
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయ సముదాయ నిర్మాణం డిసెంబరు నాటికి పూర్తవుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు గురువారం వెల్లడించింది. జనవరి 22న జరిగిన రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ తర్వాత ఇప్పటిదాకా దాదాపు 75 లక్షల మంది భక్తులు ఆలయాన్ని సందర్శించుకొన్నట్లు తెలిపారు. ప్రస్తుతం 1,500 మంది కార్మికులు నిర్మాణపనుల్లో నిమగ్నమై ఉన్నారని, త్వరలో మరో 3,500 మందిని అదనంగా నియమించుకోనున్నట్లు ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా వివరించారు.
ఇటీవల జరిగిన ఆలయ నిర్మాణ కమిటీ సమావేశం ఈ మేరకు నిర్ణయించిందని, కార్మికుల సంఖ్య పెంపుతో పై రెండు అంతస్తుల పనులను వేగవంతం చేస్తామన్నారు. గర్భగుడి ఉన్న మొదటి అంతస్తు నిర్మాణం గతేడాది డిసెంబరు నాటికే పూర్తయిన విషయం తెలిసిందే. ఆలయ ప్రధాన గోపురం, మరో గోపుర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొత్తం అయిదు శిఖరాలు ఉంటాయని, 161 అడుగుల ఎత్తుతో ఉండే ప్రధాన శిఖరానికి బంగారు తాపడం చేస్తామన్నారు. వర్షాకాలం మొదలయ్యేలోపు ప్రహరీ నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు.





