News

సింహాచలం అభివృద్ధికి రూ.54.4 కోట్ల కేంద్ర నిధులు

331views

కేంద్ర పథకం ప్రసాద్‌ కింద రూ.54.4 కోట్ల నిధులతో విశాఖపట్నం జిల్లా సింహాచలం దేవస్థానంలో చేపట్టబోయే వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం శంకుస్థాపన చేశారు. కశ్మీర్‌ నుంచి వర్చువల్‌ విధానంలో శిలాఫలకాలను ఆవిష్కరించారు. స్వదేశ్‌ దర్శన్‌ 2.0లో భాగంగా రూ.30 కోట్లతో బొర్రా గుహల వద్ద అదనపు సదుపాయాలకూ ఆయన శంకుస్థాపన చేశారు. కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖల ఆధ్వర్యంలో సింహగిరిపై జరిగిన కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర పర్యాటక శాఖ ఛైర్మన్‌ వరప్రసాద్‌రెడ్డి, బిజేపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.వి.ఎన్‌.మాధవ్‌ అతిథులుగా పాల్గొన్నారు.

ఈ పథకంలో భాగంగా సింహాచలం క్షేత్రంలో వివిధ సౌకర్యాలు, బస్సు షెల్టర్లు, దుకాణ సముదాయం, మెట్లమార్గం అభివృద్ధి, విశ్రాంతి గదులు, సమాచార కేంద్రం, ఫుడ్‌కోర్టులు, బస్‌స్టాండు ఆధునికీకరణ, విద్యుత్తు బస్సులు, తదితరాలు కల్పించనున్నట్లు పర్యాటక శాఖ ముఖ్య ఇంజినీరు సి.ఎస్‌.ఎన్‌.మూర్తి తెలిపారు. బొర్రాగుహల వద్ద పార్కింగ్‌, మరుగుదొడ్లు, ఫుడ్‌ప్లాజాలు, గుహల్లో విద్యుత్తు వెలుగులు తదితర సదుపాయాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.