News

వృషభధ్వజ సంకేతంగా ముక్కంటి ఆలయంలో ధ్వజారోహణ ఘట్టం

370views

వృషభధ్వజ సంకేతంగా శ్రీకాళహస్తి ఆలయంలో నిర్వహించిన ధ్వజారోహణ ఘట్టం ఆద్యంతం వైభవంగా సాగింది. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి వారి గర్భాలయానికి ఎదురుగా ఉన్న స్వర్ణధ్వజస్తంభం వద్ద ఈ విశేషోత్సవాన్ని వేదోక్తంగా నిర్వహించారు. కొడితాడుతో పాటు వృషభధ్వజం దవళవస్త్రానికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు జరిపి ధ్వజారోహణ తంతును పూర్తి చేశారు. 4016 మంది మహిళలు చీరలు మొక్కులుగా సమర్పించుకున్నారు. బలిముద్దలు, హోమగుండంలో వేసిన నాణాల కోసం భక్తుల మధ్య తోపులాటలు జరిగాయి. నియంత్రించేందుకు భద్రతా సిబ్బంది నానా ఇబ్బందిపడాల్సి వచ్చింది. ఈవో ఎస్‌.వి.నాగేశ్వరరావు, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి సతీమణి శ్రీవాణి, ట్రస్టుబోర్డు మాజీ ఛైర్మన్‌ అంజూరు తారక శ్రీనివాసులు, అధికారులు పాల్గొన్నారు.