News

శ్రీకాళహస్తిలో వైభవంగా వసంతోత్సవం

261views

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం వైభవంగా వసంతోత్సవం నిర్వహించారు. ముందుగా నూతన వధూవరులైన శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞానప్రసూనాంబ అమ్మవార్ల ఉత్సవమూర్తులను వసంత మండపంలో కొలువుదీర్చారు. ఆదిదంపతులకు విశేష అభిషేకాలు జరిపించారు. అనంతరం ఉత్సవర్లను పురవీధుల్లో ఊరేగించారు. ఈ క్రమంలో సూర్య పుష్కరిణి వద్ద త్రిశూలానికి ఆగమోక్తంగా అభిషేకం చేశారు.

ఉత్సవాల్లో భాగంగా రాత్రి ధ్వజావరోహణ కార్యక్రమాన్ని శైవాగమన శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ క్రమంలో ముందుగా స్వామివారి గర్భాలయం వద్ద ధ్వజస్తంభానికి త్రిశూలంతో పాటు జ్ఞానప్రసూనాంబ సమేత సోమస్కంధమూర్తి ఉత్సవమూర్తులకు సంకల్ప పూజలు చేపట్టారు. అనంతరం ధ్వజస్తంభం నుంచి ధ్వజ పటం, దవళవస్త్రంతోపాటు భక్తులు సమర్పించిన చీరలను కిందకు దింపారు. ధ్వజస్తంభ పీఠానికి అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. యాగశాలలో ఏర్పాటు చేసిన యాగ కలశాలను ఉద్వాసన చేసి ఊరేగింపుగా తీసుకెళ్లి ధృవమూర్తులకు అభిషేకం చేశారు. రాత్రి 10.30గంటలకు స్వామి అమ్మవార్లు సింహాసనం, కామధేనువు వాహనాలపై పురవీధుల్లో ఊరేగారు. కార్యక్రమాల్లో ఆలయ పాలకమండలి చైర్మన్‌ అంజూరు తారక శ్రీనివాసులు, ఈఓ నాగేశ్వరరావు పాల్గొన్నారు.ఈక్రమంలో శుక్రవారం రాత్రి స్వామి, అమ్మవార్లకు పల్లకీ సేవ నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.