News

వేదఘోషతో పులకించిన ఉల్లిపాలెం

0views

అభినవ మేల్కోటగా పేరుగాంచిన కృష్ణా జిల్లా  ఉల్లిపాలెం గ్రామం వేదఘోషతో పులకించింది.  గ్రామంలోని శ్రీగోద, రాజ్యలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామి ఆలయంలో ప్రారంభమైన శ్రీమన్నారాయణ మహా యజ్ఞం కనులపండువగా సాగుతోంది.  ఉత్సవమూర్తులను ప్రత్యేక పూజల అనంతరం తిరుచ్చిపై ఊరేగింపుగా యాగశాల వద్దకు తీసుకువెళ్లారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదికలో స్వామివార్లకు అభిషేకాలు నిర్వహించారు. ఆలయ నిర్మాణకర్త, అష్టాక్షరీ పీఠాధిపతి త్రిదండి అష్టాక్షరీ సంపత్‌కుమార రామానుజ జీయర్‌ స్వామిజీ పర్యవేక్షణలో రుత్వికులు పంచరామ ఆగమశాస్త్రబద్ధంగా హోమాలను ప్రారంభించారు. 13 యాగశాలల్లోని 108 హోమ గుండాల ద్వారా 250 మంది రుత్వికులు ఈ మహా యజ్ఞానాన్ని నిర్వహించారు. మహాలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని కూడా యాగశాల వద్ద నెలకొల్పారు. భక్తులకు కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఇష్టి హోమగుండాల వద్ద భక్తులు హోమక్రతువులు నిర్వహించారు. రుత్వికుల మంత్రోచ్చరణ నడుమ మహాలక్ష్మి ఇష్టి హోమాలను కూడా వైభవోపేతంగా జరిపారు. విజయవాడ, నల్గొండ, హైదరాబాద్‌, బెంగళూరు, గుంటూరు ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని తరించారు.

అక్షయతృతీయ పూజలు

ఆలయంలోని రాజ్యలక్ష్మి, గోదాదేవి అమ్మవార్లకు రుత్వికులు అక్షయ తృతీయ పూజలను భక్తిప్రపత్తులతో నిర్వహించారు. అమ్మవార్లకు వివిధ రకాల బంగారు, గర్భాలయంలోని శ్రీమన్నారాయణుడి 11 అడుగుల ఏకశిలా మూలమూర్తికి వజ్రవైఢూర్యాలు పొదిగిన ఆభరణాలను అలంకరించారు. మహిళలతో సామూహిక కుంకుమార్చన, విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. దివిసీమ చరిత్రలోనే జరుగుతున్న అతిపెద్ద మహాయజ్ఞంలో వివిధ పీఠాలకు చెందిన స్వామిజీలు పాల్గొని భక్తులకు అనుగ్రహభాషణ చేశారు. అష్టాక్షరీ సంపత్‌కుమార రామానుజ జీయర్‌ స్వామిజీతో పాటు కర్నూలకు చెందిన త్రిదండి అష్టాక్షరీ బృందావన రామానుజ జీయర్‌ స్వామిజీ, కర్నాటకలోని మేల్కోటకు చెందిన త్రిదండి శఠగోపముని రామానుజ జీయర్‌ స్వామిజీ, భీమవరా నికి చెందిన రంగరామానుజ జీయర్‌ స్వామిజీ, హైదరాబాద్‌కు చెందిన త్రిదండి దేవనాథ రామా నుజ జీయర్‌ స్వామిజీ పాల్గొన్నారు. ఈ యజ్ఞంలో భక్తులందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సోమవారం రెండు వేల మంది భక్తులకు అన్నసమారాధన నిర్వమించారు. ఈ నెల 29వరకు ప్రతి రోజు హోమాలు జరుగుతాయని అష్టాక్షరీ స్వామిజీ చెప్పారు.