
|| ॐ ||
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
అఖిల భారతీయ ప్రతినిధి సభ
(రేషింబాగ్, నాగపూర్)
ఫల్గుణ శుక్లా (6-8) యుగాబ్ది 5125 (15-17 మార్చి 2024)
తీర్మానం-జాతీయ పునరుజ్జీవనానికి శ్రీరామ మందిరం
శ్రీరామ జన్మభూమిలో పౌష్య శుక్ల ద్వాదశి, యుగాబ్ది 5125 (22 జనవరి 2024) నాడు జరిగిన శ్రీరాంలల్లా విగ్రహం యొక్క గొప్పదైన మరియు దివ్యమైన ప్రాణ ప్రతిష్ఠ ప్రపంచ చరిత్రలోనే ఒక అపురూపమైన ఘట్టం మరియు సువర్ణాధ్యాయం. వందల ఏళ్ళగా హిందూ సమాజం చేసిన అలుపెరుగని పోరాటం, త్యాగాల ఫలితంగా, సాధువులు పీఠాధిపతుల మార్గదర్శకత్వంలో జరిగిన దేశవ్యాప్త ఉద్యమాల ఫలితంగా, సమాజంలోని వివిధ వర్గాల సమిష్టి సంకల్పం ఫలితంగా శతాబ్దాల పాటు సాగిన ప్రతిఘటన ఉద్యమంలో సుదీర్ఘ అధ్యాయానికి ఒక ఆనందకరమైన పరిష్కారం లభించింది. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ పవిత్రమైన రోజును వీక్షించే ఉదాత్తమైన అవకాశాన్ని అందించేందుకు కృషి చేసిన అనేక మంది పరిశోధకులు, పురావస్తు శాస్త్రవేత్తలు, ఆలోచనాపరులు, న్యాయనిపుణులు, మీడియా, అమరులైన కరసేవకులు, ప్రభుత్వం, పరిపాలనతో సహా ఉద్యమంలో పాల్గొన్న మొత్తం హిందూ సమాజం యొక్క గొప్ప సహకారం ప్రస్తుతించదగినవి. అఖిల భారతీయ ప్రతినిధి సభ ఈ పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమర వీరులందరికీ నివాళులు ఆర్పిస్తుంది. మరియు పైన పేర్కొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తుంది.
అయోధ్య శ్రీరామ మందిరంలో పునీతమైన పవిత్ర అక్షతల పంపిణీ కార్యక్రమంలో యావత్ సమాజం చురుగ్గా పాల్గొంది. లక్షలాది మంది రామభక్తులు అన్ని పట్టణాలు చాలా గ్రామాల్లో కోట్లాది కుటుంబాలను కలుసుకున్నారు. 2024 జనవరి 22న భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గొప్ప గొప్ప కార్యక్రమాలు నిర్వహించారు. ఇళ్లలో భగవధ్వజాలను ఎగురువేయడం, దేవాలయాలు ధార్మిక ప్రదేశాలలో ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు సమాజంలో కొత్త శక్తిని నింపాయి.
అయోధ్యలో రాంలల్లా ప్రాణ ప్రతిష్ఠ రోజున ధార్మిక, రాజకీయ, సామాజిక రంగాలలో అగ్రనాయకత్వంతో పాటు అన్ని మతాలు, వర్గాలు, సంప్రదాయాలకు చెందిన గౌరవనీయులైన పీఠాధిపతులు పాల్గొన్నారు. శ్రీరాముని విలువలు ఆధారంగా సామరస్యపూర్వకంగా, వ్యవస్థీకృత జాతీయ జీవనాన్ని నిర్మించడానికి తగిన వాతావరణాన్ని సృష్టించడాన్ని ఇది సూచిస్తుంది. ఇది భారతదేశం యొక్క జాతీయ పునరుజ్జీవనం యొక్క మహిమాన్విత యుగ ప్రారంభానికి సంకేతం. శ్రీరామజన్మభూమిలో జరిగిన ప్రాణ ప్రతిష్టతో పరాయి పాలన, పోరాట కాలంలో తలెత్తిన ఆత్మన్యూనత భావం, ఆత్మ విస్మృతి వంటి లక్షణాల నుండి సమాజం బయటపడుతోంది. హిందుత్వ స్ఫూర్తిలో మునిగిపోయిన సమాజమంతా తన ‘స్వ’ (స్వీయత్వం) గుర్తించడానికి, తదనుగుణంగా జీవించడానికి సిద్ధమవుతోంది.
సమాజం కోసం, దేశం కోసం త్యాగం చేయడానికి, సామాజిక కట్టుబాట్లకు లోబడి జీవించడానికి మర్యాదపురుషోత్తముడైన శ్రీరాముడి జీవితం మనకు స్పూర్తినిస్తుంది. విశ్వజనీనమైన, శాశ్వతమైన ఆయన పాలన ‘రామరాజ్యం’ పేరుతో ప్రపంచ చరిత్రలో స్థానం సంపాదించుకుంది, క్షీణిస్తున్న జీవన విలువలు, తగ్గుతున్న మానవ సున్నితత్వం, పెరుగుతున్న విస్తరణవాద హింస, క్రూరత్వం మొదలైన సవాళ్లను యావత్ ప్రపంచం ఎదుర్కోవడానికి రామరాజ్యం అనే ఈ భావన నేటి ప్రపంచానికి అనుసరణీయం.
శ్రీరామమందిరం పునఃనిర్మాణ లక్ష్యం అర్ధవంతంగా ఉండేలా మర్యాదాపురుషోత్తముడు శ్రీరాముని ఆదర్శాలను తన జీవితంలో పాటించడానికి యావత్ సమాజం ప్రతిజ్ఞ చేయాలని ప్రతినిధి సభ అభిప్రాయపడింది. శ్రీరాముని జీవితంలో ప్రతిబింబించే త్యాగం, ఆప్యాయత, న్యాయం, పరాక్రమం, సద్భావన, నిష్పాక్షికత వంటి ధర్మం యొక్క శాశ్వత విలువలను సమాజంలో తిరిగి పాదుకొల్పడం చాలా అవసరం. అన్ని రకాల పరస్పర కలహాలు, వివక్షలను రూపుమాపడం ద్వారా సామరస్యంతో కూడిన పురుషార్థి సమాజాన్ని నిర్మించడమే శ్రీరాముని నిజమైన ఆరాధన అవుతుంది.
సౌభ్రాతృత్వం, కర్తవ్యనిష్ఠ, విలువల ఆధారిత జీవితం మరియు సామాజిక న్యాయాన్ని సుస్థిరం చేసే సమర్థవంతమైన భారతదేశాన్ని నిర్మించాలని అఖిల భారతీయ ప్రతినిధి సభ భారతీయులందరికీ పిలుపునిస్తోంది. ఈ ప్రతిపాదికన, సార్వత్రిక సంక్షేమాన్ని సశక్తం చేసే ప్రపంచ వ్యవస్థను రూపొందించడంలో భారతదేశం ప్రముఖ పాత్ర పోషిస్తుంది.





