News

సింహాచలం దేవస్థానంలో శబలా భోజన పండగ

208views

దేశంలో ప్రకృతి వ్యవసాయాన్ని ఉద్యమంలా విస్తరించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర దేవాదాయశాఖ అదనపు కమిషనర్‌, అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.రామచంద్రమోహన్‌ అన్నారు. సొసైటీ ఫర్‌ అవేర్‌నెస్‌ అండ్‌ విజన్‌ ఆన్‌ ఎన్విరాన్‌మెంట్ (సేవ్‌) సంస్థ ఆధ్వర్యంలో సింహాచలం దేవస్థానం కృష్ణాపురం గోశాల ఆవరణలో జరిగిన శబలా భోజన పండగలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. సుభాష్‌ పాలేఖర్‌ లాంటి వారి ప్రోత్సాహంతో ఇప్పుడిప్పుడే గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంపై రైతులు, వినియోగదారులకు అవగాహన కలిగిందన్నారు.

సింహాచలం దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ ప్రజల్లో ప్రకృతి ఆహారంపై అవగాహన కల్పించేందుకు సేవ్‌ సంస్థ చేపట్టిన కార్యక్రమం అభినందనీయమన్నారు. సేవ్‌ సంస్థ వ్యవస్థాపకుడు విజయ్‌రామ్‌ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయదారులను వినియోగదారులతో అనుసంధానం చేయడమే లక్ష్యంగా ఈ శబలా భోజన పండగలు నిర్వహిస్తున్నా మన్నారు. తొలుత అతిథులకు నిర్వాహకులు దేశీయ వరి కంకులు, ఖాదీ వస్త్రాలను అందజేసి సత్కరించారు. మధ్యాహ్నం సుమారు 30 వరి రకాలతో వండిన భోజనాన్ని ఔత్సాహికులకు వడ్డించారు. కార్యక్రమంలో సింహాచలం దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్‌, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, డీఈ హరిరాజు, ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు ఔత్సాహికులు పాల్గొన్నారు.

శబలా భోజన పండుగలో ఏర్పాటు చేసిన పలు శిబిరాలు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకున్నాయి. సుమారు 96 రకాల వరి వంగడాలను ప్రదర్శనలో ఉంచారు. సంప్రదాయ ఇత్తడి పాత్రల ప్రదర్శన అలనాటి రోజులను గుర్తు చేశాయి. ప్రస్తుత సమాజం మరిచిపోతున్న వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరల విత్తనాలు, సుగంధ ద్రవ్యాల విత్తనాలను కూడా ఈ ప్రదర్శనలో ఉంచారు.