News

శ్రీశైలానికి వంతెన మార్గం ఏర్పాటు చేయండి ; ప్రధానికి మాజీ సీజేఐ లేఖ

310views

రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలానికి వంతెన మార్గం (ఎలివేటెడ్ కారిడార్) నిర్మించాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. “దక్షిణ కాశీగా వాసికెక్కిన ఈ క్షేత్రానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రల నుంచి ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నా రవాణా మార్గం సరిగా లేదు. 191.1 కిలోమీటర్ల 765 నంబర్ జాతీయ రహదారి హైదరాబాద్ నగరాన్ని శ్రీశైలంతో అనుసంధానిస్తోంది. ఇందులో 62. 5 కిలోమీటర్ల మార్గం నల్లమల పులుల సంరక్షణ కేంద్ర పరిధిలోకి వస్తోంది. ఈ రోడ్డు వెడల్పు 5.5 మీటర్ల నుంచి 7 మీటర్ల వరకు మాత్రమే ఉంటోంది. ఇంతటి ఇరుకుదారిలో రోజూ 30 వేల మందికి పైగా భక్తులు రాకపోకలు సాగిస్తున్నారు. పండగల సీజన్ లో ఈ సంఖ్య రోజుకు లక్ష దాకా ఉంటోంది.

నల్లమల అడవి. గుండా సాగే మార్గమంతా పిట్టగోడలు, ఇరుకైన వంతెనలు, ప్రమాదకరమైన మలుపులు, లోయలు, వంపులు, ఏటవాలులతో వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా ఉంటోంది. ఈ మార్గం పులుల సంరక్షణ కేంద్రం గుండా వెళ్తంది కాబట్టి ఇక్కడ వంతెన మార్గం ఏర్పాటుచేయాలి. దానివల్ల ఇబ్బందులు తొలగిపోయి వాహనాల రాకపోకలు సాఫీగా సాగడంతోపాటు, వన్యప్రాణులకు ముప్పు తప్పుతుంది. మీ వ్యక్తిగత చొరవతో వారణాసిలో కాశీ విశ్వనాథ్ కారిడార్ రూపుదిద్దుకొంది. మీరు చొరవ చూపితే దక్షిణ కాశీ ప్రాజెక్టూ సాకారమవుతుంది. ఈ అంశంపై గత ఏడాది ఫిబ్రవరిలో నేను రాసిన లేఖకు స్పందించిన కేంద్ర, రహదారి రవాణాశాఖ కార్యదర్శి శ్రీశైలం మార్గాన్ని మెరుగుపరిచేందుకు డీపీఆర్ తయారీ కోసం కన్సల్టెంట్ను నియమించినట్లు మే 24న నాకు సమాధానం పంపారు. మీరు మరోసారి దీనిపై దృష్టిసారించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలి. శివరాత్రి సందర్భంగా ప్రధానమంత్రి కార్యాలయం తెలుగు రాష్ట్రాల భక్తులకు దీన్నో బహుమతిగా ప్రకటిస్తే సంతోషకరంగా ఉంటుంది’ అని జస్టిస్ ఎన్.వి.రమణ ప్రధానిని కోరారు.