News

తిరుమల కొండపై టీటీడీ తిరునామధారణ సేవ

5views

తిరుమల తిరుపతి అనగానే భక్తులకు గుర్తొచ్చేది వేంకటేశ్వరస్వామి దివ్య స్వరూపం, ఆ తర్వాత లడ్డూ ప్రసాదం. తిరుమల వెళ్లిన ప్రతి భక్తుడూ ఇష్టపడే మరో విషయం ఏమిటంటే తిరునామ ధారణ. అన్నప్రసాదం ఎంత భక్తితో ఆరగిస్తారో, తిరునామ ధారణ విషయంలోనూ అంత ఆసక్తి చూపుతుంటారు. పది రూపాయలు ఖర్చయినా పర్లేదు! అంటూ తిరునామధారణ చేస్తుంటారు. అయితే, ఇదంతా గతం. ఇకపై తిరునామధారణకు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. శ్రీవారి సేవకులే మీ దగ్గరకు వచ్చి పూర్తి ఉచితంగా అందించడంతో పాటు అక్కడక్కడా కౌంటర్లను సైతం ఏర్పాటు చేయడం విశేషం. వేలాది మంది సేవకులు తిరునామ ధారణ సేవలో తరిస్తున్నారు.

తిరుమల శ్రీవారి సన్నిధికి వచ్చే భక్తులలో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. కరోనా సమయంలో  ఆగిపోయిన తిరునామధారణ సేవను పునరుద్ధరణ చేసి ఉచితంగా అందిస్తోంది. నుదిటిపై మూడు నామాలతో గోవిందుడిని భక్తులు దర్శించుకునేలా ఏర్పాట్లు చేసింది. భక్తులు క్యూలైన్‌లోకి వెళ్లే ముందు కొండపైనా వివిధ ప్రాంతాల్లో శ్రీవారి సేవకులు తిలకధారణ సేవలో తరిస్తున్నారు.

సనాతన హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా శ్రీవారి పుణ్యక్షేత్రంలో భక్తులలో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించడానికి తిలకధారణ సేవను టీటీడీ వైభవంగా నిర్వహిస్తోంది. శ్రీవారి మూలమూర్తికి వారానికి ఒకసారి అలంకరించే పవిత్ర ‘తిరుమణికాపు’ తరహాలో భక్తులకు తిరునామాన్ని దిద్దుతారు. అయితే కరోనా మహమ్మారి తర్వాత గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిలిపివేసిన తిరునామధారణ సేవను టీటీడీ పున: ప్రారంభించింది. నుదిటిపై మూడు నామాల తిలకంతో భక్తులు ఆలయంలోకి వెళ్లేలా శ్రీవారి సేవకుల ద్వారా ఉచితంగా సేవలు అందిస్తోంది.

రోజుకు రెండు షిఫ్టుల్లో దాదాపు 168 మంది శ్రీవారి సేవకులు ఈ తిరునామధారణ సేవలో పాల్గొంటున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్- ఒకటి, రెండు, గొల్ల మండపం, బేడి ఆంజనేయస్వామి ఆలయం, కల్యాణకట్ట, వరాహస్వామి ఆలయం, సుపథం, రామ్ బగీచా, అన్నప్రసాద కేంద్రం, నాలుగు మాడ వీధులలో ఈ తిలకధారణ సేవ అందుబాటులో ఉంటుంది.

తిరునామం దిద్దడానికి ఎర్ర సింధూరం, నామకోపులను ఉపయోగిస్తారు. నుదుటన ఆగ్నేయచక్రంలో ఈ తిలకధారణ చేసుకోవడం వల్ల చెడుదృష్టి పడకుండా ఉంటుందని, భక్తి భావం పెరుగుతుందని భక్తుల నమ్మకం. తిరునామధారణ సేవలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని శ్రీవారి సేవకులు చెబుతున్నారు. భక్తులు సైతం నామాలు పెట్టుకునేందుకు ఎంతో ఉత్సాహం చూపుతున్నారన్నారు.