
అప్పన్నా.. అంటూ ఆత్మీయంగా పిలిస్తే నేనున్నాంటూ అభయమిచ్చే వరాహలక్ష్మీ నృసింహ స్వామివారి సన్నిధానంలో ఫాల్గుణ బహుళ విదియ ఈ నెల 26వ తేదీ నుంచి ఫాల్గుణ బహుళ సప్తమి ఏప్రిల్ 1 వరకు శ్రీసుదర్శన నారసింహ మహాయజ్ఞాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు సింహాచలం దేవస్థానం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆలయ ఉత్తర గోపురం ఎదురుగా ఉన్న కల్యాణోత్సవం ప్రాంగణంలో నిర్వహించే యాగానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. యాగశాల నిర్మాణం, హోమగుండాల ఏర్పాటు, భక్తులు కూర్చునేందుకు సదుపాయాలు, తాగునీరు, ఇతర వసతులు కల్పించనున్నట్లు ఈవో సింగల శ్రీనివాసమూర్తి తెలిపారు.
భక్తులకు కల్పించే సదుపాయాలివే..
ఈ మహాయజ్ఞంలో పాల్గొనే భక్తులు రూ.3 వేలు రుసుము చెల్లించి ప్రత్యక్ష, పరోక్ష విధానంలో పాల్గొనవచ్చు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే యాగంలో భక్తులు పాల్గొంటారు. యజ్ఞంలో పాల్గొనే భక్తులకు ఉదయం అల్పాహారం సమ కూర్చుతారు. అలాగే మధ్యాహ్నం ప్రత్యేక అన్నప్రసాదం ఉంటుంది. అంతరాలయంలో ప్రత్యేక దర్శనం కల్పిస్తారు. ఉభయదాతలతో పాటు మరో ఇద్దరికి ఈ సదుపాయాలు అందుతాయి. పాల్గొన్న ఉభయదాతలకు శాలువ, రవిక, కల్యాణం లడ్డు, అరకిలో పులిహోర ప్రసాదం, స్వామివారి రాగి ప్రతిమ అందజేస్తారు. పరోక్ష సేవలో పాల్గొనే భక్తులకు యూట్యూబ్ ద్వారా వీక్షించే సదుపాయంతో పాటు ప్రసాదం, రాగి ప్రతిమ తపాలా ద్వారా పంపిస్తారు.

ఈ విధంగా పాల్గొనవచ్చు
మహాయజ్ఞంలో పాల్గొనాలనుకునే భక్తులు సింహగిరిపైన, కొండ దిగువన శ్రీదేవి కాంప్లెక్సుతో ఆలయంలో కౌంటర్ల ద్వారా రూ.3వేలు చెల్లించి టికెట్లు తీసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా
ద్వారా టిక్కెట్లు పొందవచ్చు. అలా పొందిన టికెట్లకు సంబంధించిన వివరాలను 63038 00739 నెంబర్‌కు వాట్సాప్ ద్వారా సమాచారాన్ని దేవస్థానానికి అందించాలి. దూర ప్రాంతాల నుంచి యజ్ఞానికి వచ్చే భక్తులకు వసతి సదుపాయం కూడా దేవస్థానం సమకూర్చుతుంది.
అయిదేళ్ల తర్వాత..
సింహాచలం క్షేత్రంలో అయిదేళ్ల తర్వాత ఈ మహత్తర యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. లోక కల్యాణంతో పాటు భక్తుల కోర్కెలు తీరేందుకు, స్వామి అనుగ్రహం కలిగేందుకు ఆలయ వైదిక పెద్దల పర్యవేక్షణలో చతుర్వేద హవన పూర్వక పాంచాహ్నిక పంచకుండాత్మకంగా ఈ శ్రీసుదర్శన నారసింహ మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 26న ఉదయం ప్రారంభమై ఏప్రిల్ 1న మహా పూర్ణాహుతి, శాంతి కల్యాణోత్సవంతో పరిపూర్ణమవుతుంది. యాగంలో పాల్గొనే భక్తులు ఈ నెల 27 నుంచి 31 వరకు నిర్ణీత రుసుము చెల్లించి భాగస్వాములు కావచ్చు.
భక్తులు సద్వినియోగం చేసుకోవాలి
సింహాచలం క్షేత్రంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ యజ్ఞంలో పాల్గొనే అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలి. ఇలాంటి మహత్తరమైన యజ్ఞాలు భక్తులు వ్యక్తిగతంగా నిర్వహించడం ఎంతో ఆర్థిక భారంతో కూడుకున్నది. లోక కల్యాణం సంకల్పిస్తూ చేస్తున్న ఈ మహాయజ్ఞంలో భక్తులను కూడా భాగస్వామ్యం చేయాలన్న మంచి ఉద్దేశంతో పరిమిత రుసుముతో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నాం. చందన స్వామి కృపను భక్తులకు చేరువ చేయాలన్నదే దేవస్థానం లక్ష్యం.-సింగల శ్రీనివాసమూర్తి, కార్యనిర్వహణాధికారి, సింహాచలం దేవస్థానం





