News

శ్రీవారి భక్తులకు డ్రైవర్ల నిలువు దోపిడీ

379views

తిరుమల శ్రీవారిమెట్టు నడక మార్గంలో ప్రైవేటు ట్యాక్సీలు, ఆటోవాలాలు నయా దందాకు తెరతీశారు. శ్రీవారి దర్శనార్థం వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి చేరుకున్న భక్తులకు టైమ్‌ స్లాట్‌ టోకెన్లలతో పాటు తిరుమలలో సురక్షితంగా చేర్చుతామంటూ ఒక్కో భక్తుడి నుంచి రూ.500 నుంచి రూ.2,500 వరకు డిమాండ్‌ చేస్తున్నారు. నగరంలోని రైల్వేస్టేషన్‌, బస్టాండు, శ్రీనివాసం, విష్ణునివాసం ప్రాంతాల నుంచి భక్తులను మాయమాటలతో తిరుపతిలో టైమ్‌ స్లాట్‌ టోకెన్లు పొందాలంటే కష్టమని, తమతో వస్తే శ్రీవారిమెట్టు వద్ద క్షణాల్లో టోకెన్లు ఇప్పించడంతో పాటు ట్యాక్సీల్లో తిరుమలకు తీసుకెళ్తామంటూ బురిడీ కొట్టిస్తున్నారు. దీంతో భక్తులు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తూ శ్రీవారిమెట్టు వద్దకు చేరుకుంటున్నారు. ఇక్కడ కాలినడకన వెళ్లే భక్తులకు రోజుకు మూడు నుంచి నాలుగు వేలు టోకెన్లు ఇస్తున్నారు.

ఇక్కడ టోకెన్లు అయిపోవడంతో భక్తులు ఉసూరుమంటూ కాలినడకన తిరుమల వెళ్తున్నారు. గతంలో శ్రీవారిమెట్టు మార్గంలో 1200వ మెట్టు వద్ద టోకెన్లు జారీ చేస్తుండటంతో భక్తులు ఎలాంటి సమస్యలు లేకుండా టైమ్‌ స్లాట్‌ టోకెన్లు తీసుకుని తిరుమల వెళ్లేవారు. కరోనా సమయం, శ్రీవారిమెట్టు మార్గంలో చిరుతపులి, ఎలుగుబంట్ల సంచారం ఉండటంతో టిటిడి శ్రీవారిమెట్టు ప్రవేశమార్గం వద్దనే టోకెన్లు జారీ చేస్తుండటంతో ప్రైవేట్‌ వాహనాల డ్రైవర్లు శ్రీవారి దర్శనం అవకముందే భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఈ దందాలను అరికట్టాలంటే 1,200 వద్ద మెట్టు వద్ద టోకెన్లు ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు.

Source : ఈనాడు