
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)-2019 కింద భారత పౌరసత్వం దరఖాస్తుదారుల కోసం త్వరలో హెల్ప్‌లైన్ ప్రారంభించనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది.
మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లో ఉంటుంది కాబట్టి దరఖాస్తుదారుల సౌలభ్యం కోసం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక పోర్టల్‌ను కూడా సిద్ధం చేసింది. దరఖాస్తుదారులు ప్రయాణ పత్రాలు లేకుండా భారత్‌లోకి ప్రవేశించిన సంవత్సరాన్ని తప్పనిసరిగా ప్రకటించాలి. డిసెంబర్ 31, 2014 కంటే ముందు భారత్‌కి వచ్చిన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎలాంటి పత్రాలు లేని ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వం మంజూరు చేయడమే పౌరసత్వ (సవరణ) చట్టం, 2019 ముఖ్య ఉద్దేశం. CAA-2019కి సంబంధించిన సమాచారాన్ని పొందేందుకు దరఖాస్తుదారులు దేశంలోని ఎక్కడి నుంచైనా టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సమాచారం తెలుసుకోవచ్చని భారత మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ సేవ ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుందని వివరించింది. పాక్, అఫ్గాన్, బంగ్లాదేశ్ నుంచి.. 2014 డిసెంబరు 31కి ముందు ఇక్కడికి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులు భారతపౌరసత్వం మంజూరు కోసం https:/indiancitizenshiponline.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పాస్‌పోర్టు సైజు ఫొటోతో పాటు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దర్యాప్తు సంస్థలు బ్యాక్‌గ్రౌండ్ పరిశీలన పూర్తిచేసిన తర్వాత వాటిని ప్రాసెస్ చేస్తారు. నిర్దేశిత అధికారి నేతృత్వంలోని జిల్లా స్థాయి కమిటీ ద్వారా సాధికార కమిటీకి ఈ దరఖాస్తును సమర్పిస్తారు. ఈ చట్టం ఎలాంటి పత్రాలు లేనివారి కోసం ఉద్దేశించినందున, దరఖాస్తుదారులు అంతకుముందు తాము నివసించిన దేశాల్లో (పాక్, అఫ్గాన్, బంగ్లాదేశ్) అక్కడి ప్రభుత్వాలు జారీ చేసిన ఏవైనా పత్రాలను అప్‌లోడ్ చేయవచ్చు.





