకుండా మిగిలిపోయిన ప్రాంత పరిస్థితి అపరిష్కృతంగానే ఉండిపోయింది. ఈ ప్రాంతాన్నే పాకిస్థాన్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ (‌పీవోకే) అని పిలుస్తున్నాం. వాస్తవానికి ఈ ప్రాంతం మీద పాకిస్థాన్‌కు ఎలాంటి హక్కు లేదు. ఏ నాటికైనా భారతదేశంలో చట్ట ప్రకారం భాగంగా ఉన్న జవ్మ కశ్మీర్‌ ‌రాష్ట్రంలో విలీనం కావాల్సిందే.

ఆజాదీ ఉత్త మాట
పాకిస్థాన్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ ‌పరిస్థితి చాలా విచిత్రం.ఈ ప్రాంతాన్ని పాకిస్థాన్‌ ‌తన అధికారిక ప్రావిన్స్‌గా కలుపుకోలేదు. అలా చేస్తే మొత్తం జవ్మ కశ్మీర్‌పై తమ హక్కు బలహీనపడుతుందని అక్కడి పాలకుల భయం. అందుకే ఒకవైపు కశ్మీర్‌ ‌వివాదం కొనసాగుతుందనే వాదనను నిలబెట్టుకుంటూనే, మరోవైపు ఆ ప్రాంతాన్ని స్వయంప్రతిపత్తి కలిగిన ప్రాంతంలా ప్రపంచానికి చూపించే వ్యూహాన్ని అమలు చేసింది. పాకిస్థాన్‌ ‌పాలకులు జవ్మ కశ్మీర్‌ ఉ‌గ్రవాద కార్యకలాపాల ద్వారా వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తూ, అంతర్జాతీయ సమాజం దృష్టిలో వివాదాస్పద ప్రాంతంగా చూపిస్తూ వచ్చింది. తాను ఆక్రమించుకున్న భూభాగాన్ని ‘‘ఆజాద్‌ ‌జవ్మ అండ్‌ ‌కశ్మీర్‌ (ఏజేకే)’’గా పిలుస్తుంది.

విచిత్రం ఏమంటే పేరుకే ఆజాది (స్వాతంత్య్రం). అక్కడి ప్రజలకు ఏమాత్రం స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, స్వయం నిర్ణయాధికారాలు లేవు. పెత్తనం మొత్తం ఇస్లామాబాద్‌ ‌కనుసన్నల్లోనే ఉంటుంది.1949 కరాచీ ఒప్పందం ద్వారా ఆజాదీ కశ్మీర్‌ ‌రక్షణ, విదేశాంగం, సమాచార వ్యవస్థ వంటి కీలక అధికారాలను పాకిస్థాన్‌ ‌తన చేతుల్లోకి తీసుకుంది. 1974లో తాత్కాలిక రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చి అధ్యక్షుడు, ప్రధాని, శాసనసభ, న్యాయవ్యవస్థ వంటి వ్యవస్థలను ఏర్పాటు చేసింది. దీంతో పీవోకేకు ప్రత్యేక గుర్తింపు ఉన్నట్లు ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది. ఆ రాజ్యాంగం ప్రకారం పీవోకే అధ్యక్షుడు రాజ్యాంగబద్ధ అధిపతిగా, ప్రధాని కార్యనిర్వాహక అధిపతిగా వ్యవహరించాలి. కానీ అలా ఏనాడూ జరగలేదు. కీలక నిర్ణయాలు తీసుకునే అధికారాలు ఎక్కువగా పాకిస్థాన్‌ ‌ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటూ వచ్చాయి.

గిల్గిత్‌-‌బాల్టిస్థాన్‌ ‌కథేంటి?
పాకిస్థాన్‌ ‌ప్రభుత్వం పీవోకే నుంచి గిల్గిత్‌-‌బాల్టిస్థాన్‌• ‌ప్రాంతాన్ని వేరుగా చూపుతూ మరో కుట్రలను అమలు చేస్తోంది. ఇందులో కొన్ని వ్యూహాత్మక భౌగోళిక కారణాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ ప్రాంతాన్ని నార్తర్న్ ఏరియా (ఉత్తర ప్రాంతాలు)గా పిలుస్తారు. దశాబ్దాల పాటు ఎలాంటి ప్రజాస్వామ్య హక్కులు లేని ఈ ప్రాంతంలో ప్రజల తిరుగుబాటును అణచడానికి 2009లో పాకిస్థాన్‌ ‌ప్రభుత్వం ఒక ఆర్డర్‌ ‌తెచ్చింది. దీని ద్వారా ‘ఉత్తర ప్రాంతాలు’ అనే పేరును ‘గిల్గిత్‌-‌బాల్టిస్థాన్‌’‌గా మార్చి, అక్కడ స్థానికంగా 33 సీట్లతో ప్రత్యేక లెజిస్లేటివ్‌ అసెంబ్లీని ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఎప్పుడైనా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో కశ్మీర్‌ అం‌తటా ప్రజాభిప్రాయసేకరణ జరిగితే, కశ్మీరీయేతర ప్రాంతంగా ఉన్న గిల్గిత్‌-‌బాల్టిస్థాన్‌ ఓట్లు తమకు అనుకూలంగా విడిగా ఉపయోగపడతాయని పాక్‌ ‌భావించింది. అందుకే దీనిని ఆజాద్‌కశ్మీర్‌తో కలపకుండా ప్రత్యేక రాజకీయ ఉనికిని కొనసాగి స్తోంది.

గిల్గిత్‌-‌బాల్టిస్థాన్‌ ‌సరిహద్దులు చైనాతో ముడిపడి ఉన్నాయి. ఈ ప్రాంతంలోని షక్సగం లోయను పాక్‌ ‌పాలకులు చైనాకు కట్టబెట్టారు. రూ.కోట్ల విలువైన చైనా-పాకిస్థాన్‌ ఎకనామిక్‌ ‌కారిడార్‌ (‌సీపెక్‌)ఈ ‌ప్రాంతం గుండానే వెళుతోంది. కశ్మీర్‌ ‌వివాదంతో ముడిపడి ఉన్న ఏజేకే అసెంబ్లీ పరిధిలో ఈ ప్రాంతం ఉంటే చైనా ప్రాజెక్టులకు చట్టపరమైన ఇబ్బందులు వస్తాయని, పాక్‌ ‌సైన్యం దీనిని నేరుగా తన అధీనంలో ఉంచుకుంది. జూన్‌ 7‌వ తేదీన ఇక్కడి అసెంబ్లీకి ఎన్నికలు జరగగా పాకిస్థాన్‌ ‌పీపుల్స్ ‌పార్టీ అధికారం దక్కించుకుంది. వాస్తవానికి గిల్గిత్‌-‌బాల్టిస్థాన్‌ ‌ప్రాంతం భారత కేంద్ర పాలిత ప్రాంతం లద్దాక్‌లో అంత ర్భాగం. ఇది కూడా ఏనాటికైనా మన దేశంలో కలవాల్సిందే. పాకిస్థాన్‌ అ‌క్రమంగా ఎన్నికలు నిర్వహించడాన్ని తీవ్రంగా తప్పు పడుతూ అంతర్జాతీయ దౌత్య పరమైన నిరసనను భారత్‌ ‌వ్యక్తం చేసింది.

సవతి తల్లి ప్రేమ
పాకిస్థాన్‌ ‌ప్రభుత్వం మొదటి నుంచీ పీవోకే, గిల్గిత్‌-‌బాల్టిస్థాన్‌ ‌ప్రజల మీద సవతి తల్లి ప్రేమే చూపిస్తోంది.అక్కడి సహజవనరులను దోచుకుంటూ స్థానికులను ద్వితీయ శ్రేణి పౌరులుగానే చూస్తోంది. నివాస వసతి, ఆహారం, విద్య, వైద్యం, రోడ్లు, రవాణా, కవ్యనికేషన్‌, ఇం‌ధనం, ఉపాధి తదితర కనీస మౌలిక సదుపాయాలు అందడం లేదు. స్థానిక వనరుల ద్వారా వచ్చే ఆదాయాన్ని అభివృద్ధికి ఖర్చు చేయడం లేదు. జీలం, నీలం, పూంచ్‌ ‌నదులు, సరస్సులు సమృద్ధిగా ఉన్నప్పటికీ సురక్షిత తాగునీరు కూడా అందుబాటులో లేక జనం పాట్లు పడుతున్నారు. నదుల ద్వారా ఉత్పత్తి అవుతున్న మెగావాట్ల విద్యుత్‌ను పాకిస్థాన్‌ ‌నేషనల్‌ ‌పవర్‌ ‌గ్రిడ్‌ ‌ద్వారా తరలించుకుపోతున్నారు. పీవోకే ప్రజలకు 400 మెగావాట్లు అవసరం కాగా, 300 మెగావాట్లు కూడా ఇవ్వడం లేదు. పైగా పాకిస్థాన్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే పీఓకేలో అత్యధిక విద్యుత్‌ ‌బిల్లులను వసూలు చేస్తున్నారు. రోజుకు 18గంటల విద్యుత్‌ ‌కోతలు విధిస్తున్నారు. దీంతో విద్యాసంస్థలు, వ్యాపారాలు, నివాసాలు, ఆస్పత్రులు ఇలా అన్ని రంగాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అందుకే అక్కడి ప్రజలు పాకిస్థాన్‌ ‌ప్రభుత్వం మీద తిరగబడు తున్నారు.

గిల్గిత్‌-‌బాల్టిస్థాన్‌ ‌ప్రజలు కూడా పాక్‌ ‌ప్రభుత్వ వివక్షకు వ్యతిరేకంగా భారీ ఆందోళనలు, నిరసనలు జరుపుతున్నారు. భారతదేశంలో విలీనం కావాలని, కార్గిల్‌ ‌రహదారిని తెరవాలని కొందరు స్థానికనేతలు, నిరసనకారులు బహిరంగంగా డిమాండ్‌ ‌చేయడం గమనార్హం. ‘మాకు పాకిస్తాన్‌లోని పంజాబ్‌, ‌సింధ్‌ ‌ప్రావిన్స్ ‌వద్దు అంటున్నారు.

ప్రభుత్వమే మాఫియా
పాకిస్థాన్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ ‌మొత్తం జనాభా 50 లక్షల దాకా ఉంటుంది. యువతీ యువకులు సరైన ఉపాధి లేక ఖాళీగా ఉంటున్నారు. యువతలో నిరుద్యోగం 27 శాతం దాకా ఉంటుంది. స్థానికంగా పరిశ్రమలు, ప్రైవేట్‌ ‌కంపెనీలు లేకపోవడంతో యువత కేవలం ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధార పడాల్సి వస్తోంది. కొద్దిపాటిగా ఉన్న వ్యవసాయ రంగం పర్యావరణ మార్పులతో కుదేలవుతోంది. విదేశాల్లో పని చేసే కుటుంబ సభ్యులు పంపే సొమ్మే ప్రధాన జీవనాధారం. ద్రవ్యోల్బణం ధాటికి ఉన్న అరకొర ఆదాయాలూ పోతున్నాయి. కనీసం బతికే అవకాశాలను పాకిస్థాన్‌ ‌ప్రభుత్వం తమకు ఇవ్వడం లేదని పీఓకే ప్రజలు వాపోతున్నారు. ఈ ప్రాంతంలో ప్రకృతి పరంగా చూడదగ్గ అందమైన ప్రదేశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ పాక్‌ ‌ప్రభుత్వ పీవోకేలోని పర్యాటకులను అనుమతించదు.

అన్నింటికన్నా ముఖ్యంగా ఆక్రమిత కాశ్మీర్‌లో ఆహార ధాన్యాల కొరత చాలా ఉంది. పుష్కలంగా నదులు, సరస్సులు ఉన్నా పర్వత ప్రాంతాల కారణంగా కేవలం 13 శాతం భూమి మాత్రమే సాగుకు అనుకూలంగా ఉం ది. సంవత్సరానికి 1.5 లక్షల టన్నుల గోధుమలు, మొక్కజొన్న, వరి తదితర ఆహార ధాన్యాలు మాత్రమే పండుతాయి. కానీ పీవోకే జనాభా అవసరాలకు కనీసం 5 నుండి 6 లక్షల టన్నుల గోధుమలు అవసరం అవుతాయి. దీంతో 75 శాతం దాకా పాకిస్థాన్‌ ‌నుంచి రావాల్సిందే. సబ్సిడీపై గోధుమ పిండి సరఫరాను నిలిపి వేయడంతో, ఇదే అదనుగా పాకిస్థాన్‌ ‌సైన్యం గోధుమ పిండితో పాటు చక్కెరను నల్ల బజార్‌కు తరలిస్తోంది. కిరాణా దుకాణాల్లో నిత్యావసర సరుకులు అయిపోతున్నాయి.

పాక్‌ ‌తీరుపై భారత్‌ ఆ‌గ్రహం
జమ్మూ కశ్మీర్‌ ‌గురించి అంతర్జాతీయ వేదికలపై గంభీ రోపన్యాసాలిస్తూ, మానవ హక్కుల ఛాంపియన్‌గా తనను తాను చిత్రించుకునే పాకిస్థాన్‌ ‌గత కొన్ని రోజులుగా ఆక్రమిత కశ్మీర్‌లో నెత్తుటేర్లు పారించడాన్ని ప్రపంచం గమనిస్తోంది. పీవోకేలో మారణహోమం సృష్టిస్తున్న పాకిస్థాన్‌ ‌తీరును భారత్‌ ‌తీవ్రస్థాయిలో ఎండగట్టింది. తన వ్యవస్థీకృత వైఫల్యాలను, తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన లను కప్పిపుచ్చుకోవడానికి అసత్య ప్రచారాలను చేస్తోందని విమర్శించింది. పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌లో నెలకొన్న తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు, అణచివేత, ఆర్థిక దోపిడీ, స్వేచ్ఛను హరించడం వంటి సమస్యలను కప్పిపుచ్చ లేరని భారత విదేశాంగశాఖ పేర్కొంది. ఆక్రమించిన ప్రాంతాలను ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందే నని స్పష్టం చేసింది. పాక్‌ ‌దుశ్చర్యలను, మానవ హక్కుల ఉల్లంఘనలను ఖండించాలని, ఇందుకు ఆ దేశాన్ని జవాబుదారీ చేయాలని అంతర్జాతీయ సమాజం కోరుతున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ ‌జైస్వాల్‌ ‌తెలిపారు. గిల్గిత్‌-‌బాల్టిస్థాన్‌ ‌ప్రాంతంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడంపై కూడా భారత్‌ ‌తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. గిల్గిత్‌-‌బాల్టిస్థాన్‌ ‌పేరుతో పిలిచే ప్రాంతం సహా జవ్మ కశ్మీర్‌, ‌లద్దాఖ్‌లు భారత్‌లో అంతర్భాగమేనని మరోసారి స్పష్టం చేసింది.

అభివృద్ధి పథంలో కాశ్మీర్‌
‌పాకిస్థాన్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ ఆం‌దోళనలు, హింసాత్మక అల్లర్లతో అట్టుడుకుతుంటే భారత్‌ ‌పరిధిలోని జమ్మూ కశ్మీర్‌ ‌మాత్రం ప్రగతి పథంలో దూసుకెళుతోంది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో ప్రగతిప్రథంలో పరుగులు పెడుతోంది. అశాంతి, హింస, వేర్పాటువాదానికి కారణమైన ఆర్టికల్‌ 370‌ని 2019లో రద్దు చేయడం చారిత్రక నిర్ణయం.

ఈ ఏడాది మేలో రాష్ట్రంలో ఒక్క ఉగ్రవాద దాడి గానీ, హత్య గానీ నమోదు కాలేదు. గత మూడు దశాబ్దాలలో ఇలా జరగడం ఇదే తొలిసారి. 2021లో అత్యధికంగా 4,011 మరణాలు సంభవించగా, ఈ ఏడాది ఇప్పటి వరకూ ఆ సంఖ్య 9 మాత్రమే. ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇచ్చే వ్యవస్థలు బాగా బలహీనపడ్డాయి. ఉగ్రవాదంలోకి చేరేవారి సంఖ్య అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయింది. భద్రతా సంస్థలు సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నాయి. రెండు దశాబ్దాల క్రితం నాటి పరిస్థితులతో పోలిస్తే, నేడు జవ్మ కశ్మీర్‌లో భద్రతా వాతావరణం పూర్తిగా మారిపోయిందని అక్కడి అధికారులు చెప్పారు. ‘ఉగ్రవాదానికి ఊతమిచ్చే వ్యవస్థ మొత్తం ఇప్పుడు బాగా కుంచించుకుపోయింది. సరిహద్దుల గుండా చొరబాట్లు మరింత కష్టతరంగా మారాయి. ఉగ్రవాద శక్తులు క్షేత్రస్థాయిలో మళ్లీ పుంజుకోకుండా భద్రతాదళాలు సమర్థంగా నిరోధించగలుగు తున్నాయి’’ అని తెలిపారు

కేంద్ర ప్రభుత్వం జవ్మ కశ్మీర్‌ ‌ప్రజలకు సదుపాయాలు, ఉపాధి అవకాశాలకు మార్గాలను తెరిచింది. జాతీయ రహదారులు, సొరంగాలు, రైల్వేలు, విద్యుత్‌ ‌ప్రాజెక్టులు, పర్యాటక మౌలిక సదుపాయాలపై కేంద్రం భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఆ రాష్ట్రంలో 2021కి ముందు కేవలం 450 కోట్లుగా ఉన్న వార్షిక పెట్టుబడులు 2025-26 నాటికి 5వేల 824 కోట్లకు చేరాయి. లక్షా 60వేల కోట్లకు పైగా పెట్టుబడి ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి. 2020లో ఇక్కడ 69 స్టార్టప్‌లు మాత్రమే ఉండగా, 2025-26 నాటికి ఆ సంఖ్య 13వందలు దాటింది. జోజిలా సొరంగ మార్గం, చీనాబ్‌ ‌రైల్వే బ్రిడ్జి, కొత్త హైవేలు ఇక్కడి ప్రగతికి నిదర్శనాలు. మంచు కొండలు, పచ్చని లోయల మధ్య నుంచి వందేభారత్‌ ‌రైళ్లు పరుగులు తీస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం ఊహకు కూడా అందని దృశ్యం ఇప్పుడు కనిపిస్తోంది.

జమ్మూ కశ్మీర్‌లో కనిపిస్తున్న ఈ స్పష్టమైన అభివృద్ధి పాకిస్థాన్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అందుకే పహల్గావ్‌ ‌లాంటి దాడుల ద్వారా అశాంతిని సృష్టించేందుకు ప్రయ త్నించింది. భారత సైన్యం ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌ద్వారా పాకిస్థాన్‌ ఉ‌గ్రవాద స్థావరాలు, సైనిక సదుపాయాల, వైమానిక సదుపాయాల మీద దాడులు చేయడంతో కాళ్ల బేరానికి రాక తప్పలేదు.

‌క్రాంతిదేవ్‌ ‌మిత్ర
సీనియర్‌ ‌జర్నలిస్ట్