
విశాఖపట్నంలో సేవ్ (సొసైటీ ఫర్ అవేర్‌నెస్ అండ్ విజన్ ఆన్ ఎన్విరాన్‌మెంట్) ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కృష్ణాపురంలోని సింహాచలం దేవస్థానం గోశాల ఆవరణలో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు శబలా భోజన పండగ నిర్వహించనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, ప్రకృతి వ్యవసాయ సాధకుడు విజయ్‌రామ్ తెలిపారు. ఈనెల 26వ తేదీ వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు సుమారు రెండు వేల మందికి ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన సుమారు 30రకాల దేశీయ బియ్యంతో తయారు చేసిన భోజనం వడ్డించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రకృతి వ్యవసాయవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్ పాలేకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఔత్సాహికులకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తారన్నారు. ప్రతిరోజు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు.ఈ పండగలో పాల్గొనే ఔత్సాహికులు వారు http://bit.ly/ VizagNaturalFoodFest లింకు ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని, మధ్యాహ్న భోజనానికి స్టీలు కంచం, గ్లాసు ఎవరిది వారు తీసుకురావాలని నిర్వాహకుడు విజయ్‌రామ్ సూచించారు. ఇక్కడ ఒకే తరహా కార్యక్రమాలు జరగనున్న నేపథ్యంలో ఔత్సాహికులు ఏదో ఒక రోజు పాల్గొనవచ్చని పేర్కొన్నారు.





