
నా మాతృభాష తెలుగు కాబట్టి ప్రాకృత భాష నుండి దాని మూలాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి నాకు సహజంగానే ఉంటుంది. అదేవిధంగా, తెలుగు లిపి బ్రాహ్మీ లిపి నుండి ఉద్భవించింది. ఈ పరిణామాలు ఏ కాలంలో జరిగాయో, వాటిని తీర్చిదిద్దిన రాజవంశాల గురించి పరిశీలించడం ఆసక్తి కరంగా ఉంటుంది. తెలుగు ప్రజల భూములలో లభించిన తొలి శాసనాలన్నీ ప్రాకృతం, బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి. కర్నూలు జిల్లాలో ఉన్న అశోకుని ఎర్రగుడి ప్రధాన శిలాశాసనం క్రీ.పూ. 245-246 నాటిది. అది ప్రాకృతంలో ఉంది.
కర్నూలులోని రాజుల మందగిరి, గుంటూరులోని అమరావతి శిలాశాసనం వంటి ఇతర మౌర్య కాలపు శాసనాలు ప్రాకృతంలో ఉన్నాయి. క్రీ.పూ. 2వ, 3వ శతాబ్దాలకు చెందిన గుంటూరులోని భట్టిప్రోలు శాసనం పూర్తిగా ప్రాకృతంలో, బ్రాహ్మీ లిపిలో ఉంది. కరీంనగర్ జిల్లాలో క్రీ.శ. మొదటి శతాబ్దానికి చెందిన శాతవాహన కాలం నాటి ముక్కట్రావుపేట, గట్టు సింగారంలో బైటపడిన రెండు శాసనాలు ప్రాకృతంలో ఉన్నాయి. కోటలింగాల నుండి లభించిన శాతవాహన పూర్వ, శాతవాహన పాలకుల నాణేలపై ఉన్న శాసనాలు కూడా ప్రాకృతంలోనే ఉన్నాయి. అదేవిధంగా, మహారాష్ట్ర, కర్ణాటక, ఇతర ప్రాంతాలలో లభించిన శాతవాహన శాసనాలు ప్రాకృతంలో ఉన్నాయి. ప్రాకృతం నుండి తెలుగు భాషను అభివృద్ధి చేయడానికి చేసిన తొలి ప్రయత్నాలు శాతవాహన పాలకుల చిత్రపట నాణేలలో కనిపిస్తాయి. ఈ నాణేల ముందువైపు ప్రాకృతాన్ని, వెనుకవైపు తొలి లేదా ప్రాచీన తెలుగును ఉపయోగించడం విశేషం.
తెలుగు అభివృద్ధికి మరో ఆధారం వారి చివరి పాలకుడైన పెద్దాబుంకురు నాణేలపై లభించింది. అతని పేరు పుదుమావికి బదులుగా పులుమావి అని రాసి ఉంది. విశేష నామాలు కూడా ప్రాకృతం లోనే ఉండటం విచిత్రం. ఉదాహరణకు, గోతమ, వశితి, కోసికి, పుదుమావి, రుద, ఖద మొదలైన పేర్లు శాతవాహన నాణేలపై కనిపిస్తాయి వాటికి సమానమైన సంస్కృత నామాలు గౌతమి, వశిష్టి, కౌసికి, పులుమావి, రుద్ర, స్కందగా ఉన్నాయి. శాతవాహన కాలంలో ప్రారంభమైన తెలుగు భాషాభివృద్ధి, కళ్యాణ చాళుక్యుల పాలనలో పూర్తయింది. ఈ కాలంలోనే 40 అక్షరాల బ్రాహ్మీ లిపి, 56 అక్షరాల కన్నడ/తెలుగు లిపిగా పరిణామం చెందింది. కళ్యాణ చాళుక్య పాలకుడైన సత్యశ్రయుడు తనను తాను ‘ఎరివబేడంగ’ అని పిలుచుకున్నాడు. ఈ పదంలోని ‘ర’ అనేది బ్రాహ్మీ లిపిలో లేని ‘రౌతు ర’. బ్రాహ్మీ లిపిలో లేని ఇతర పదాలు కూడా తెలుగు భాషలో చేరాయి.
తెలుగు గద్యం, పద్యం, వ్యాకరణం కొన్ని శతాబ్దాల కాలంలో రూపుదిద్దు కున్నాయి. వేంగి చాళుక్యులు, తెలుగు చోడుల సుదీర్ఘ పాలనా కాలంలో ఇది సాధ్యమైంది. ‘నన్నయ’ అనే పదం వేంగి చాళుక్యుల పాలనలో, ‘తిక్కన’ అనే పదం నెల్లూరు తెలుగు చోడుల పాలనలో ఉద్భవించాయి. వేంగి చాళుక్యులు దాదాపు ఐదు వందల సంవత్సరాలు పాలించారు, తెలుగు చోడుల విషయంలో కూడా అంతే. అది చాలా సుసంపన్నమైన కాలమై ఉండాలి, ఎందుకంటే మన దేశంలోనే అతిపెద్ద బంగారు నాణేల నిధి, అంటే 16,586 నాణేలు, నెల్లూరు సమీపంలోని కోడూరులో లభించాయి. అందుకే, నేను వేంగి చాళుక్యుల, తెలుగు చోడుల పాలనను ప్రశంసిస్తాను. ఈ రెండు రాజవంశాల నాణేలలోని ఇతర నూతన ఆవిష్కరణలను చూడవచ్చు. ఒక నాణేల అధ్యయనవేత్తగా, ఈ పాలకుల నాణేల నిధుల సంఖ్య ఇంత తక్కువగా ఉండటం నాకు నిరాశ కలిగించింది. వేంగి చాళుక్యులలో 33 మంది పాలకులు ఉండగా, వారిలో కొద్దిమంది పాలకుల నాణేలు మాత్రమే లభ్యమయ్యాయి. తెలుగు చోడుల విషయంలో కూడా ఇదే నిజం. టీటీడీ హుండీ నాణేలలో ఈ నాణేలు ఖచ్చితంగా ఉన్నాయని నేను నమ్ము తున్నాను. మేము శ్రీ వేంకటేశ్వర స్వామి వారి శ్రీవారి హుండీలోని బంగారు, వెండి నాణేలను అధ్యయనం చేశాము. అలాగే, మన తెలుగు చరిత్రకు మరింత వన్నె తెచ్చే భాస్మిక లోహ నాణేలను కూడా అధ్యయనం చేయవలసి ఉంది.
వేంగి చాళుక్య నాణేలు
తూర్పు చాళుక్య రాజవంశం, వేంగి చాళుక్యులుగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇది క్రీ.శ. 624 నుండి 1189 వరకు దక్కన్‌లో అత్యంత సుదీర్ఘకాలం పాలించిన రాజవంశం. ఈ కాలం తెలుగు భాష అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన కాలంగా ప్రసిద్ధి చెందింది. వేంగి రాజవంశం వాతాపిలోని బాదామి చాళుక్యుల నుండి ఉద్భవించింది. బలహీనపడిన విష్ణుకుండినుల నుండి ఈ భూభాగాన్ని జయించి, క్రీ.శ. 624లో తన సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనుడిని వేంగి సింహాసనంపై కూర్చోబెట్టింది రెండవ పులకేశి (క్రీ.శ. 609-642). వేంగి పాలనలో, 40 అక్షరాల మౌర్య బ్రాహ్మీ లిపి 56 అక్షరాల తెలుగు ‘లిపి’గా పరిణామం చెందింది. నాణేలు కూడా విష్ణుకుండినుల నుండి వేంగికి జరిగిన పరివర్తనను చూపుతాయి. విష్ణుకుండినుల నాణేలు సింహం, కలశ రూపాలను కలిగి ఉండి విలక్షణంగా ఉండేవి. ఇవి రాగి నాణేలుగా మాత్రమే లభ్యమవుతాయి. వేంగి చాళుక్యులు తమ రాగి నాణేలపై సింహ చిహ్నాన్ని అలాగే ఉంచి, కలశ చిహ్నాన్ని శ్రీవాస్తవ చిహ్నంగా మార్చారు. వారు ఒక వచనాన్ని కూడా జోడించారు. వేంగి చాళుక్యుల మరో నూతన ఆవిష్కరణ బెజ్జాలతో కూడిన నాణేలను ప్రవేశపెట్టడం. రాజరాజ నరేంద్రుని నాణెం దీనికి ఒక చక్కటి ఉదాహరణ.
1896లో బర్మా, అరాకన్ తీరంలోని ద్వీపాలలో మొట్టమొదటిసారిగా వేంగి చాళుక్యుల బంగారు నాణేల నిధి బైటపడింది. ఇది ఈ రాజవంశపు సముద్రయాన సంప్రదాయాలను రుజువు చేసింది. ఈ రాజవంశానికి చెందిన ఇతర బంగారు నాణేల నిధులు గూడూరు, ధవళేశ్వరంలో వెలుగులోకి వచ్చాయి.
తెలుగు చోడుల నాణేలు
1913లో కోడూరులో మన దేశంలోనే అతిపెద్దదైన 16,586 బంగారు నాణేల నిధి వెలుగు చూడటంతో, ఆ నిధిలోని అధికశాతం నాణేలు తెలుగు చోడులకు చెందినవని నిర్థారణ అయ్యింది. ఈ నాణేలపై భుజబల, భుజబలవీర అనే బిరుదులు ఉన్నాయి. ఈ నాణేలు, పాలకుల పేర్లను కాకుండా కేవలం రాజుల బిరుదులను మాత్రమే కలిగి ఉండే కళ్యాణ చాళుక్యులు, కాకతీయుల వంటి మధ్యయుగ దక్కన్ రాజ వంశాల సంప్రదాయాన్ని కొనసాగించాయి. తెలుగు చోడులు ఆంధ్ర ప్రాంతంలోని స్థానిక రాజులు. వీరు చోళ రాజవంశ పాలకుల నుండి విడివడినవారు. శాసన ఆధారాల ప్రకారం, వీరు నెల్లూరు, కడప, చిత్తూరులోని కొన్ని భాగాలను పాలించారు. చోళుల శక్తి క్షీణించిన తరువాత, వీరు చోళ సామ్రాజ్యపు ఈ ఉత్తర భాగాలపై నియంత్రణ సాధించారు. చరిత్రకారులు తెలుగు చోడ రాజులను వారి పాలనా ప్రాంతం, రాజధాని పేరు ఆధారంగా రేణాడు, పొట్టపి, నెల్లూరు, కొణిదేన, వెలనాటి, కందూరు, హేమ వతి చోళులు వంటి వివిధ శాఖలుగా వర్గీకరిం చారు. వీరందరూ కరికాల చోళుని నుండి తమ వంశం వచ్చిందని చెప్పుకున్నారు. వీరు చోళులకు లేదా చాళుక్యులు, కాకతీయుల వివిధ శాఖల అధీనంలో ఉండేవారు.
భుజబల అనే బిరుదును కలిగి ఉన్న తెలుగు చోడుల ఒక సాధారణ బంగారు నాణెం చూడవచ్చు.
సారాంశం
తెలుగు భాషాభివృద్ధిలో వేంగి చాళుక్యుల, తెలుగు చోడుల కాలాన్ని స్వర్ణయుగంగా పరిగణించవచ్చు. మన చరిత్ర పునర్నిర్మాణం కోసం ఆనాటి నాణేలను క్షుణ్ణంగా అధ్యయనం చేయవలసి ఉంది.





