ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాన్య, అసామాన్యులు – 46 ; చీమకుర్తి శేషగిరిరావు

286views

చీమకుర్తి శేషగిరిరావు చేబ్రోలు పట్టణానికి దగ్గరలో ఉన్న వెల్లటూరు గ్రామంలో సంప్రదాయ కుటుంబంలో 1913 వ సంవత్సరం జూన్ 13న చిల్లర ఆదెమ్మ, ఆదినారాయణ దంపతులకు జన్మించారు. సాదారణంగా మధ్యతరగతి కుటుంబంలో వచ్చే ఇబ్బందులు కష్టనష్టాలతో బాల్యం చచ్చిపోయింది. విద్యాభ్యాసము అంతే.

ఆయన 13 సంవత్సరాల వయసులో చీమకుర్తి వెంకటప్పయ్య కుటుంబానికి దత్తత వచ్చారు దాంతో చిల్లర శేషగిరిరావు గారి పేరు చీమకుర్తి శేషగిరిరావు అయింది.దత్తు వచ్చినా, ఆయన విద్యాభ్యాసం వెల్లటూరులోనే జరిగింది. కాలేజీ చదువుకోసం తన స్వగ్రామం నుండి పది మైళ్లు నడిచి గుంటూరుకు రోజూ వచ్చేవాడు. శ్రీమన్ గుడిమెట్ల నరసింహాచార్యులు వద్ద సంస్కృతం అభ్యసించారు. పుట్టుకరీత్యా సాంప్రదాయ కుటుంబం అయినా విద్యాభ్యాసం కాలంలో హేతువాద దృష్టి అలవడింది. 1931లో తన 18వ యేట తన మేనమామ కూతురు రాజ్యలక్ష్మితో చీమకుర్తి శేషగిరిరావు వివాహం జరిగింది. శేషగిరిరావు గారు స్వాతంత్ర సమరంలో ఇల్లు వదిలి నెలలు నెలలుగా ఇంటికి దూరంగా ఉన్నా సంతోషంగా భరించి సమరంలో తన కర్తవ్యం నెరవేర్చిన భార్యమణి రాజ్యలక్ష్మి.

ప్రకాశంజిల్లా స్వాతంత్రోద్యమంలో వందేమాతర ఉద్యమం 1907లో మొదలయ్యింది. చీమకుర్తి పట్టణానికి చెందిన కోర్టు జయ రామ రెడ్డి ఉద్యమంలో పాల్గొని చీమకుర్తిలో సమరం ప్రారంభించారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారి స్పూర్తితో ఎందరో యువకులు స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. 1921లో సహాయ నిరాకరణ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న నేపథ్యంలో ప్రకాశం పంతులు గారి సొంత ఇల్లు ఐలాండ్ విల్లాలో జాతీయ పాఠశాల స్థాపన, గురువారెడ్డి పాలెంలో ఖాదీ కేంద్ర స్థాపన ఉద్యమాన్ని ఉచ్చస్థితికి తీసుకువెళ్ళాయి. వీటన్నిటి స్ఫూర్తితో చీమకుర్తి శేషగిరిరావు స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ కార్యకర్తగా చేరారు. 1930లో ఒంగోలు తాలూకా కాంగ్రెస్కు చీమకుర్తికి చెందిన శంకర వెంకటసుబ్బారెడ్డి అధ్యక్షుడిగా, కార్యదర్శిగా చీమకుర్తి శేషగిరిరావు ఎన్నికయ్యారు. వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్నారు.

1942 సంవత్సరం బాపట్లలో గుంటూరు జిల్లా కార్యకర్తల సమావేశం జరిగింది ఉడుకు రక్తం గల యువకులు చురుకుగా పోరాటంలో పాల్గొన్నారు. బ్రిటిష్ ఉప్పు చట్టాలను ధిక్కరించి 500 మంది కార్యకర్తలు ఉప్పు సేకరించారు. తెల్లవారి శాసనాన్ని ధిక్కరించి వస్తున్న బృందాన్ని అమ్మనబ్రోలు వద్ద పోలీసులు చూసి బృందం నేత సాగి విజయరామరాజు, కార్యకర్తగా ఉన్న చీమకుర్తి శేషగిరిరావు తప్పించుకొని, గుండ్లకమ్మ నదిని దాటి రాత్రి కరవది గ్రామంలో స్నేహితుని ఇంట్లో దాక్కొని రహస్యంగా పోలీసులకు దొరకకుండా రాత్రిళ్ళు ప్రయాణం సాగించి గుంటూరు చేరారు. గుంటూరులో ఆయనకు కాకినాడ బాంబు కేసు ముద్దాయి ప్రతివాది భయంకరాచారి గారి పరిచయం కలిగింది డైనమేట్లు సంపాదించడం, పేల్చటంలో తర్ఫీదు పొందారు.

బొంబాయి నుండి తిరిగి వచ్చాక ప్రభుత్వ కార్యాలయాలను, రైల్వేలను పేల్చి వేసే కార్యక్రమంలో, ఒంగోలు తాలూకా ఆఫీసులను పేల్చివేసే పథకం వేశారు. ఒంగోలులో దేశభక్తుడు రహంతుల్లా ఇంట్లో అనుచరులైన వేమూరి వెంకట సుబ్బయ్య, ముదివర్తి సత్యనారాయణ, రావినూతల వెంకటేశ్వర్లు బాంబులు తయారు చేస్తుండగా పూర్తికాకుండానే బాంబు ప్రేలి పోయింది. అందరికీ గాయాలయ్యాయి తలో దిక్కుకు పారిపోయారు. చీమకుర్తి శేషగిరిరావు మారుపేర్లతో ఉపాధ్యాయునిగా, పౌరాణికునిగా మారు వేషాలలో సంచరించేవారు. కనుపర్తి ఉప్పు కొఠారు కేసు, మరచెంబు బాంబు కేసులో శేషగిరిరావు పై పోలీసులు కేసు పెట్టారు. శేషగిరిరావు గారు దొరకలేదు. తర్వాతి కాలంలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఫిబ్రవరి 8, 1946 న అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రధాని కాగానే ఈ రెండు కేసులను ప్రభుత్వం ఉపసంహరించింది. 1946 మార్చి 11న శ్రీ శేషగిరిరావు గారు అజ్ఞాతం వీడి ప్రజా జీవితంలోకి వచ్చారు. అప్పటివరకు ఆయన ఎన్నో కష్టాలను అనుభవించారు.

స్వాతంత్ర్యం లభించాక కూడా చీమకుర్తి శేషగిరిరావు గారికి ఏ పదవి అయినా వరించలేదు. చీమకుర్తి శేషగిరిరావు గారు ఎక్కాలు మొదలుకొని ఎలక్ట్రానిక్స్ వరకు, పెద్దబాలశిక్ష మొదలు త్రిపిటకాలు వరకు నిద్రలో కూడా బోధించగల మేధావి. 1994 అక్టోబర్ 15న ఢిల్లీ నుండి వస్తూ భోపాల్లో కన్నుమూశారు.