
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మవారి చిన్న తిరునాళ్ల ఉత్సవాలు సోమవారం ఉదయం 6.03 గంటలకు అఖండజ్యోతి స్థాపనతో వైభ వంగా ప్రారంభమయ్యాయి. మహాసంప్రోక్షణ అనంతరం దేవస్థానం ఈఓ కె.రమేష్‌నాయుడు ఆధ్వర్యంలో వేద పండితులు, అమ్మ వారి ఆలయ ఆలయ ప్రధానార్చకుడు ఎం.గోపి, అర్చకులు, పాపమాంబ వంశీకులు ప్రత్యేక పూజలు జరిపించిన అనంతరం జ్యోతి వెలి గించి ఉత్సవాలను ప్రారంభించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు మునేరులో స్నానాలు చేసి పాలు, పొంగళ్లతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. భక్తులకు నిరంతరం తాగు నీరు పంపిణీ చేస్తున్నారు. దేవస్థానం వద్ద తాత్కాలికంగా పోలీస్ అవుట్ పోస్టు, వైద్య శిబిరాలు, పలు శాఖలకు చెందిన కార్యాలయాలు ఏర్పాటు చేశారు. విద్యుత్ దీప కాంతులతో ఆలయం మెరిసిపోతోంది. లడ్డూ ప్రసాదాల విక్రయానికి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. తిరునాళ్లలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నందిగామ ఏసీపీ రవికిరణ్ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట సీఐ జానకిరామ్ పర్యవేక్షణలో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు.





