News

సాగర తీరం.. విన్యాసాలకు సిద్ధం

198views

దేశ రక్షణ, భారత భూభాగంలోకి టెర్రరిస్టులు, శత్రువులు సముద్ర మార్గన చొరబడి దాడి చేసినప్పుడు, వారిని ఏ విధంగా ప్రతిఘటించాలి, ఉగ్రవాద నిర్మూలన, శత్రు దేశాలతో యుద్ధ సమయంలో నిర్వహించే దాడులు.. ఇలా కళ్లకు కట్టేలా విన్యాసాలు నిర్వహించేందుకు భారత రక్షణ దళాలు కాకినాడకు చేరుకున్నాయి. తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో మన త్రివిధ దళాలతో పాటు అమెరికా రక్షణ దళాలు సంయుక్తంగా టైగర్‌ ట్రయాంఫ్‌ పేరిట ఇప్పటికే విశాఖపట్నం సముద్ర తీరంలో విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. వాటికి కొనసాగింపుగా కాకినాడ రూరల్‌ మండలం సూర్యారావుపేట నావెల్‌ ఎన్‌క్లేవ్‌ సమీపంలోని పాత ఎన్టీఆర్‌ బీచ్‌ వద్ద మంగళవారం నుంచి ఈ నెల 29 వరకూ సంయుక్త విన్యాసాలు జరగనున్నాయి. యాంఫీబీఎస్‌ (ఉభయ చర) అంటే సముద్రంతో పాటు ఒడ్డున ఈ విన్యాసాలు చేపట్టనున్నారు. ఇప్పటికే నేవీ సిబ్బందితో పాటు ఆర్మీ, ఎయిర్స్‌ ఫోర్స్‌ సిబ్బంది కాకినాడ తీరానికి చేరుకున్నారు. భారత్‌, అమెరికా సంయుక్త విన్యాసాలకు రక్షణ దళాలు వస్తుండడంతో భద్రతా చర్యలు చేపట్టారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను ఎస్పీ ఎస్‌.సతీష్‌ కుమార్‌ సోమవారం పరిశీలించారు. హెలీ ప్యాడ్‌, ఓల్డ్‌ ఎన్టీఆర్‌ బీచ్‌, నావెల్‌ ఎన్‌క్లేవ్‌ను పరిశీలించి భద్రతా చర్యలు, బందోబస్తుపై నేవీ అధికారులతో సంప్రదించారు.

ప్రజలను అనుమతి లేదు : ఎస్పీ
ఎస్పీ సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ సూర్యారావుపేటలో నాలుగు రోజుల పాటు భారత్‌, అమెరికా రక్షణ దళాల సంయుక్త విన్యాసాలు జరిగే అవకాశం ఉందన్నారు. వీటిని చూసేందుకు ప్రజలకు అనుమతి లేదన్నారు. అత్యాధునిక యుద్ధ నౌకలు, యుద్ధ ట్యాంకర్లతో పాటు భారత్‌, యూఎస్‌కు చెందిన సుమారు 800 మంది సిబ్బంది, అధికారులు పాల్గొంటారన్నారు. టైగర్‌ ట్రాయాంఫ్‌ విన్యాసాల కారణంగా కాకినాడ – ఉప్పాడ బీచ్‌ రోడ్డులో మంగళవారం నుంచి ఈనెల 29 వరకూ రాకపోకలకు అనుమతి లేదన్నారు. వాహనదారులు అచ్చంపేట జంక్షన్‌, పిఠాపురం మీదుగా రాకపోకాలు సాగించాలన్నారు. ఎస్పీతో డీఎస్పీ హనుమంతరావు, కాకినాడ రూరల్‌ సీఐ కె.శ్రీనివాస్‌, తిమ్మాపురం ఎస్సై రవీంద్రబాబు, సిబ్బంది ఉన్నారు.