
కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లలో కీలక ఘట్టమైన సిడిబండి వేడుక గురువారం ఘనంగా జరిగింది. ఉత్సవాల్లో 11వ రోజున జరిగే ఈ సంబరాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అశేషంగా తరలి వచ్చారు. శివాలయం వీధి చివర ప్రస్తుత సచివాలయ ప్రాంతంలో ప్రత్యేకంగా తయారు చేసి సిడిబండి అక్కడ నుంచి బయలుదేరింది. ముందుగా కరణం బజారు వద్ద తొలి పూజలు నిర్వహించారు. సుమారు మూడు గంటలు ఉత్సవం అంగరంగ వైభవంగా సాగింది. సిడిబండి బయలు దేరిన సమయంలో మహిళలు పూజలు నిర్వహించి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆలయ ప్రాంగణానికి చేరుకునే వరకు దారి పొడవునా పసుపు నీళ్లు వారపోసి కర్పూర హారతులిచ్చారు. సిడిబండి ఉట్టికి కట్టిన గుమ్మడికాయలు పొందడానికి భక్తులు పోటీ పడ్డారు. ఈ వేడుక కోసం ఉయ్యూరులో ఎస్సీ కులానికి చెందిన ఓ పెళ్లికాని యువకుడిని పెళ్లి కుమారుడిగా సిద్ధం చేయడం ఆనవాయితీ కాగా.. ఈ ఏడాది అనుపమ్‌ను మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయ ప్రాంగణానికి తీసుకొచ్చారు. అనంతరం అతడిని సిడిబండికి కట్టిన వెదురుబుట్టలో కూర్చోబెట్టారు. ఆ సమయంలో భక్తులు అతడిని అరటి కాయలతో కొట్టడం సంప్రదాయం.





