
భక్తులతో విశేష పూజలందుకుంటున్న ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ చిన్న తిరునాళ్ల మహోత్సవాలు మార్చి 25 నుంచి 29వరకు వైభవంగా జరగనున్నాయి. ఇందుకోసం ఆలయ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. తిరునాళ్ల మహోత్సవాలు జరిగే ఐదు రోజులు, ఒక్కో రోజు ఒక్కో ఉత్సవం కనుల పండువగా జరగనుంది. ఉత్సవాల్లో అమ్మవారి పుట్టినిల్లు అనిగండ్లపాడు గ్రామం నుంచి పసుపు–కుంకుమల బండ్లు రాక ప్రధాన ఘట్టంగా నిలవనుంది. తిరునాళ్లకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలి వస్తారు.
ఇవీ ఏర్పాట్లు..
మునేరులో జల్లు స్నానాలు, పలు చోట్ల భక్తుల సౌకర్యార్థం చేతి పంపులు, శుద్ధి చేసిన తాగు నీరు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు వసతి కోసం పలుచోట్ల షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు.
● చిన్న తిరునాళ్లలో మొదటి రోజు మార్చి 25న ఉదయం 6.03 గంటలకు అఖండజ్యోతి స్థాపనతో ఉత్సవాలు మొదలవుతాయి. వేలాదిగా భక్తులు అమ్మవారికి పాలు, పొంగళ్లతో మొక్కులు తీర్చుకుంటారు. నిత్య కల్యాణ మూర్తులకు అభిషేకం ఉంటాయి.
● తిరునాళ్లలో రెండో రోజు మార్చి 26న రాత్రి 6.26 గంటలకు ఉత్సవమూర్తులను రథంపై ఉంచి గ్రామంలో రథోత్సవం (గ్రామోత్సవం) కనుల పండువగా నిర్వహిస్తారు.
● మూడో రోజు మార్చి 27 రాత్రి 8.34 గంటలకు దివ్య ప్రభోత్సవం వైభవంగా జరగనుంది. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ ఉత్సవంలో సుమారు 90 అడుగుల దివ్యప్రభపై ఉత్సవమూర్తులను ఉంచి ప్రభను ఎడ్లు లాగుతూ ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయిస్తారు.
● చిన్న తిరునాళ్లలో ప్రధాన ఘట్టమైన అమ్మవారి పుట్టింటి పసుపు–కుంకుమ బండ్లు మార్చి 28న అనిగండ్లపాడు గ్రామం నుంచి సాయంత్రం 4.12గంటలకు ప్రారంభం కానున్నాయి. అమ్మవారి పుట్టింటి వంశీకులు కొల్లా శ్రీనివాసరావు ఇంటి నుంచి ఏటా పసుపు కుంకుమలు బండ్లపై తీసుకు రావటం ఆనవాయితీగా వస్తోంది. గ్రామానికి చెందిన వారు వందల బండ్లతో పసుపు–కుంకుమ బండి వెంట పెనుగంచిప్రోలు ఆలయానికి చేరుకుంటారు.
● ఐదోరోజు మార్చి 29న భక్తుల బోనాల సమర్పణతో చిన్న తిరునాళ్ల ఉత్సవాలు ముగుస్తాయి.





